TSBIE: లక్ష మంది విద్యార్థులకు ఊరట
ఈ ఒక్క ఏడాదీ అనుమతించి వచ్చే సంవత్సరం నుంచి అన్ని రకాల అనుమతులు ఉంటే తప్ప అఫిలియేషన్ ఇవ్వకూడదని నిర్ణయించింది. రాష్ట్రంలో 406 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటికి బోర్డు అనుబంధ గుర్తింపు అవసరం లేదు. కానీ ప్రైవేటు కాలేజీలు మాత్రం అఫిలియేషన్ పొందాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1,900 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలుండగా.. వీటిల్లో దాదాపు 1,500 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చారు. మరో 400 కాలేజీలకు మాత్రం అగ్నిమాపక శాఖ, ఇతర అనుమతులు లేని కారణంగా గుర్తింపు ఇవ్వకుండా నిలిపివేశారు.
చదవండి: TSBIE: ఇంటర్ పరీక్షల సిబ్బందిపై ప్రత్యేక దృషి
ఈ కాలేజీల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చించారు. ప్రతి ఏడాదీ అన్ని రకాల అనుమతులు లేని కాలేజీలను గుర్తించడం, చివరి క్షణంలో వాటికి అనుమతులు ఇవ్వడం సరికాదనే అభిప్రాయానికి వచ్చారు. గత ఐదేళ్ళుగా ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు జరిగిన ప్రచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
చదవండి: Intermediate: పరీక్షల నిర్వహణలో మార్పులు
ఆయా కాలేజీలకు ఈ ఒక్క ఏడాది మాత్రమే అఫ్లియేషన్ ఇవ్వాలని, వచ్చే ఏడాది నుంచి కఠినంగా వ్యవహరించడంతో పాటు.. అనుమతుల గుర్తింపు ప్రక్రియను ముందే ముగించాలని నిర్ణయించారు. ఈ కారణంగానే ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను నవంబర్ 27 వరకు పొడిగించారు. ఈలోగా అన్ని కాలేజీలకు ఈ ఏడాది వరకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.