అభివృద్ధి భావనలు
Sakshi Education
ముఖ్యాంశాలు:
- అభివృద్ధి, ప్రగతికి సంబంధించిన భావనలు అనాదిగా ఉన్నాయి. అభివృద్ధి అంటే జీవన ఆకాంక్షలు. లక్ష్యాలు మరియు వాటిని చేరుకునే మార్గాల గురించి ఆలోచించటం. ఇది చాలా సంక్లిష్టమైన పని.
- వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చును. ఒకరికి అభివృద్ధ్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చును. అది మరొకరికి విధ్వంసం కూడా కావచ్చును.
- ఏదో ఒక రకంగా మరింత ఆదాయాన్ని పొందడమే కాకుండా ప్రజలు సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం వంటి అంశాలను కోరుకుంటున్నారు.
- మహిళలు వేతనంతో కూడిన పని చేస్తుంటే కుటుంబలోనూ, సమాజంలోనూ వాళ్ల హోదా పెరుగుతుంది. భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణం ఉంటే మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టడానికి, వ్యాపారాలు నిర్వహించటానికి అవకాశం కలుగుతుంది.
- దేశాలను పోల్చటానికి ముఖ్యమైన ప్రామాణికాల్లో ఆదాయం ఒకటి ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందాయి.
- దేశ వాసులందరి ఆదాయం కలిపితే దేశ ఆదాయం అవుతుంది. ఇది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది.
- ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసు కోవడానికి మనం సగటు ఆదాయాన్ని పోలుస్తాం. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఇది వస్తుంది. దీనినే ‘తలసరి ఆదాయం’ అని కూడా అంటారు.
- ఒక దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది. చాలా ఇతర దేశాల కంటే భారత దేశ తలసరి ఆదాయం వేగంగా పెరగటంతో దాని స్థానం మెరుగుపడింది.
- పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తుసేవలు కేవలం ఆదాయం మాత్రమే అందించలేదు. కాలుష్య రహిత వాతావరణం, కల్తీలేనిమందులు, అంటురోగాల నుంచి రక్షణ మొదలగు పలు అంశాలను కేవలం డబ్బుతో కొనలేము.
- ‘అభివృద్ధి’కి మందు ‘మానవ’ అని చేర్చటంతో ఒక దేశంలోని పౌరులకు ఏమవుతుందనే అంశం అభివృద్ధిలో చాలా ముఖ్యమైన అంశం. ప్రజల ఆరోగ్యం. వాళ్ల సంక్షేమం అత్యంత ముఖ్యమైనవి.
- హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువు కోవటానికి గల కారణం హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల విద్యావిప్లవంగా కొనసాగించుటయే.
- ఆదాయం, తలసరి ఆదాయాలను అభివృద్ధి గణనలో తరచుగా పేర్కొన్న అవి కొంత మేరకే తప్ప సమగ్ర అభివృద్ధిని సూచించవు. జాతీయ ఆదాయంతో పెరుగుదల కన్పించినప్పటికీ పంపిణీలో చాలా అసమానతలు ఉన్నాయి.
- ఆరోగ్యం, విద్య, సామాజిక సూచికలను పరిగణన లోకి తీసుకోవడంతో మానవాభివృద్ధి భావన విస్తృతమైనది.
- అందరికీ మెరుగైన విద్య, ఆరోగ్యం, ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.
- సరైన రీతిలో ప్రజాసౌకర్యాలు కల్పించినపుడే అసమానతలు తగ్గి సమాజాలు సమానత్వ దిశలో వేగంగా పురోగమిస్తాయి.
కీలక పదాలు:
ఎ. తలసరి ఆదాయం: జాతీయదాయాన్ని దేశ జన సంఖ్య చేత భాగించగా తలసరి ఆదాయం వస్తుంది. సగటున ఒక వ్యక్తికి ఎంత ఆదాయం వస్తుంద న్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది.
బి. మానవాభివృద్ధి: ఆరోగ్యం, విద్య, సామాజిక సూచికలను పరిగణనలోనికి తీసుకొని వ్యక్తి, సమాజాభివృద్ధితో కూడిన ఆర్థికవృద్ధి లెక్కింపు మానవాభివృద్ధి భావన.
సి. ప్రజా సదుపాయాలు: ప్రజలందరికి సామూహికంగా ప్రయోజనాన్ని అందించు సామాజిక వస్తుసేవలను ప్రజాసదుపాయాలుగా పేర్కొనవచ్చును. అందరికి మెరుగైన విద్య, ఆరోగ్యం మొదలైనవి కల్పన చేయాలి. ప్రభుత్వ మాత్రమే వీటిని సమకూర్చగలదు.
