Skip to main content

Model School Notification: మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుద‌ల‌.. చివ‌రి తేదీ ఇదే..

కరీంనగర్‌/మల్లాపూర్‌/వీర్నపల్లి/జ్యోతినగర్‌: ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మోడల్‌ స్కూళ్లు ఓ వరం. రూ.వేలకు వేలు ఖర్చులు పెట్టి, దూరప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్‌ సంస్థల్లో విద్యనభ్యసించాలంటే పిల్లలు ఇబ్బంది పడాల్సి వచ్చేది.
Model school admissions notification release   English medium education

చదువుకునేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే ఆదర్శ పాఠశాలలను నెలకొల్పడంతో నాణ్యమైన విద్య అందుతోంది. బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యనందిస్తున్న మోడల్‌ స్కూళ్లలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

జ‌నవ‌రి 12 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 6వ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 07న ఆయా పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

7, 8, 9, 10వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.125, మిగతా వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

చదవండి: Online Courses: ఆన్‌లైన్‌ కోర్సుల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య.. వివరాలు..

ఒక్కో పాఠశాలలో 100 సీట్లు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 38 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో చొప్పదండి మండలంలోని రుక్మాపూర్‌, కరీంనగర్‌ మండలంలోని ఎలగందల్‌, మానకొండూర్‌ మండలంలోని పోచంపల్లి, రామడుగు, వీణవంక, జమ్మికుంట మండలంలోని టేకుర్తి, చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్‌, గంగాధర, శంకరపట్నం, తిమ్మాపూర్‌, సైదాపూర్‌లలో మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 6వ తరగతిలో 100 సీట్లు ఉన్నాయి. 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు.

ఏప్రిల్‌ 1 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌..

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పరీక్ష ఫలితాల ప్రకటన తర్వాత సంబంధిత ప్రిన్సిపాళ్లకు మెరిట్‌ జాబితాల అందుతుంది. మోడల్‌ స్కూళ్లలో విద్యార్థుల ఎంపిక జాబితా ఖరారు చేస్తారు. దానికి అడిషనల్‌ కలెక్టర్ల ఆమోదం తెలుపుతారు. మే 25 నుంచి 31వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టి, ప్రవేశాలు కల్పిస్తారు. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

పరీక్ష విధానం..

6వ తరగతి ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు కేటాయించారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది. 6వ తరగతిలో తెలుగు, గణితం, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఆంగ్ల పాఠ్యాంశాల్లో ఒక్కోదాని నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. 7 నుంచి 10వ తరగతులకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్‌ నుంచి వంద ప్రశ్నలుంటాయి. ఒక్కోదాని నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. 2 గంటలపాటు అబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

బాలికలకు హాస్టల్‌ సౌకర్యం

బాలికలకు హాస్టల్‌ వసతి సౌకర్యం ఉంది. 9, 10వ తరగతులతోపాటు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంద మందికి మాత్రమే అవకాశం. హాస్టల్‌కు కనీసం 3 కిలోమీటర్ల నుంచి ఆపైన దూరంలో ఉండేవారే ఇందుకు అర్హులు.

సద్వినియోగం చేసుకోవాలి

మోడల్‌ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు ఎన్‌సీసీలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థినులకు హాస్టల్‌ వసతి ఉంది. ఏటా మెరుగైన ఫలితాలు వస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
– జనార్దన్‌రావు, డీఈవో, కరీంనగర్‌

Published date : 12 Jan 2024 09:54AM

Photo Stories