Intermediate: ఇంటర్‌లో ఆంగ్ల భాషా నైపుణ్యాలపై పరీక్ష
ఈ మేరకు ఈ ఏడాది నుంచి ఆంగ్లంలో ప్రయోగ పరీక్ష నిర్వహించనుంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తం 80 మార్కులు థియరీకి కేటాయించగా ప్రయోగ పరీక్షలకు 20 మార్కులు కేటాయించారు. నాలుగు దశల్లో నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 7 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులవుతారు. ప్రస్తుత విద్యా సంవ త్సరంలో మూడు విడుతల్లో ప్రయోగ పరీక్షలు జరిగాయి. చివరి పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు దశల్లో ప్రయోగాలకు హాజరుకాని వారికి నాలుగో విడతలో అవకాశం కల్పించారు. వీరందరికీ ఆంగ్ల ప్రయోగ పరీక్షను తరగతి గదిలోనే భాషా సామర్థ్యాల పరిశీలనతో నిర్వహించనున్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
కమ్యూనికేషన్ ఫంక్షన్ మొదటి దశలో ఏదైనా ఒక అంశంపై ఇద్దరు, అంత కంటే ఎక్కువ మంది విద్యార్థులు సంభాషించుకునే తీరును అధ్యాపకులు పరీక్షిస్తారు. రెండో దశలో ఒక అంశంపై నిమిషం పాటు అనర్గళంగా మాట్లాడాలి. మూడో దశలో ఓ అంశంపై విద్యార్థులు బృందంగా చర్చించాలి. ఈనెల 16న నాలుగో దశలో గ్రహించే శక్తి పెంపొందించడంపై అధ్యాపకులు పరీక్షిస్తారు. వీటితో పాటు రికార్డు బుక్ ఉంటేనే వారి ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.
19న పర్యావరణ విద్య
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నైతికత– మానవ విలువలు పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో అనుత్తీర్ణులైన వారికి ఈనెల 17న నిర్వహిస్తారు. 19న నిర్వహించే పర్యావరణ విద్య పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు సైతం హాజరుకావాల్సిందే.
ప్రతి ఒక్కరూ హాజరుకావాలి
ఇంటర్ స్థాయి నుంచే ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఈ ఏడాది నుంచి విద్యాశాఖ ఆంగ్ల ప్రయోగ పరీక్షను ప్రవేశపెట్టింది. ఈనెల 16న నిర్వహించనున్న ఆంగ్ల ప్రయోగ పరీక్షకు విద్యార్థులందరూ తప్పకుండా హాజరుకావాలి. జనరల్ విద్యార్థులకు 20 మార్కులు, ఒకేషనల్ విద్యార్థులకు 10 మార్కులు ఉంటాయి. ప్రతి విద్యార్థి హాజరయ్యే విధంగా కళాశాల ప్రిన్సిపాల్స్, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి.
–డి. ఒడ్డెన్న, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి, హైదరాబాద్