Skip to main content

ఆర్థికాభివృద్ధి - జాతీయాదాయ భావనలు

ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశం మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని వ్యక్తులు, సంస్థలు సంపాదించిన మొత్తం ఆదాయమే జాతీయాదాయం. ఆర్థికశాస్త్ర పరిభాషలో.. దేశంలో సంవత్సరంలో ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల, సేవల విలువల మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. మనదేశ జాతీయాదాయాన్ని మొదటగా మదింపు చేసింది.. దాదాభాయ్ నౌరోజీ.
జాతీయాదాయ అంచనాల సంఘం నిర్వచనం ప్రకారం.. నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసి ఒకసారి మాత్రమే లెక్కలోకి తీసుకున్న వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం. దీన్ని సహజ వనరుల లభ్యత, ఉత్పత్తి కారకాలు- వాటి నాణ్యత, శ్రామిక శక్తి, సమర్థ వ్యవస్థాపకులు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ సుస్థిరత, పటిష్ట ప్రణాళిక రచన అమలు, సాంకేతిక విజ్ఞాన ప్రగతి మొదలైనవి ప్రభావితం చేస్తాయి. 
 
జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకునే అంశాలు
వినియోగ వస్తుసేవల విలువ (C): వినియోగదారులు (ప్రజలు) వినియోగించిన మొత్తం వస్తువులు, సేవల విలువ.
సమగ్ర దేశీయ పెట్టుబడి (I): దేశీయంగా పెట్టిన మొత్తం మూలనిధి పెట్టుబడి విలువ.
ప్రభుత్వ వ్యయం (G): ప్రభుత్వం  ఉత్పత్తి చేసిన వస్తు సేవల వ్యయం విలువ.
విదేశాల నుంచి వచ్చిన నికర రాబడులు(X–M): దేశ ఎగుమతుల (X) నుంచి దిగుమతులను (M) తీసివేస్తే వచ్చే విలువ.
విదేశాల నుంచి వచ్చిన నికర ఆదాయ బదిలీల విలువ (R–P): విదేశాల నుంచి వచ్చే ఆదాయం (R) నుంచి విదేశాలకు చేసే చెల్లింపులు (P) తీసివేస్తే వచ్చే విలువ.
పరోక్ష పన్నులు (IT): ఏదైనా ఒక వస్తువు ధరలో ఉత్పత్తి ఖర్చుతోపాటు ఉండే పరోక్ష పన్నుల విలువ.
సబ్సిడీలు (S): ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీల విలువ.
తరుగుదల(D): వస్తువుల ఉత్పత్తి క్రమంలో మూలధన సామగ్రి (యంత్రాలు, భవనాలు మొదలైనవి) విలువ రోజురోజుకూ తగ్గుతుంది. ఈ తరుగుదల విలువనే user cost అంటారు.
 
 జాతీయ భావనలు
 1. స్థూల జాతీయోత్పత్తి (GNP): ఒక సంవత్సరంలో ఒకదేశంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. ఈ భావనలో జాతీయాదాయాన్ని ఎవరు ఉత్పత్తి చేశారనేదే ముఖ్యం. ఎక్కడ ఉత్పత్తి అయిందో ప్రధానం కాదు. విదేశాల్లో సంపాదించి, స్వదేశానికి పంపిన డబ్బును కూడా జాతీయాదాయంలో కలపాలి. ఇది దేశ ఆర్థిక వృద్ధికి నిజమైన సూచిక.
 
 మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి  = వినియోగ వస్తు సేవల విలువ (C)+ పెట్టుబడి (I) + ప్రభుత్వ వ్యయం (G) + విదేశాల నుంచి వచ్చిన నికర రాబడి (x–m) + విదేశాల నుంచి వచ్చిన నికర ఆదాయం (R– P).
 
