Skip to main content

Telangana SI, Constable Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. విద్యార్హతలు ఇవే.. ఎంపిక విధానం ఇలా..

Telangana Police

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చేసింది. పోలీసుశాఖతోపాటు మరో 3 విభాగాల్లో 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏప్రిల్‌ 25న తీపికబురు చెప్పింది. ఎస్సై పోస్టులు, ఇతరవిభాగాల్లో తత్సమాన హోదా ఉండే పోస్టులు కలిపి 587 ఖాళీలను.. కానిస్టేబుల్, తత్సమాన హోదా ఉండే 16,027 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశామని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు ప్రకటించారు.

TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..

వచ్చే నెల 2 నుంచి దరఖాస్తులు
పోలీస్, ఫైర్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖలో భర్తీ చేయనున్న పోస్టులకు వచ్చే నెల (మే) 2 నుంచి 20 వరకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌  tslprb.inలో దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాస్‌రావు సూచించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి.. అందులో పేర్కొన్న మేర అర్హతలను పూర్తిగా చెక్‌ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎస్సై, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000.. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలని తెలిపారు. కానిస్టేబుల్, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలని.. అలాగే 2022 జూలై 1 నాటికి సదరు కోర్సులో ఉత్తీర్ణత సాధించగలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

 

ఆయా పోస్టులకు.. విద్యార్హతలివీ.. 

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ జైలర్‌ పోస్టులకు కనీసం డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. 
  • పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్, ఫైర్‌ మన్, జైలు వార్డర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • ఐటీ, కమ్యూనికేషన్‌ విభాగంలో ఎస్సై పోస్టులకు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (బీటెక్‌) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌–కంప్యూటర్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పట్టా పొంది ఉండాలి. 
  • పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఎస్సై పోస్టులకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై) ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా కంప్యూటర్‌ సైన్స్‌ లేదా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • ఐటీ, కమ్యూనికేషన్‌ విభాగంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు.. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐలో ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌ లేదా కంప్యూటర్‌ ఆపరేటర్‌–ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌ లేదా మెకానిక్‌ కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ లేదా ఎలక్ట్రీషియన్‌ లేదా ఒకేషనల్‌ ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌ పోస్టుల కోసం.. పదో తరగతితోపాటు ఐటీఐలో వైర్‌మన్‌ లేదా మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌ లేదా మెకానిక్‌ డీజిల్‌ లేదా ఫిట్టర్‌గా సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • పోలీస్‌ ట్రాన్స్‌పోర్టులో డ్రైవర్‌ పోస్టుల కోసం.. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి.. ఐటీఐలో ఆటో ఎలక్ట్రీషియన్‌ లేదా మెకానిక్‌ మోటార్‌ లేదా మెకానిక్‌ డీజిల్‌ లేదా ఫిట్టర్‌ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ విభాగంలో తప్పనిసరిగా లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌తో బ్యాడ్జ్‌ నంబర్‌ కలిగి ఉండాలి. లేదా హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి, రెండేళ్ల పాటు డ్రైవింగ్‌ చేసిన అనుభవం ఉండాలి. 

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఎంపిక విధానమిదీ.. 
పోలీసు నియామక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 మార్కులకు నిర్వహించే ఈ రాతపరీక్షలో.. అర్థమెటిక్, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీకి 100 మార్కులు, జనరల్‌ స్టడీస్‌కు 100 మార్కులు ఉంటాయి. కనీసం 30శాతం మార్కులు సాధించినవారే తర్వాతి దశలోని.. ఫిజికల్‌ ఎఫిషియన్సీ, దేహ దారుడ్య పరీక్షలకు అర్హులు అవుతారు. వీటిలోనూ అర్హత పొందినవారు తుది రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. 

  • పురుష అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహిస్తారు. దీనిని 7 నిమిషాల 15 సెకండ్లలో పూర్తిచేయాలి. ఎక్స్‌సర్వీస్‌మన్‌ కేటగిరీవారు 9 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయవచ్చు. మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు పరీక్ష ఉంటుంది. వారు 5 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేయాలి. 
  • పరుగు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారి ఫిజికల్‌ ఎఫిషియెన్సీ పరిశీలిస్తారు. 
  • కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు.. ఓసీ, బీసీ పురుష అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు, మహిళా అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. 
  • కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు.. లాంగ్‌ జంప్‌లో పురుషులు 4 మీటర్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 3.50 మీటర్లు, మహిళలు 2.50 మీటర్లు కనీస దూరాన్ని సాధించాలి.. షాట్‌పుట్‌లో పురుషులు, ఎక్స్‌సర్వీస్‌మన్‌ 7.26 కేజీల బరువును 6 మీటర్ల దూరం విసరాలి. మహిళా అభ్యర్థులు 4 కేజీల బరువును 4 మీటర్లు విసరాల్సి ఉంటుంది. 
  • దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారంతా తుది రాతపరీక్ష రాయాల్సి ఉంటుంది. 
  • సివిల్‌ కానిస్టేబుల్, ఫైర్‌మన్, వార్డర్‌ (పురుష, మహిళ) అభ్యర్థులు 200 మార్కులకు.. ఏఆర్‌ కానిస్టేబుల్, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్‌ విభాగాల అభ్యర్థులు 100 మార్కులకు పరీక్ష రాయల్సి ఉంటుంది. ఓసీ కేటగిరీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ 30శాతం కనీస మార్కులు సాధించాలి. 
  • సివిల్‌ ఎస్సై, ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ జైలర్‌ అభ్యర్థులు.. 4 పేపర్లలో 600 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఓసీ అభ్యర్థులు 40శాతం, బీసీలు 35శాతం, ఎస్సీ,ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మన్‌ అభ్యర్థులు 30శాతం కనీస మార్కులు సాధించాలి. 
  • ఏఆర్‌ ఎస్సై, టీఎస్‌ఎస్‌పీ ఎస్సై, ఎస్పీఎఫ్‌ ఎస్సై అభ్యర్థులు 400 మార్కులకు నాలుగు పరీక్షలు రాయల్సి ఉంటుంది. ఓసీలు 40శాతం, బీసీ 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మన్‌ కనీసం 30శాతం మార్కులు సాధించాలి.

​​​​​​​ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events

TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..

Published date : 26 Apr 2022 05:15PM

Photo Stories