High Court: ఆ మార్గదర్శకాలను కాలేజీలు అమలు చేస్తున్నాయా?
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు, కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం అక్టోబర్ 9న విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ముజీబ్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు.
‘ఆత్మహత్యాయత్నాలను అరికట్టేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కళాశాలల యాజమాన్యంతో కమిటీ వేశాం. ఆ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రంలోని ప్రతి జూనియర్ కళాశాల తప్పనిసరిగా సీనియర్ ఫ్యాకల్టీని స్టూడెంట్స్ కౌన్సెలర్‌గా నియమించాలి. అదనపు తరగతులు రోజుకు 3 గంటలకు మించకూడదు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
కాలేజీ మేనేజ్‌మెంట్ అందించిన భవనాల్లో విద్యార్థులు నివాసముంటున్నట్లయితే, వారికి కనీసం 8 గంటల నిద్ర, ఉదయం ఒక గంట అల్పాహారం, సాయంత్రం ఒక గంట వినోదం, భోజనానికి 45 నిమిషాలు అనుమతించాలి. ఏ విద్యార్థి అయినా అనారోగ్యం లేదా మరేదైనా వ్యక్తిగత కారణాలతో కళాశాల నుంచి వైదొలిగినట్లయితే.. 7 రోజుల్లోపు కళాశాల ఫీజును మినహాయించి విద్యార్థుల ఫీజు సొమ్ము వెంటనే తిరిగివ్వాలి. అన్ని కళాశాలల్లో ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రెండుసార్లు వైద్యపరీక్షలు తప్పనిసరి. అన్ని జూనియర్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి’అని కాలేజీలకు మార్గదర్శకాలను విధించినట్లు పేర్కొన్నారు.
మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా పర్యవేక్షించాలని ఇంటర్ బోర్డు అన్ని జిల్లాల విద్యాధికారులను ఆదేశించిందని జీపీ వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను 3 వారాలు వాయిదా వేసింది.