వయో సడలింపు లభించేనా?
కానిస్టేబుల్, ఎస్‌ఐ తదితర తత్సమాన ఉద్యోగాల భర్తీలో మరో రెండేళ్ల వయోసడలింపు కావాలని డిమాండ్ చేయడంతోపాటు గ్రూప్–1 సరీ్వసులో ఉన్న డీఎస్పీ ఉద్యోగ ఎంపికలో పొందుపరిచిన ఎత్తు నిబంధనపై అభ్యంతరం తెలుపుతున్నారు. అయితే ఈ అంశాలపై పోలీస్ శాఖ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు వెళ్లలేదని తెలిసింది.
ఒక్క అవకాశం కోసం...
రాష్ట్రంలో దాదాపు మూడేళ్ల తర్వాత భారీ స్థాయిలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకాల ప్రక్రియ చేపట్టింది. పోలీస్, ఫైర్, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్టు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, జైళ్ల శాఖలో 17 వేలకుపైగా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం జరుగుతున్న భారీ నియామక ప్రక్రియ కావడం... పైగా నోటిఫికేషన్లు సైతం చాలా ఏళ్ల తర్వాత భారీ సంఖ్యలో రావడంతో నిరుద్యోగులు వయోసడలింపు కావాలని డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనలకు దిగుతున్నారు. మళ్లీ అవకాశం వస్తుందో రాదోనని.. అందువల్ల తమకు మరో రెండేళ్లపాటు వయో సడలింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని డీజీపీ సహా రాష్ట్ర మంత్రులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వేడుకుంటున్నారు.
మెజారిటీ రాష్ట్రాల ప్రకారమే కావాలంటూ..
గ్రూప్–1 కేటగిరీలో భర్తీ చేస్తున్న డీఎస్పీ పోస్టులకు విధించిన ఎత్తు నిబంధనపై నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని 20కిపైగా రాష్ట్రాలు డీఎస్పీల ఎంపికలో పెట్టిన ఎత్తునే రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో డీఎస్పీ కేడర్ పోస్టులకు 165 సెంటీమీటర్ల ప్రాతిపదికగా నియామకాలు జరుగుతున్నాయని, కానీ తెలంగాణలో మాత్రం 167.6 సెంటీమీటర్ల ఎత్తు పెట్టడం అన్యాయమంటూ నిరుద్యోగులు వాదిస్తున్నారు. అలాగే యూపీఎస్‌సీ నిర్వహించే సెంట్రల్ అర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్), ఐపీఎస్‌ల ఎంపిక ప్రక్రియలో కూడా 165 సెంటీమీటర్ల ఎత్తునే ప్రాతిపదికగా తీసుకుంటున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ స్పందించి 165 సెంటీమీటర్ల ఎత్తునే ప్రాతిపదికగా తీసుకొనేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని వేడుకుంటున్నారు.