తెలంగాణ జనాభా, అక్షరాస్యత
Sakshi Education
విస్తీర్ణం, జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో12వ స్థానంలో ఉంది. రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,51,93,978. వీరిలో అత్యధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. జనాభాలో షెడ్యూల్డు కులాలకు చెందినవారు 15.44 శాతం కాగా, షెడ్యూల్డు తరగతులకు చెందినవారు 9.34 శాతం.
- రాష్ర్ట జనాభాలో 61.33 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 38.67 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు.
- 2001-11 దశాబ్దంలో మొత్తం రాష్ర్ట జనాభావృద్ధి 13.58 శాతం. అంతకు మందు దశాబ్దంలో ఈ పెరుగుదల 18.77 శాతంగా ఉండేది. దీన్ని బట్టి జనాభా వృద్ధి నెమ్మదించిందని తెలుస్తోంది.
- 2001-11 దశాబ్దంలో రాష్ట్ర పట్టణ జనాభా 38.12 శాతం వృద్ధి చెందింది. అంత క్రితం దశాబ్దంలో ఈ వృద్ధి 25.13 శాతం మాత్రమే. దేశంలోని ఇతర ప్రాంతాలవారు తరలిరావడం, రాష్ర్టంలో అంతర్గతంగా జరిగిన వలసలు పట్టణ జనాభా పెరగడానికి దోహదం చేశాయి.
- 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా వృద్ధి 2.13 శాతం మాత్రమే.
- రాష్ర్టం మొత్తం పట్టణ జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం)లో రాజధాని నగరమైన హైదరాబాద్ జనాభా 29 శాతానికి పైనే ఉంది.
- పట్టణ జనాభాలో వేగవంతమైన పెరుగుదల వల్ల, జనాభా ఎక్కువగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే కేంద్రీకృతం కావడం వల్ల పట్టణ మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి గరిష్ట స్థాయిలో పెరిగింది.
జనసాంద్రత
- ఒక చదరపు కిలోమీటరు పరిధిలో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు.
- తెలంగాణ రాష్ర్టంలో ఆదిలాబాద్ జిల్లా జనసాంద్రత అత్యల్పం. ఈ జిల్లాలో చ.కి.మీ.కు 170 మంది మాత్రమే నివసిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా చ.కి.మీ.కు 18,172 మంది నివసిస్తున్నారు.
- రాష్ర్ట సగటు జనసాంద్రత 307. ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల జనసాంద్రత కూడా తక్కువగానే ఉంది. ఈ జిల్లాల జనసాంద్రతలు వరుసగా 175, 220.
లింగ నిష్పత్తి
- ‘ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య’ను లింగ నిష్పత్తిగా పేర్కొంటారు. 2011లో తెలంగాణ రాష్ర్టం లింగ నిష్పత్తి 988. ఇది జాతీయ స్థాయి(943) కంటే అధికం.
- నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో లింగ నిష్పత్తి 1000 కంటే అధికంగా ఉంది.
- 1991లో 967గా ఉన్న లింగ నిష్పత్తి 2001 నాటికి 971కి చేరింది.
- ఆరేళ్లలోపు బాలల లింగ నిష్పత్తి ఆందోళనకరంగా ఉంది. 2001లో 957గా ఉన్న చిన్నారుల లింగ నిష్పత్తి 2011 నాటికి 933కి తగ్గింది.
- 2011 నాటి రాష్ర్ట సగటు 988తో పోలిస్తే, ఎస్సీ జనాభా లింగ నిష్పత్తి 1,008 చాలా ఎక్కువ. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను మినహాయిస్తే, రాష్ర్టంలోని మిగతా జిల్లాల్లో ఎస్సీ జనాభా లింగ నిష్పత్తి 1000 కన్నా ఎక్కువే.
- ఎస్టీల లింగ నిష్పత్తి 980గా ఉంది. కానీ, ఆదిలాబాద్(1003), నిజామాబాద్(1017), ఖమ్మం(1022)లలో ఇది చాలా ఎక్కువ.
