Skip to main content

TSPSC Group 1 Notification: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల, పెరిగిన పోస్టుల సంఖ్య, దరఖాస్తులు ఎప్పటినుంచంటే..

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఫిబ్రవరి 20న కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 503 గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల కోసం 2022 ఏప్రిల్‌ 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
563 Vacancies Available   State Government Department Positions   TSPSC Group 1 Notification Tspsc Group1 notification 2024   TSPSC   Group-1 Recruitment Announcement

తాజా నోటిఫికేషన్‌ మేరకు 18 శాఖల్లో 563 పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్‌ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌

  • మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • వాటిల్లో పొరపాట్లు సవరించుకునేందుకు మార్చి 23వ తేదీనుంచి 27వ తేదీ సాయంత్రం 5 వరకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చారు.
  • ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది మే లేదా జూన్‌ నెలలో నిర్వహించనున్నట్లు కమిషన్‌ తెలిపింది.
  • మెయిన్‌ పరీక్షల­ను ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలలో నిర్వహించనున్నట్లు వివరించింది.
  • పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

 వాళ్లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

వివిధ కారణాలతో 2022లో విడుదల చేసిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రద్దు చేయగా... అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, ఫీజు మాత్రం చెల్లించక్కర్లేదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ (ఆప్టికల్‌ మార్కింగ్‌) లేదా సీబీఆర్‌టీ (కంప్యూటర్‌ బేస్డ్‌) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పోస్టుల వారీగా అర్హతలు, పరీక్షల నిర్వహణ, మార్కులు, సిలబస్‌ తదితర పూర్తిస్థాయి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.  

పెరిగిన పోస్టుల సంఖ్య 
మహిళలకు హారిజాంటల్‌ (సమాంతర) పద్ధతి (ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్‌ పాయింట్‌ మార్కింగ్‌ లేకుండా)లో రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళలకు కేటగిరీల వారీగా పోస్టులను ప్రత్యేకంగా రిజర్వ్‌ చేయలేదు. కానీ మొత్తంగా 33 1/3 (33.3) శాతం ఉద్యోగాలను మాత్రం కేటాయించనుంది. ఈ క్రమంలో మల్టీజోన్ల వారీగా పోస్టులు, అదేవిధంగా జనరల్‌ కేటగిరీతో పాటు కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా ఉన్న పోస్టులను కమిషన్‌ వెల్లడించింది. తాజా నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య 60 పెరగడం గమనార్హం. 

పరిస్థితులపై చర్చించి రద్దు నిర్ణయం 
గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల విషయంలో నెలకొన్న పరిస్థితులపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఎం.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించామని, 2022 ఏప్రిల్‌ 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌ నికొలస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే.. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అవకతవకలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 503 ఉద్యోగాల కోసం ఏకంగా 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌ 16న గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. అదే ఏడాది చివర్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు అవకాశం కల్పించే లక్ష్యంతో 1:50 నిష్పత్తిలో అర్హుల జాబితాను విడుదల చేసింది.

2023 ఏడాది ఆగస్టులో మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతను ప్రారంభించారు. కానీ గతేడాది మార్చిలో పలు టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. గ్రూప్‌–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని తేలడంతో ప్రిలిమినరీ పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. 2023 జూన్‌ 11న మరోమారు ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

రెండోసారి ఏం జరిగిందంటే..
అయితే రెండోసారి టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్‌ నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ హైకోర్టు పరీక్ష రద్దుకు ఆదేశించింది. దీనిపై టీఎస్‌పీఎస్సీ సుప్రీకోర్టును ఆశ్రయించింది. అ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కా>ంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేపట్టడం, కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడం, కొత్తగా మరో 60 గ్రూప్‌–1 ఖాళీలను గుర్తించడం లాంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి.

తాజాగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించడంతో గత కొంతకాలంగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించినట్లు కమిషన్‌ తెలిపింది. అయితే గత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ..ఏ కారణాలతో రద్దు చేసిందీ పూర్తిస్థాయిలో వివరించలేదు.  

ప్రిలిమ్స్‌ మూడోసారి..! 
రికార్డు స్థాయిలో గ్రూప్‌–1 ఉద్యోగ ఖాళీలు ఉండడంతో గతంలో నిరుద్యోగులు ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కఠోర దీక్షతో అభ్యర్థులు పడిన శ్రమ వృథా ప్రయాసే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్‌ వెలువడి దాదాపు రెండు సంవత్సరాలు కాగా.. అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు రాయడం గమనార్హం. కాగా కొత్త నోటిఫికేషన్‌ జారీతో మూడోసారి ప్రిలిమ్స్‌ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

Published date : 20 Feb 2024 11:46AM
PDF

Photo Stories