Somasekhara Sharma: జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లాస్థాయి ప్రదర్శన
ఖమ్మంలోని విన్‌ఫీల్డ్ హైస్కూల్‌లో 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లాస్థాయి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ప్రారంభించిన డీఈఓ సోమశేఖరశర్మ మాట్లాడారు.. విద్యార్థులు సమాజంలో తమ చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. తద్వారా భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగొచ్చని తెలిపారు. ఇందుకోసం సైన్స్‌పై మరింత దృష్టి సారించి బట్టీ విధానంలో కాకుండా సృజనాత్మకతతో ఆలోచించడం అలవర్చుకోవాలని చెప్పారు.
చదవండి: World's Fastest Internet Network: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చైనా ఇంటర్నెట్ నెట్‌వర్క్
కాగా, సైన్స్ కాంగ్రెస్‌కు 70 మంది పేర్లు నమోదు చేసుకోగా, 68 మంది ప్రదర్శనలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి నాలుగు ప్రదర్శనలు ఎంపిక కాగా, విద్యార్థులకు డీఈఓ బహుమతులు అందించి అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌సీఎస్‌సీ కోఆర్డినేటర్ ఎనముల వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి జగదీశ్, విన్‌ఫీల్డ్ హైస్కూల్ యాజమాన్యం గద్దె పుల్లారావు, మన్నె కిశోర్‌కుమార్, పోలవరపు శ్రీకాంత్, సైన్స్ రిసోర్స్‌పర్సన్స్ రంజిత్‌కుమార్, జక్కుల యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి నాలుగు ప్రదర్శనలు
జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్‌లో 68 ప్రదర్శనలు ఏర్పాటుచేయగా, నాలుగింటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ఆర్.అక్ష్మిత బోదకాలు వ్యాధిపై అధ్యయనంతో ప్రదర్శించిన ఎగ్జిబిట్‌తో పాటు హార్వెస్ట్ పాఠశాల విద్యార్థి ఈ.యశస్వి ప్రదర్శించిన సుసైడల్ వీడ్స్ (కలుపు మొక్కలు నాశనం చేసే మందు తయారీ), త్రివేణి పాఠశాల విద్యార్థి టి.డార్విన్ గ్రానైట్ వేస్ట్ వాటర్‌తో ఆవరణ వ్యవస్థకు జరిగే నష్టానికి పరిష్కార మార్గాలు, విన్‌ఫీల్డ్ హైస్కూల్ విద్యార్థిని ఏ.ఆశీర్లబీ హైజిన్ గో హెల్తీ(ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా ఉండండి) పేరిట ప్రదర్శించిన ఎగ్జిబిట్లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి.