Skip to main content

Sports School Admissions: స్పోర్ట్స్‌ స్కూల్‌కు వేళాయె

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ప్రస్తుత 2024–25 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు త్వరలో జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌ జరగనున్నాయి.
Mahbubnagar Sports District   sports school admissions   District and State level selections announcement for class 4 admissions.

మేడ్చల్‌ జిల్లాలోని హకీంపేట, కరీంనగర్‌, అదిలాబాద్‌లో స్పోర్ట్స్‌ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 4వ తరగతికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి సంబంధించిన వాటితోపాటు పలు వాటిలో టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎక్కువ స్కోర్‌ సాధిస్తారో వారికి 4వ తరగతిలో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్‌ స్కూళ్లు ఉండగా ప్రతి స్కూల్‌లో 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేస్తారు.

చదవండి: World Para Championships: శభాష్‌ దీప్తి.. పేదరికం నుంచి పైకెగసిన‌ తెలంగాణ అమ్మాయి.!

జిల్లాస్థాయి పోటీలకు ఇలా..

జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలు పాఠశాల ప్రధానోపాధ్యాయునితోపాటు మున్సిపాలిటీ, పంచాయతీకి సంబంధించిన వయస్సు ధ్రువీకరణ పత్రాలతో రావాలి. అలాగే రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, 3వ తరగతి పాస్‌ సర్టిఫికెట్‌తో జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరుకావాలి.

10 పాయింట్లు స్కోర్‌ సాధిస్తే..

జిల్లా, రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌ సెలక్షన్స్‌ జూన్‌ నుంచి ఆగస్టు వరకు నిర్వహించనున్నారు. శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు స్కోర్‌ సాధిస్తే రాష్ట్రస్థాయికి పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో ఎవరైతే ఎంపికై తే స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు.

క్రీడాకారుడిని అవుతా

స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికై పెద్దయ్యాక క్రీడాకారుడిని అవుతాను. ఇదే లక్ష్యంగా రెండు నెలల నుంచి స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న. మా నాన్న వెంట ప్రతి రోజు స్టేడియానికి వస్తున్నా. ఎలాగైనా ఈసారి స్పోర్ట్స్‌ స్కూల్‌లో సీటు సాధిస్తాను.

– ఎల్విన్‌ స్టీఫెన్‌, మహబూబ్‌నగర్‌

శిక్షణ బాగుంది..

ఈ ఏడాది స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికవుతానన్న నమ్మకం ఉంది. జిల్లాస్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌ సెలక్షన్స్‌లో పాల్గొనాలని ప్రతిరోజు స్టేడియంలో ప్రాక్టిస్‌ చేస్తున్నా. సునీల్‌ సార్‌ చాలా మంచిగా శిక్షణ ఇస్తున్నారు.

– సాయి ఆరాధ్య, మహబూబ్‌నగర్‌

Published date : 29 May 2024 05:50PM

Photo Stories