రాష్ర్ట జనసాంద్రత, లింగ నిష్పత్తి
జిల్లా | జనసాంద్రత (చ.కి.మీ.కు) | లింగ నిష్పత్తి |
మహబూబ్‌నగర్ | 220 | 977 |
రంగారెడ్డి | 707 | 961 |
హైదరాబాద్ | 18,172 | 954 |
మెదక్ | 313 | 992 |
నిజామాబాద్ | 321 | 1,040 |
ఆదిలాబాద్ | 170 | 1,001 |
కరీంనగర్ | 319 | 1,008 |
వరంగల్ | 273 | 997 |
ఖమ్మం | 175 | 1,011 |
నల్గొండ | 245 | 983 |
తెలంగాణ | 306 | 988 |
భారతదేశం | 382 | 943 |
సమగ్ర కుటుంబ సర్వే, 2014
- సమగ్ర కుటుంబ సర్వే పేరుతో 2014 ఆగస్టు 19న రాష్ర్టమంతటా ఇంటింటి సర్వేను ప్రభుత్వం నిర్వహించింది.
- కేవలం ఒక్క రోజులోనే ఈ సర్వేను పూర్తి చేసింది. గణాంక సమాచార సేకరణ పరంగా దేశంలోనే ఇది ఒక విశిష్టమైన ప్రక్రియ.
- రాష్ర్టంలోని అన్ని కుటుంబాలకు సంబంధించి పటిష్ట గణాంక సమాచార నిధిని సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.
- ఈ సర్వే వల్ల అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వానికి వీలవుతుంది.
- గ్రామీణ, పట్టణ కుటుంబాల సమాచారం అంతటినీ ప్రభుత్వం ఈ సర్వేతో క్రోడీకరించింది.
- కుటుంబాల వివరాలు, వారి ఆవాస వసతి, కుటుంబ సభ్యుల వివరాలు, వైకల్యాలు, దీర్ఘవ్యాధులు, భూమి, పశు సంపద మొదలైన వివరాలను సేకరించడానికి 3,85,892 మంది గణికులను ప్రభుత్వం వినియోగించింది.
- పింఛన్లు, ఆహార భద్రత మొదలైన ప్రభుత్వ అగ్రగామి పథకాల అమలుకు, ప్రభుత్వ శాఖలన్నింటికీ ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది.
- సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం రాష్ర్టంలో 101.83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రాష్ర్ట సగటు కుటుంబ పరిమాణం 3.56గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 16.56 లక్షల కుటుంబాలుండగా, ఆదిలాబాద్‌లో 8.17 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నాయి.
అక్షరాస్యత
- రాష్ర్టంలో అక్షరాస్యత స్థాయి 66.46 శాతం. ఇది జాతీయ స్థాయి సగటు (72.99 శాతం)తో పోలిస్తే తక్కువ.
- అల్పాదాయ రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల కన్నా తెలంగాణలో అక్షరాస్యత తక్కువగా ఉంది.
- మహబూబ్‌నగర్ జిల్లా అక్షరాస్యత 55.04 శాతం మాత్రమే. ఇది రాష్ర్టంలోనే అత్యల్పం. 83.25 శాతం అక్షరాస్యతో హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.
- స్త్రీ, పురుషుల అక్షరాస్యతలోనూ తీవ్ర వ్యత్యాసం ఉంది. పురుషులలో అక్షరాస్యత స్థాయి 74.95 శాతం కాగా, మహిళల అక్షరాస్యత స్థాయి 57.92 శాతం మాత్రమే.
- ఎస్సీ, ఎస్టీల అక్షరాస్యత స్థాయిలు వరుసగా 58.90, 49.51 శాతం మాత్రమే.
- రాష్ట్రంలో 40.3 శాతం మంది ఎస్సీ విద్యార్థులు, 62.8 శాతం మంది ఎస్టీ విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు.
జిల్లాల వారీగా స్త్రీ, పురుష అక్షరాస్యతా శాతాలు - 2011
జిల్లా | మొత్తం | పురుషులు | స్త్రీలు |
మహబూబ్‌నగర్ | 55.04 | 65.21 | 44.72 |
రంగారెడ్డి | 75.87 | 82.11 | 69.40 |
హైదరాబాద్ | 83.25 | 86.99 | 79.35 |
మెదక్ | 61.42 | 71.43 | 51.37 |
నిజామాబాద్ | 61.25 | 71.47 | 51.54 |
ఆదిలాబాద్ | 61.01 | 70.81 | 51.31 |
కరీంనగర్ | 64.15 | 73.65 | 54.79 |
వరంగల్ | 65.11 | 74.58 | 55.69 |
ఖమ్మం | 64.81 | 72.30 | 57.44 |
నల్గొండ | 64.20 | 74.10 | 54.19 |
తెలంగాణ | 66.46 | 74.95 | 57.92 |
Published date : 07 Sep 2015 04:46PM