 GNP at market price = C + I + G + (X–M) + (R–P) 
 
 ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి: సాధారణంగా వస్తువుల ధరలో ఉత్పత్తి ఖర్చు, పరోక్ష పన్ను (అమ్మకపు పన్ను) కలిసి ఉంటాయి. కాబట్టి మార్కెట్‌లోని వస్తువు ధర, వస్తువు అసలు ధరను తెలపదు. అంటే అసలు ధర (కారకపు ధర)ను తెలుసుకోవాలంటే మార్కెట్ ధర నుంచి పన్ను విలువ (IT) తీసివేయాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల వల్ల కూడా వస్తువు అసలు ధర మారుతుంది.సబ్సిడీల వల్ల మార్కెట్‌లో వస్తువు ధర తక్కువగా ఉంటుంది. దానికి సబ్సిడీల(S)ల విలువను చేర్చినపుడు అసలు ధరను మదింపు చేయవచ్చు. కాబట్టి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తికి సబ్సిడీలు కలిపి పన్నులను తీసివేస్తే ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి తెలుస్తుంది.
 GNP at factor cost = C+ I + G + (X – M) + (R – P) – IT + S
 
 2. స్థూల దేశీయోత్పత్తి (GDP): దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల మార్కెట్ విలువను స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఇది ఎవరు ఉత్పత్తి చేశారు అనేదానికంటే ఎక్కడ ఉత్పత్తి చేశారు అనేదానికి అధిక ప్రాధాన్యత  ఇస్తుంది. దీనిలో విదేశాల నుంచి ఆదాయం (R–P)  ఉండదు.
 
 మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి = GNP at market price – (R–P) = C + I + G + (X–M)
 
 ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి = GNP at factor cost – (R– P) = C + I  + G + (X – M) – IT + S
 
 3. నికర జాతీయోత్పత్తి (NNP): స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను(D) తీసివేస్తే నికర జాతీయోత్పత్తి వస్తుంది. వస్తువులను ఉత్పత్తి చేస్తున్నప్పుడు మూలధన సామగ్రి తరుగుదల పొంది మూలధన ఆస్తుల విలువ తక్కువవుతుంది.
 
 మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి= GNP at market price – D C + I + G + (X –  M) + (R – P) – D
 
 ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి = GNP at factor cost – D C + I + G + (X – M) + (R – P) – IT + S – D
 
 దీన్నే జాతీయాదాయం అంటారు.
 
 4. నికర దేశీయోత్పత్తి (NDP: స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదల (D)ను తీసివేయాలి.
 మార్కెట్ ధరలతో నికర దేశీయోత్పత్తి = GDP at market price – D  C+ I + G + (X – M) – D
 
 ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి= GDP at factor cost – D
 C+ I + G + (X – M) – IT + S – D.
 
ఆర్థికాభివృద్ధి - సూచికలు
ఉత్పత్తిలో పెరుగుదల ఆర్థిక పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఆర్థిక పెరుగుదల ఆర్థిక వృద్ధికి సంకేతం. ఆర్థికవృద్ధితోపాటు సామాజిక, సాంకేతిక వ్యవస్థాపూర్వక అభివృద్ధిని ఆర్థికాభివృద్ధి అంటారు. దీన్నిబట్టి ఆర్థికాభివృద్ధిలో ఆర్థికవృద్ధి ఒక భాగమని గమనించవచ్చు. ఆర్థికాభివృద్ధి కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
 
1. తలసరి ఆదాయం: ఒక సంవత్సర కాలంలో ఒకదేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చే మొత్తం తలసరి ఆదాయం.
 తలసరి ఆదాయం= జాతీయాదాయం ÷ జనాభా
 వాస్తవ తలసరి ఆదాయం = వాస్తవ జాతీయాదాయం÷ జనాభా
 
తలసరి ఆదాయం ఆర్థికాభివృద్ధికి ఆదర్శనీయమైన సూచిక కాదు ఎందుకంటే జనాభాలో అతి తక్కువ మందికి ఎక్కువ ఆదాయం ఉండి, ఎక్కువ మందికి అతి తక్కువ ఆదాయం ఉండవచ్చు. కానీ తలసరి ఆదాయం... మొత్తం ఆదాయం సగటును తెలుపుతుంది. కాబట్టి జనాభాలోని ప్రతి ఒక్కరి ఆదాయం తలసరి ఆదాయానికి సమానంగా ఉంటుందని అంచనాకు రావడం వాస్తవ విరుద్ధం.
 
