Skip to main content

‘టైఫాయిడ్’ నిర్థారించడానికి వాడే పరీక్ష ఏది?

సంక్రమిత వ్యాధులు:
మానవులలో ప్రబలి ఉండే వ్యాధులలో ముఖ్యమైనవి ‘సంక్రమిత’ వ్యాధులు. వీటిని ‘అంటు వ్యాధులు’ అని కూడా అంటారు. గాలి, నీరు, ఆహారం, ప్రత్యక్ష తాకిడి ద్వారా ఇవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. అనేక రకాల సూక్ష్మజీవులు మానవులపై దాడి చేయడం వల్ల కూడా ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. ముఖ్యంగా బాక్టీరియా, వైరస్‌లు, ప్రోటోజోవన్‌లు, శిలీంధ్రాలు వివిధ రకాల వ్యాధులకు కారణం.

బాక్టీరియల్ వ్యాధులు :
1. క్షయ వ్యాధి (Tuberculosis):
  • ‘మైకో బాక్టీరియమ్ ట్యుబర్‌క్యులోసిస్’ బాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
  • ఇది ఒక రకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు, దగ్గినపుడు, ఉమ్మినపుడు, బయటకు వచ్చే గాలిలోని తుంపర్లలో ఉండే ఈ బాక్టీరియా ఇతర వ్యక్తులకు సోకి, ఆ వ్యాధిని కలుగజేస్తాయి.
  • క్షయ వ్యాధి రెండు రకాలు. మొదటిది ఊపిరితిత్తుల క్షయ. రెండోది ఇతర అవయవాలకు సోకే క్షయ. శరీరంలో ఏ అవయవానికైనా ఈ వ్యాధి రావచ్చు.
  • దీర్ఘకాలిక రోగాలలో ముఖ్యమైనది ఈ క్షయ వ్యాధి. ఈ వ్యాధి నిర్థారణకు ఉపయోగపడే పరీక్షలు "X rays', తెమడ పరీక్ష, మాంటాక్స్ (Montoux) పరీక్ష మొదలైనవి.
  • సాధారణ క్షయకు ‘స్ట్రెప్టోమైసిన్’ను సూది మందుగా ఇస్తారు. వీటితో పాటు రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్, పైరజినమైడ్ ఇవ్వడం జరుగుతుంది.
  • బీసీజీ (BCG) వ్యాక్సిన్‌ను తీసుకోవడం వల్ల క్షయ రాకుండా జాగ్రత్తపడవచ్చు.
2. టైఫాయిడ్ (Typhoid):
  • ‘సాల్మొనెల్లా టైఫి’ (Salmonella typhi) అనే బాక్టీరియా వల్ల కలిగే సంక్రమిత వ్యాధి. దీనిని ‘పేగు జ్వరం’ అని పిలుస్తారు.
  • ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి మలం ద్వారా లేదా నోటి ద్వారా వ్యాపిస్తుంది.
  • జ్వరం సుమారు 102° నుంచి 104°F రావడం, కడుపు నొప్పి, దగ్గు, ఆకలి తగ్గిపోవడం, మలబద్ధకం కలుగుతుంది.
  • రక్తం, మల పరీక్షల ద్వారా వ్యాధిని నిర్థారిస్తారు.
  • ‘వైడల్ పరీక్ష’ ద్వారా కూడా సాల్మొనెల్లా ప్రతిరక్షకాలను గుర్తించవచ్చు.
  • యాంటీ బయాటిక్ మందులను ఉపయోగించి ఈ వ్యాధి బారి నుంచి కాపాడుకోవచ్చు. సిప్రోఫ్లాక్సిన్, ఆంపిసిలిన్, ట్రైమీథోప్రిమ్ మొదలగునవి.
  • టైఫాయిడ్ వ్యాధి నివారణకు TAB వ్యాక్సిన్ (Typhoid, Paratyphoid A&B Vaccine) వ్యాక్సిన్ తీసుకుంటారు.
3. కలరా (Cholera):
  • ‘విబ్రియో కలరా’ (Vibrio cholera) అనే బాక్టీరియా వల్ల వస్తుంది.
  • ఇది నీరు లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి.
  • అతివిరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • విరేచనాలతోపాటు వాంతులు, కాళ్లు కండరాలు పట్టుకుపోవడం, తిమ్మిరెక్కడం జరుగుతుంది. తలనొప్పి, వికారం, కడుపు నొప్పి ఉంటాయి.
  • చాలా వరకూ కలరా కేసులను ‘ఓరల్ రీ హైడ్రేషన్ థెరపి’ ద్వారా నయం చేయవచ్చు.
4. కుష్టు వ్యాధి (Leprosy):
  • శరీరమంతా పుండ్లతో కనిపించే వ్యాధి. కానీ ఇది అంటు వ్యాధి కాదు.