డి. విద్యా, ఆరోగ్య సూచికలు: నేటి కాలంలో ప్రజా ఆరోగ్యం, విద్యా ప్రమాణాలను ఆర్థికాభివృద్ధి సూచికలుగా పరిగణిస్తున్నారు.
వ్యాసరూప ప్రశ్నలు:
-
ప్రతి సామాజిక అంశం వెనక ఒకటి కాక అనేక కారణాలు ఉంటాయి. ఇక్కడ కూడా అది వర్తిస్తుంది. మీ అభిప్రాయంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఏఏ అంశాలు పాఠశాల విద్యకు దోహదం చేశాయి?
జ:- హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా చదువుకోవటానికి కారణం అక్కడ పాఠశాల విద్యను ఒక విప్లవంగా చెప్పారు.
- భారతదేశం స్వాతంత్య్రం వచ్చినపుడు దేశంలోని అనేక రాష్ట్రాలలో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్‌లోనూ విద్యాస్థాయి చాలా తక్కువగానే ఉంది.
- కొండ ప్రాంతం కావటంతో హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలల విస్తరణ పెద్ద సవాలుగా ఉండేది.
- భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెటులో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి.
- పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపటం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది.
- హిమాచల్ ప్రదేశ్‌లో పిల్లలు పై తరగతులు చదవాలనీ, పోలీసు, శాస్త్రజ్ఞులు, టీచర్లు కావాలని పిల్లలు కోరుకుంటున్నారు.
- హిమాచల్ ప్రదేశ్‌లో ప్రాథమిక తరగతులలో హాజరు శాతం చాలా ఎక్కువగా ఉంది. పై తరగతులలో కూడా హాజరు బాగానే ఉంది.
- ఈ పాఠశాలలో ఉపాధ్యాయిలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు, మొదలైన కనీస సదుపాయాలు కలవు. తగినంత సంఖ్యలో ఉపాధ్యాయులు కలరు.
పై అంశాలు హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల విద్యకు దోహదం చేశాయి.
- హిమాచల్ ప్రదేశ్‌లో తలసరి ఆదాయం ఎంత? అధిక ఆదాయం ఉన్నప్పుడు పిల్లల్ని బడికి పంపటం తల్లిదండ్రులకు తేలిక అవుతందా? చర్చించండి. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం పాఠశాలలు నడపటం ఎందుకు అవసరమయ్యింది?
జ:- హిమాచల్ ప్రదేశ్‌లో 2012లో సంవత్సరం నాటి తలసరి ఆదాయం రూ.74,000, పంజాబు రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కన్నా ఇది తక్కువ.
- అల్ప ఆదాయం గల తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు చదువుకొనుటకు పంపుట లేదు. తల్లిదండ్రుల తలసరి ఆదాయం తగినంతగా ఉన్నప్పుడే వారు వారి పిల్లలను పాఠశాలకు పంపుతున్నారు.
- దేశంలో అనేక ప్రాంతాలలో మగ పిల్లల చదువుతో పోలిస్తే ఆడ పిల్లల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆడ పిల్లల పట్ల వివక్షత లేకపోవటం హిమాచల్ ప్రదేశ్‌లో గమనించ దగిన అంశం.
- హిమాచల్ ప్రదేశ్ మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేస్తున్నారు. వారు స్వతంత్రంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కనబరుస్తారు. పెళ్లి తరువాత కూతుళ్లు ఉద్యోగాలు చేయాలని తల్లులు కోరుకుంటున్నారు.
- భారతదేశం మొత్తం కంటే హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల విద్య విస్తరణ అభివృద్ధి గణనీయంగా ఉన్నాయి.
- చదువుకు ప్రాధాన్యతను ఇవ్వటం సహజ విషయం గానూ, సామాజిక నియమంగానూ హిమాచల్ ప్రదేశ్‌లో మారిపోయింది.
- ప్రభుత్వం పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేలా లేదా తల్లి దండ్రులకు నామ మాత్రపు ఖర్చు అయ్యేలా చూసింది.
- పై అంశాల వల్ల హిమాచల్ ప్రదేశ్‌లో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నా, వారు వారి పిల్లలను బడి కి పంపటం తేలిక అయ్యింది.
- అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు తల్లిదండ్రులు తక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? తరగతిలో చర్చించండి.
జ:- దేశంలో అనేక ప్రాంతాలలో మగ పిల్లల చదువుతో పోలిస్తే ఆడపిల్లల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
- ఆడ పిల్లలు కొన్ని తరగతులు చదువుతున్నారు కానీ పాఠశాల విద్యపూర్తి చెయ్యరు. లింగ వివక్షత విద్యలోనే కాకుండా దీనిని ఇతర రంగాలలోనూ చూస్తాం.
