Special classes for Tenth students: టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
మిరుదొడ్డి(దుబ్బాక): టెన్త్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. టెన్త్ విద్యార్థులకు నిర్వహిస్తున్న బోధనా పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణ, రికార్డులను, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
ఉదయం గంట పాటు రోజుకో సబ్జెక్ట్ చొప్పున తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు ప్రతి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్యా ప్రగతికి సహకరించాలని సూచించారు. టెన్త్ పరీక్షా ఫలితాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ జోగు ప్రభుదాసు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.