  • కుష్టు వ్యాధికారక బాక్టీరియాను ‘మైకో బాక్టీరియమ్ లేప్రే’ అంటారు.
  • ఇది చర్మానికి సంబంధించిన వ్యాధి. ముఖ్యంగా చర్మాన్ని, నరాలనూ మ్యూకస్ పొరలను ప్రభావితం చేస్తుంది.
  • శరీరంపై దద్దుర్లు, ఎరుపు రంగులో కనిపించే మచ్చలు, మచ్చలపై స్పర్శ లేకపోవడం, మచ్చల ప్రాంతంలో నొప్పి కలగకపోవడం సంభవిస్తుంది.
  • ఈ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షను "PCR పరీక్ష’ (Polymerase chain reaction) అంటారు.
  • Multi Drug Therapy (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా కుష్టును పూర్తిగా నయం చేయవచ్చు. MDT లోని ప్రముఖ ఔషధం ‘డాప్సోన్’ అనే యాంటీ బయాటిక్.
5. డిఫ్తీరియా (Diphtheria):
  • దీనిని కంఠవాతం లేదా కంఠ సర్పి అని అంటారు.
  • ‘కొరినోబాక్టీరియమ్ డిఫ్తీరియా’ (Corynobacterium diphtheriae) ఈ వ్యాధికి కారణం.
  • 1 నుంచి 5 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు సోకుతుంది.
  • ఈ బాక్టీరియా సాధారణంగా ముక్కు, గొంతు భాగాలను బాధిస్తుంది.
  • జ్వరం, చలి, దగ్గు రావడం, గొంతులో నొప్పి, మింగడంలో కష్టం కలగడం, ముక్కు నుంచి రక్తం లేదా నీరు కారడం, చర్మంపై గాయాలు ఏర్పడతాయి.
  • ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి దగ్గు లేదా తుమ్ముల ద్వారా బయటకు వెలువడే సంక్రమణ శ్వాసకోశపు చుక్కల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
  • ‘గొంతు శ్వాబ్’ (throat swab)ను ఉపయోగించి కానీ, పూర్తి ‘రక్తగణన’ పరీక్ష వంటి ‘రక్త పరీక్షలు’ మరియు ‘రస విజ్ఞాన పరీక్షలు’ జరిపి కానీ వ్యాధి నిర్థారణ చేస్తారు.
  • వ్యాధిని కలిగించే బాక్టీరియాను చంపడానికి యాంటీ బయాటిక్స్ మందులు ఉపయోగిస్తారు.
  • వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధిని నిరోధించవచ్చు.
6. కోరింత దగ్గు (whooping cough) (లేదా) పెర్టూసిస్ (pertussis):
  • బోర్డెటెల్లా పెర్టూసిస్ (Bordetella pertussis) బాక్టీరియా కారణం.
  • అంటువ్యాధి చిన్న పిల్లల్లో వేగంగా వ్యాపిస్తుంది.
  • బాక్టీరియా ఊపిరితిత్తులలోకి ప్రవేశించి, వాయునాళాల్లో వాపు, మంటను కలుగజేస్తాయి.
  • తీవ్రమైన దగ్గుతోపాటు ఛాతినొప్పి, స్వల్ప జ్వరం, కారుతున్న ముక్కు, కళ్ళ నీళ్ళు కారడం, గొంతు నొిప్పి, తుమ్ములు రావడం ప్రధాన లక్షణాలు.
  • సీరలాజికల్ పరీక్షలు, కల్చర్ పరీక్షలు, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (PCR) వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్థారణ జరుపుతారు.
  • క్లోరాంఫినికాల్, టెట్రాసైక్లిన్, ఎరిత్రోమైసిన్ వంటి మందులు వాడి ఈ వ్యాధిని అరికట్టవచ్చు.
7. టెటానస్ (Tetanus):
  • టెటానస్‌ను ‘ధనుర్వాతం అని కూడా అంటారు. ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఇది ఒకటి.
  • ‘క్లాస్ట్రీడియం టెటానీ అనే బాక్టీరియా ఈ వ్యాధికి కారణం.
  • బాక్టీరియం విడుదల చేసే ‘టెటనోస్ఫాస్మిన్’ అనే విషపూరిత పదార్థం మానవుని మెదడు, నాడీ వ్యవస్థలను దెబ్బతీస్తుంది.
  • చర్మం పగుళ్లు, గాయాలు, జంతువుల కాట్ల ద్వారా మానవునిలోకి ప్రవేశించి వ్యాధికారక స్పోర్లు అభివృద్ధి చెంది వ్యాధికి దారితీస్తాయి. తుప్పుపట్టిన ఇనుప వస్తువులు ముఖ్యంగా మేకులు చర్మానికి గుచ్చుకొని, తీవ్ర గాయమైనట్లయితే ఈ బాక్టీరియాలు లోపలికి ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి.
