No Teachers: కేజీబీవీలో బోధకులేరి..?
కొన్ని కేజీబీవీల్లో ఇంటర్‌లో మినహాయిస్తే ఆరు నుంచి పదోతరగతి వరకు సీట్లు నిండిపోయాయి. సీట్ల కేటాయింపు కంటే అధికంగా ప్రవేశాలు వస్తున్నా కేజీబీవీలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం లేక ఇబ్బందులు తలెత్తుతు న్నాయి.
సబ్జెక్టు టీచర్ లేక తరగతి బోధన కత్తిమీద సాములా మారింది. పాఠశాలలు పునఃప్రారంభమై 20 రోజులు కావొస్తోంది. జిల్లాలో కేజీబీవీల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల చదువులపై ప్రభావం చూపనుంది.
ఖాళీలు ఇలా..
జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లు(సీఆర్‌టీలు) 145 పోస్టులు మంజూరు కాగా, 142 మంది ఉన్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీసీఆర్‌టీలు 215 పోస్టులకు 200 మంది విధులు నిర్వహిస్తున్నారు. 15 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. బోధనేతర సిబ్బంది ఏఎన్‌ఎం, కంప్యూటర్ ఆపరేటర్, స్వీపర్, హెడ్‌కుక్, అసిస్టెంట్ కుక్ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. 244 మందిగాను 195 మంది విధులు నిర్వహిస్తున్నారు.
చదవండి: TS Mega DSC 2024: జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు
49 బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 200 మందిపైగా విద్యార్థులుండే కేజీబీవీలలో వంట మనుషులు లేకపోవటంతో అల్పాహరం నుంచి భోజనం వరకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వంట ఆలస్యం కావడంతో విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరుకాలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుత ఖాళీలతోపాటు గురుకులాల్లో టీజీటీ, జేఎల్‌గా కొందరు వెళ్లనున్నారు. దీంతో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి.
ఉన్నతాధికారుల ఆదేశానుసారం..
కేజీబీవీల్లో ఖాళీల వివరాలు సేకరించి నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశానుసారం పోస్టులను భర్తీ చేయనున్నాం. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా ఖాళీలు భర్తీ చేస్తాం. కేజీబీవీల్లో చదివే విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం.
– యశోధర, సెక్టోరియల్ అధికారి, మంచిర్యాల