అంతా మా ఇష్టం..! పబ్లిక్ పరీక్షల ఫీజు కూడా..
తాజాగా పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజుపై అదనపు వసూళ్ల ప్రక్రియ బహాటంగా కొనసాగడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో పాటు సర్కారు బడుల్లో సైతం ప్రధానోపాధ్యాయుల అండదండలతో పరీక్షల విభాగం బాధ్యులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత ఫీజు కంటే అధికంగా బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవల 2021–22 విద్యాసంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఫీజు చెల్లింపు షెడ్యూలును ఎస్‌ఎస్‌సీ బోర్డు జారీ అయింది. తొలుత జనవరి 29 వరకు ఫీజు గడువును నిర్ధారించగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సంక్రాంతి సెలవులను పొడిగించడంతో ఫీజు గడువును ఫిబ్రవరి 14 వరకు బోర్డు పొడిగించింది. రూ.50 ఆలస్య రుసుంతో 24 వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో మార్చి 4 వరకు. రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించే విధంగా బోర్డు వెసులుబాటు కల్పించింది.
పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే.. కానీ
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు పేరిట అడ్డగోలు వసూళ్లు వివాదాస్పదంగా తయారయ్యాయి. నిబంధనల ప్రకారం పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బోర్డు ప్రకటించిన నిర్ణీత గడువులోగా రూ. 125 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్‌లో పరీక్ష ఫీజు పేరుతో కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని యాజామాన్యాలు పాత బకాయి ఫీజులు మొత్తం చెల్లిస్తేనే పబ్లిక్ పరీక్షల ఫీజు కట్టుకుంటామనితేల్చి చెబుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సర్కారు బడుల్లో కూడా..
ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లో సైతం పబ్లిక్ పరీక్షల ఫీజు పై అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ప్రాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సహకారంతో ఎగ్జామినేషన్ బ్రాంచ్ బాధ్యులు రూ.125 బదులు రూ.200నుంచి 500 వరకు పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిలదీస్తే మాత్రం నిర్వహణ ఖర్చులను సాకుగా చూపించడం విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ కుటుంబ యజమాని వార్షిక ఆదాయం రూ.25 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు రూ.20 వేల లోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే పరీక్ష ఫీజులో సైతం రాయితీ లభిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యే అవకాశం లేకపోవడంతో రూ.125 ఫీజు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నా..అదనపు చెల్లింపులు తలకు మించిన భారంగా తయారైంది. కరోనా కష్టకాలంలో పరీక్ష ఫీజుపై అదనపు వసూళ్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. విద్యా శాఖాధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం పలు అనుమానాలకు తావిస్తోంది.