2. వాస్తవ జాతీయాదాయం: ఒక ఆధార సంవత్సరంలోని ధరలతో ప్రస్తుత సంవత్సర ఉత్పత్తులను గుణించగా వచ్చేదే నిలకడ ధరల్లో జాతీయాదాయం. అదే వాస్తవ జాతీయాదాయం. దీనివల్ల ఉత్పత్తి పెరిగితేనే జాతీయాదాయం పెరిగినట్లు కచ్చితంగా తెలుస్తుంది. ఈ వాస్తవిక జాతీయాదాయం కాలక్రమేణా పెరగాలి. జనాభా పెరుగుదలను మించి ఆదాయ పెరుగుదల ఉండాలి. అప్పుడే ఇది ఆర్థికాభివృద్ధికి మంచి సూచిక అవుతుంది.
 
3. దారిద్య్ర రేఖ: పేదరికాన్ని కొలవడానికి పేదరికపు గీత (దారిద్య్ర రేఖ)ను ఉపయోగిస్తారు. ఈ గీతకు కిందనున్న వారిని పేదవారుగా, పైనున్న వారిని పేదలు కానివారుగా నిర్ణయిస్తారు. ప్రజలు కనీస అవసరాల పరిమాణాలను మొదట నిర్ధారిస్తారు. వాటి విలువను అంచనా వేసి కనీస జీవనావసర వినియోగ వ్యయాన్ని నిర్ణయిస్తారు. ఈ కనీస వ్యయస్థాయిని పేదరిక గీత (దారిద్య్ర రేఖ) అంటారు. ఈ కనీస వ్యయాన్ని కూడా చేయలేని స్థితినే పేదరికంగా పేర్కొంటారు. దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజల సంఖ్య తగ్గితే ఆర్థికాభివృద్ధి మెరుగైనట్లుగా భావించవచ్చు.
 
4. నిరుద్యోగం: మార్కెట్ వేతనాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఉపాధి లభించని స్థితే నిరుద్యోగం. నిరుద్యోగం తగ్గి, ఉపాధి పెరిగి నప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఇది ప్రజా సంక్షేమాన్ని పెంచి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.
 
5. ఆదాయ అసమానతలు: ఆదాయంలో అసమానతలు తగ్గినప్పుడు ఆర్థికాభివృద్ధి  ముందుకు సాగుతుంది.
 
6. అక్షరాస్యత: దేశంలో ఒక భాషను చదవడం, రాయగలగే జ్ఞానం ఉన్న ప్రజల సంఖ్యను అక్షరాస్యత అంటారు. జనాభాలో ఏడేళ్లు పూర్తి చేసుకున్న వారి సంఖ్యతో అక్షరాస్యుల సంఖ్యను భాగించి అక్షరాస్యత రేటును కనుగొంటారు. ముఖ్యంగా స్త్రీల అక్షరాస్యతలో పెరుగుదల ఆర్థికాభివృద్ధికి మంచి సూచిక.
 
7. నగరీకరణ: అధికసంఖ్యలో పట్టణాల పెరుగుదలను పట్టణీకరణ లేదా నగరీకరణ అంటారు. పట్టణాల పెరుగుదల.. పట్టణాల్లో నివసించేవారి సంఖ్య
పెరుగుతున్నట్లుగా తెలుపుతుంది. ఇది ఆధునికతను సూచిస్తుంది.
 
8. జనన రేటు: తక్కువ జనన రేటు అభివృద్ధికి ముఖ్యసూచిక. ఇది జనాభా పెరుగుదలను అరికడుతుంది. దేశంలో ప్రతి వేయి మంది జనాభాకి పుట్టిన పిల్లలను పరిగణించడం ద్వారా జనన రేటును
నిర్ధారిస్తారు.
 
9. మరణ రేటు: తక్కువ మరణ రేటు కూడా అభివృద్ధికి సూచికమే. మంచి ఆరోగ్యం మరణ రేటును తగ్గిస్తుంది.
 
10. శిశు మరణ రేటు: పుట్టిన ప్రతి వేయి మంది పిల్లల్లో ఏడాది వయసులోపు పిల్లల మరణాలను గణించి శిశు మరణాల రేటును వెల్లడిస్తారు. ఆర్థికాభివృద్ధికి మాతా శిశువుల ఆరోగ్యం ముఖ్యం.
 
11. ఆయుః ప్రమాణం:
జీవించే వయసునే ఆయుః ప్రమాణం అంటారు. ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తున్నారని అర్థం. ఇది ప్రజలు సగటున ఎంత కాలం జీవిస్తున్నారో తెలుపుతుంది.
Published date : 25 Aug 2016 04:44PM

Photo Stories