Sankranti Ravikumar: అమెరికాలో శిక్షణకు లాలాపురం ఉపాధ్యాయుడు
ఇంటర్నేషనల్ టీచర్స్ పేరుతో అమెరికాలో 45 రోజుల పాటు సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. అమెరికా ప్రభుత్వ విద్యాశాఖ ఏటా దాదాపు 70 దేశాల్లో వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులను ఐరెక్స్ సంస్థ ద్వారా ఎంపిక చేసి ఆయా దేశాల్లో బోధన తీరుపై చర్చించడమే కాక మెరుగైన బోధనకు నిపుణులతో సూచనలు ఇప్పిస్తుంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న రవికుమార్ తొలి 30 మందిలో ఒకరిగా నిలిచి, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికై న పది మంది జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు. చివరకు భారత్ నుంచి ఆరుగురిని ఎంపిక చేయగా అందులో రవికుమార్ ఉన్నారు.
చదవండి: Training for Teachers: ఉపాధ్యాయులకు 'జ్ఞాన జ్యోతి' శిక్షణ ప్రారంభం
కొణిజర్ల మండలం పల్లిపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడైన ఆయన విద్యారంగంలో బాలికల అభివృద్ధికి వివిధ దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, బోధనలో శాస్త్ర సాంకేతిక పరికరాల వినియోగంపై అమెరికా వర్క్‌షాప్‌ల్లో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా విద్యా శాఖాధికారి ఈ.సోమశేఖరశర్మ నవంబర్ 1న అభినందించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయుడు రవికుమార్ మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వ కార్యక్రమానికి ఎంపిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు. బోధనా పద్ధతుల్లో వస్తున్న మార్పులను ఈ పర్యటన ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.