  • దవడలు బిగిసి నోరు తెరవలేకపోవటం, మెడ బిగియడం, శరీరం వంకరలు పోవడం, కండరాలు బిగుతుగా మారడం జరుగుతుంది. ఛాతీ కండరాలు దెబ్బతిని ఒక్కొక్కసారి మరణం సంభవించవచ్చు.
  • వ్యాధి నిరోధకత్వానికి 6 నెలలకొకసారి ‘టెటానస్ టాక్సాయిడ్’ (TT) వేయించుకోవాలి.
  • DPT Vaccine: డిఫ్తీరియా, పెర్టూసిస్, టెటానస్ - వీటి నిర్మూలనకు చేసే వ్యాక్సిన్.
8. న్యుమోనియా వ్యాధి (Pneumonia) :
  • ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే’ (Streptococcus pneumoniae) అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • శ్వాసక్రియలో అత్యంత కీలకమైన ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడమే ‘న్యుమోనియా.’
  • ఊపిరితిత్తులలో నెమ్ము చేరడం వల్ల తీవ్రమైన దగ్గు, దుర్వాసనతో కూడిన కఫం, సక్రమంగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాధి ముదిరితే మరింత ప్రమాదకరం.
  • పొగ పీల్చేవారిలో, మద్యపానం చేసేవారిలోను మరియు మధుమేహం, హెచ్‌ఐవీ, కాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వారిలోను వ్యాధి నిరోధక శక్తి తగ్గి న్యుమోనియా రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
  • యాంటీ బయాటిక్స్ ఉపయోగించి ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.
9. బొటులిజం (Botulism) :
  • ‘క్లాస్ట్రీడియం బొటులినమ్’ అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది.
  • శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ బాక్టీరియా ‘బొటులిన్’ అనే విషపూరిత పదార్థాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల మానవుని జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థలు దెబ్బతింటాయి.
  • ముఖం నీరసించడం, కండర క్షీణత, కడుపు నొప్పి, మింగడంలో ఇబ్బంది, దృష్టి లోపం సంభవిస్తాయి. ఒక్కొక్కసారి వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు కావడం జరుగుతుంది. తీవ్ర స్థాయిలో పక్షవాతం సంభవిస్తుంది.
  • కల్తీ ఆహారం, విషపూరిత ఆహారం తింటే ఈ వ్యాధి వస్తుంది.
  • నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరలు, పానీయాలు, జ్యూస్‌లు తీసుకోవడం వల్ల వీటిలోని విషపూరిత ‘బొటులిన్’ వ్యాధికి కారణమవుతుంది. శుభ్రమైన ఆహారం తీసుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.
10. మెనింజైటిస్ వ్యాధి (Meningitis):
  • ‘నిస్సెరా మెనింజైటిస్’ అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి.
  • మెదడు, వెన్నుపాముల మీది చర్మపు పొరల (Meninges)లో చేరి వ్యాధిని కలుగజేస్తుంది.
  • దీని నివారణకు వాడే డ్రగ్ ‘ప్రాంటో సీల్’.
11. సిఫిలిస్ (Syphilis):
  • ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధి. ‘ట్రిపనోమా పల్లిడా’ అనే బాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇవి చర్మం మీది రోమాల కుదుళ్ల నుంచి శరీరంలోకి ప్రవేశించి అభివృద్ధి చెందుతాయి.
  • మందకొడి జ్వరం, జననాంగాలపై ఎర్రని పొక్కులు రావడం, చర్మం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడుతాయి.
  • ఈ వ్యాధి నిర్థారణకు VDRL (Venereal Disease Research Laboratory) రక్తపరీక్ష ద్వారా నిర్థారిస్తారు.
12. గనేరియా (Gonorrhoea):
  • ఇది ఒక రకమైన అంటు వ్యాధి. ‘నిసీరియా గొనోరియా’ (Nisseria gonorrhoea) అనే బాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇది సామాన్యమైన సుఖవ్యాధి.
  • మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలలో తెల్ల మైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్ది రోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్ర మార్గం సన్నబడడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
  • సిఫిలిస్, గనేరియా వ్యాధులను ‘సుఖ వ్యాధులు’ (STD) అంటారు.
  • ‘పెన్సిలిన్’ అనే మందు సుఖవ్యాధుల నిర్మూలనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. Ceftriaxone, Azithromycin లు కూడా ఉపయోగపడతాయి.
మాదిరి ప్రశ్నలు:
Published date : 16 Dec 2019 06:32PM

Photo Stories