Skip to main content

TSPSC: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దు! దీంతోపాటు ఈ పరీక్షలు కూడా..

సాక్షి, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షను రాష్ట్ర పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రద్దు చేసింది.
TSPSC
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దు! దీంతోపాటు ఈ పరీక్షలు కూడా..

దీనితోపాటు గత రెండు నెలల్లో నిర్వహించిన ‘అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ)’ పరీక్షలనూ రద్దు చేస్తున్నట్టు కమిషన్‌ మార్చి 17న ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రాథమిక నివేదికపై మార్చి 17న కమిషన్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. చైర్మన్, సభ్యులు, కార్యదర్శి పాల్గొన్న ఈ భేటీలో గ్రూప్‌–1 పరీక్షతో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలపై చర్చించి.. వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మిగతా పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఏడింటిలో నాలుగు పరీక్షలు రద్దు 

రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానంఅమల్లోకి వచ్చాక.. టీఎస్‌పీఎస్సీ వివిధ ప్రభుత్వ శాఖల్లో 17 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి 26 నోటిఫికేషన్లను జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటివరకు ఏడు అర్హత పరీక్షలను నిర్వహించింది. గతేడాది అక్టోబర్‌ 16న గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షలను.. నవంబర్‌ 7న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) విభాగంలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌ఓ) పరీక్షలను చేపట్టింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో విమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీడీపీఓ), అసిస్టెంట్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఏసీడీపీఓ), వేర్‌హౌజ్‌ కార్పొరేషన్‌లో మేనేజర్‌ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతపరీక్ష 2023 జనవరి 3న.. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌) పరీక్షను జనవరి 8న నిర్వహించింది. వివిధ ఇంజనీరింగ్‌ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు జనవరి 22న, ఆర్థిక శాఖలోని డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) ఉద్యోగాలకు ఫిబ్రవరి 26న, వివిధ ఇంజనీరింగ్‌ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్, టెక్నికల్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు మార్చి 5న అర్హత పరీక్షలను నిర్వహించింది. వీటిలో ఇప్పటివరకు గ్రూప్‌–1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలు రద్దయ్యాయి. 

చదవండి: TSPSC Paper Leak 2023 : టీఎస్‌పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా ర‌ద్దు..?

మిగతా మూడింటిపైనా సందేహాలు! 

ప్రశ్నపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేయగా.. మిగతా మూడు పరీక్షలపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్‌ ముందే నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌.. చివరిగా నిర్వహించిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్షలు రద్దయ్యాయి. దీంతో వీటి మధ్యలో నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేయాలన్న డిమాండ్‌ వస్తోంది. ఈ మూడింటి ప్రశ్నపత్రాలు కూడా లీకై ఉంటాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌ఓ), విమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (డబ్ల్యూసీడీఓ), చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీడీపీఓ), అసిస్టెంట్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(ఏసీడీపీఓ), వేర్‌హౌజ్‌ కార్పొరేషన్‌లో మేనేజర్‌ ఉద్యోగాల పరీక్ష, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌) పరీక్షల అంశంలో ఉత్కంఠ నెలకొంది. అయితే సిట్‌ ప్రాథమిక నివేదిక ఆధారంగా నాలుగు పరీక్షలను రద్దు చేశామని.. మిగతా పరీక్షల లీకేజీకి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి. సిట్‌ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి. 

చదవండి: TSPSC New Exam Dates 2023 : గ్రూప్-1, ఏఈ పరీక్ష కొత్త‌ తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..

గ్రూప్‌–1 మెయిన్స్‌ వచ్చే ఏడాదే! 

గ్రూప్‌–1 కేటగిరీలో 503 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటన జారీ చేసింది. 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా.. అక్టోబర్‌ 16న 2,86,051 మంది ప్రిలిమ్స్‌ రాశారు. వీరిలో జోన్లు, రిజర్వేషన్ల వారీగా మెయిన్స్‌ పరీక్షలకు 1:50 పద్ధతి (ఒక్కో పోస్టుకు 50 మంది)లో 20,050 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే పరీక్షల రద్దుతో అభ్యర్థులంతా తిరిగి సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రిలిమ్స్‌ రద్దుతో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొనగా.. అర్హత సాధించనివారిలో మాత్రం ఆశలు చిగురిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉన్నా.. ప్రిలిమ్స్‌ రద్దుతో అవీ వాయిదా పడ్డాయి. గతేడాది ప్రిలిమ్స్‌ నిర్వహించిన తేదీ, మెయిన్స్‌ పరీక్షలకు ప్రకటించిన తేదీలను పరిశీలిస్తే.. దాదాపు ఎనిమిది నెలల వ్యవధి ఉంది. ఈ లెక్కన ఈ ఏడాది జూన్‌లో మళ్లీ ప్రిలిమ్స్‌ నిర్వహిస్తే.. మెయిన్స్‌ పరీక్షలు వచ్చే ఏడాదిలోనే నిర్వహించే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 

Published date : 18 Mar 2023 04:01PM

Photo Stories