Skip to main content

50 వేల ఉద్యోగాల భర్తీపై.. నేడు కీలక సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్న 50 వేల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఆర్థిక శాఖ జూలై 11న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది.
అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై.. గతంలో ఇచ్చిన ఖాళీలపై మరోసారి తుది నిర్ధారణకు రానున్నారు. ఆదివారం శాఖల వారీగా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. జూలై నెల 13న సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నారు. మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌరసరఫరాలు, వినియోగదారుల శా ఖ, అటవీ పర్యావరణ, సాంకేతిక శాఖలతో, 10.30 గంటలకు నీటిపారుదల శాఖ, కార్మిక, ఉపాధి కల్పన, హోం, న్యాయ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు చట్టసభలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖల అధికారులు, 11.30 గంటలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం రెవెన్యూ విభాగాల అధికారులతో, 12 గంటలకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతారు. 12.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై నివేదికలు ఇవ్వనున్నారు.

పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు కూడా..
పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమావేశంలో సమర్పించనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జోనల్‌ వ్యవస్థ చిక్కుముడులు విడిపోవడం, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు ఎలాంటి ఇబ్బందులు లేనందున తక్షణమే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నుంచే ఈ కసరత్తు జరిగినా.. కోవిడ్‌ కారణంగా భర్తీ ప్రక్రియ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్త జోన్లకు ఇటీవలే రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంతో మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుంటోంది.
Published date : 11 Jul 2021 01:28PM

Photo Stories