Tenth Class: పదిలో మనమే ముందుండాలి
ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కావొద్దు, ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టండి’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. జనవరి 25న సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదో తరగతి పరీక్షలపై నియోజకవర్గ స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. పది ఫలితాల్లో తెలంగాణ వ్యాప్తంగా సిద్దిపేట నియోజకవర్గం వంద శాతం ఉత్తీర్ణత సాదించాలని సూచించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
మన సొంత పిల్లలు పదో తరగతి లో ఉంటే ఎలా ఉంటామో అదే తరహాలో బాధ్యతగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మనమంతా అండగా ఉండాలన్నారు. ఇప్పటి నుంచే ప్రణాళికను ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఏడాది పది ఫలితాల్లో సిద్దిపేట 98.65 శాతం తో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ప్రతి పది మంది విద్యార్థులకు ఒక కేర్ టీచర్ ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, విద్యార్థుల స్థితిగతులు ఎప్పటికప్పుడు చూడాలని సూచించారు.
అవసరమైతే మోటివేట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల సహాయం కూడా తీసుకోవాలని సూచించారు. సమీక్ష లో జిల్లా విద్యాశాధికారి శ్రీనివాస్ రెడ్డి, నోడల్ అధికారి రామస్వామి, విద్యాధికారులు దేశీరెడ్డి, యాదవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.