- ఇంటిలో తీసుకునే నిర్ణయాలలో అంటే ఆడపిల్లల చదువు, ఆరోగ్యం, గృహనిర్వహణ వంటి వాటిల్లో పురుషుల మాటకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
- సుదీర్ఘకాలంగా భారతీయ సమాజం పురుషాధికత్యంగానే కొనసాగుతూ ఉండటం వల్ల ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.
- అందరూ హిమాచల్ ప్రదేశ్ మహిళల్లా స్వతంత్రంగా, ఆత్మ విశ్వాసంతో కొనసాగి, ఆడపిల్లల చదువుపట్ల తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది.
- ఇంటిలో తీసుకునే నిర్ణయాలో హిమాచల్ ప్రదేశ్ మహిళల మాటకు ప్రాధాన్యత ఉంది. పెళ్లి తర్వాత తమ కూతుళ్ళ ఉద్యోగాలు చెయ్యాలని తల్లులు కోరుకుంటారు.
- మారిన కాల పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువుకు మగ పిల్లలతో సమానంగా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది.
- విద్యా హక్కు చట్టం 6-14 సంవత్సరాల బాలలకు విద్యకు హక్కు ఉందని పేర్కొంటుంది. పరిసర ప్రాంతాలలో తగినన్ని పాఠశాలలు నిర్మించేలా, అర్హులైన టీచర్లను నియమించేలా, అవసరమైన సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చూడాలి. మీకు తెలిసిన దాన్ని బట్టి
- బాలలకు
- మానవాభివృద్ధికి ఈ చట్టం ఎలాంటి ప్రాధాన్యత కల్గి ఉందో చర్చించండి.
- భారత ప్రభుత్వం విద్యహక్కు చట్టాన్ని RTE Act 2009 గా రూపొందించింది.
- విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 6-14 సంవత్సరం వయస్సు గల బాలబాలికలకు ఉచిత విద్యను పొందుటకు హక్కు కలదు.
- పిల్లల పరిసర ప్రాంతాలలో, వారికి అందుబాటులోనే పాఠశాల లను అన్ని సదుపాయాలతో నిర్మించాల్సి ఉంది.
- ప్రస్తుత ప్రభుత్వాలు పాఠశాల లకు కావలసిన సదుపాయాలను కల్పిస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తూ పాఠశాల విద్యార్థులకు భోజనం అందిస్తుంది.
- అన్ని పాఠశాలలో అర్హులైన టీచర్ల నియామకం, లాబ్స్ ఇతర సదుపాయాల కల్పనకు తగిన చర్యలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి.
- విద్యాహక్కు చట్టం 2009 వల్ల నేటి సమాజంలో చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం ఒక సహజ విషయంగా, సామాజిక నియమంగా, రాజ్యాంగం అందించిన ఒక ప్రాథమిక హక్కుగా మారింది.
- దీని వల్ల విద్య విషయంలో లింగ వివక్షతకు ఎలాంటి స్థానం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్య విషయంలో ఎలాంటి తేడాలు చూపరు. చదువులో ఆడపిల్లలకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది.
- స్త్రీలు విద్యావంతులైతే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు స్వతంత్రంగా వ్యవహరించగల్గుతారు.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
- వివిధ దేశాలను వర్గీకరించటంలో ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ముఖ్యమైన ప్రామాణికాలు ఏమిటి? పై ప్రామాణికాలలో ఏమైనా పరిమితులు ఉంటే వాటిని పేర్కొనండి.
జ:- దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో తలసరి ఆదాయాన్ని (సగటు ఆదాయం) ప్రామాణికంగా ఉయోగించినది.
- ఒక దేశం గురించి ఆలోచించినపుడు సగటు ఆదాయంతో పాటు ఇతర ముఖ్యమైన విద్య, వైద్యం, అక్షరాస్యత, మొదలైన పలు సామాజిక, ఆరోగ్య సంబంధిత అంశాలు పరిగణనలోనికి తీసుకోవాలి.
- తలసరి ఆదాయం విషయంలో బీహార్ అట్టడుగున, పంజాబ్ అత్యధికంగా ఉంది. కానీ శిశుమరణాల సంఖ్యలో హిమాచల్ ప్రదేశ్ కన్నా పంజాబ్‌లో శిశుమరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి.
- శిశుమరణాల సంఖ్య, అక్షరాస్యత శాతం, నికరు హాజరుశాతం, వ్యక్తి సగటు జీవించే కాలం, మొదలైన అనేక అంశాలను దేశాల వర్గీకరణలో తీసుకోవాలి.
- తలసరి ఆదాయాలు వ్యక్తుల సగటు ఆదాయాలను మాత్రమే సూచించుతాయి. వారి వ్యక్తిగత ఆదాయాలు, ఆదాయ పంపిణీలోగల అసమానతలు మొదలైన వాటిని బహిర్గత పర్చదు.
- అభివృద్ధిని కొలవటానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ప్రామాణికాలకూ ఐక్యరాజ్యసమితి అభివృద్ది కార్యక్రమం ఉపయోగించే వాటికీ తేడా ఏమిటి?
జ:- దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో తలసరి ఆదాయంను ప్రామాణికంగా తీసుకుంది.
- ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది.
- మానవ అభివృద్ధిని కొలవటానికి మీ దృష్టిలో ఇంకా ఏ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి?
జ: మానవ అభివృద్ధి కొలవటానికి - అంశాలు
(ఎ) ఆయుః ప్రమాణం
(బి) సాధారణ ఆరోగ్య స్థాయి
(సి) అక్షరాస్యత రేటు
(డి) విద్యా అర్హతలు
(ఇ) పారిశుద్ధ్యం
(ఎఫ్) సగటున బడిలో గడిపిన కాలం మొదలైనవి తలసరి ఆదాయంతో పాటు మానవాభివృద్ధిని కొలవటానికి పరిగణనలోకి తీసుకోవాలి. - ‘సగటు’ ఎందుకు ఉపయోగిస్తాం? దీనిని ఉపయోగించటంలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?
జ:- ఏదైనా అంశాలను సరిపోల్చుటకు ‘సగటు’ను ఉపయోగిస్తారు
- ‘సగటు’ ను వినియోగించటలో తగిన పరిమితులు కలవు. సగటు యదార్థ పరిస్థితులను చూపదు. మొత్తం మీద స్థితిని మనం అంచనా వేయగల్గుతాము.
- ఉదా॥రెండు దేశాల స్థితి (నెలసరి ఆదాయాలు)
దేశం
1.
2.
3.
4.
5.
సగటు
‘ఎ’ దేశం
9,500
10,500
9,800
10,000
10,200
10,000
‘బి’ దేశం
500
500
500
500
4,500
10,000
సగటు ఆదాయాలు ఎ,బి దేశాలలో సమానంగా వున్నా, ‘బి’ దేశంలో అత్యంత ఆదాయ వ్యత్యాసాలు కలవు. - హిమాచల్ ప్రదేశ్‌లో తలసరి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ పంజాబ్ కంటే మానవ అభివృద్ధి సూచికలో ముందుండటం అన్న వాస్తవం నేపథ్యంలో ఆదాయం యొక్క ప్రాముఖ్యత గురించి ఎటువంటి నిర్థారణలు చేయవచ్చు?
జ:- ఒక ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు సగటు ఆదాయంతో పాటు అనేక ఇతర ప్రామాణికాంశాలను పరిశీలించి ఆ సొంత మానవ అభివృద్ధిని పరిశీలించాల్సి ఉంది.
- ఒక వ్యక్తి ఆదాయం పంజాబ్‌లో రూ.78,000 కాగా బీహార్‌లో రూ.25,000 హిమాచల్ ప్రదేశ్‌లో రూ.74,000 కలదు.
- హిమాచల్ ప్రదేశ్‌లో శిశుమరణాలు రేటు 36 గా ఉండగా, పంజాబ్‌లో 42, బీహార్‌లో 62గా కలదు.
- అక్షరాస్యతలో హిమాచల్ ప్రదేశ్ 84%గా ఉంటే పంజాబ్ 77% బీహార్ 64% గా ఉంది.
- పట్టిక 2.6 (పాఠ్యాంశము) వివరాల ఆధారంగా కింది వాటిని పూరించండి.
జ: ఆరు సంవత్సరాలు పైబడిన ప్రతి 100 మంది ఆడ పిల్లల్లో హిమాలయ ప్రదేశ్‌లో 1993లో..........ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారు. 2006 నాటికి ఇది వందలో-----మందికి చేరుకుంది. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగ పిల్లల సంఖ్య వందలో ...మాత్రమే.
ఎ) 39
బి)60
సి) 57 - ఆడవాళ్ళు ఇంటి బయట పనిచెయ్యటానికీ, లింగ వివక్షతకూ మధ్యగల సంబంధం ఏమిటి?
జ:- బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా ఉంటారు. ఆత్మ విశ్వాసం కనబరుస్తారు.
- ఇంటిలో తీసుకునే నిరణయాలలో అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, వారి సంఖ్య, గృహ నిర్వహణ మొదలైన వాటిలో ఆడవాళ్ళ మాటకు ప్రాధాన్యత ఉంటుంది.
- పెళ్లి తరువాత తమ కూతుళ్లు ఉద్యోగాలు చేయాలనే తల్లులు కోరుకుంటున్నారు.
- పై విషయాల వల్ల లింగవివక్షత బయట ఉద్యోగం చేయు మహిళలు గల హిమాచల్ ప్రదేశ్‌లో తక్కువగా ఉంది.
Published date : 19 Oct 2023 01:36PM