Inspire: ఇన్‌స్పైర్ చేస్తున్నారు.. ఆటోమేటిక్ గ్యాస్ బుకింక్ సిస్టమ్
నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చిట్టిబుర్రలు కనిపెడుతున్నాయి. పారిశ్రామికంగా ఎదురయ్యే సమస్యలు.. వాతావరణ కాలుష్య నివారణ.. తదితర నిత్య సమస్యలకు పరిష్కారాలు చూపుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. వినూత్న ఆలోచనలతో అడుగులు వేస్తున్న విద్యార్థులు, వారి ఉపాధ్యాయుల సలహాలతో అద్భుత ఆవిష్కరణలకు రూపమిస్తున్నారు.
2022–23 విద్యాసంవత్సరానికి జాతీయస్థాయిలో నిర్వహించే ఇన్‌స్పైర్ మానక్‌లో మనోళ్లు రాష్ట్రస్థాయి వరకు వెళ్లారు. దాదాపు 67 ప్రదర్శనలలో రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి 7 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. వీరందరూ జాతీయస్థాయిలో రాణించి సిరిసిల్ల సైన్స్ విజ్ఞానాన్ని దేశవ్యాప్తం చాటాలని ఆకాంక్షిస్తున్న తరుణంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాధారణ సమస్య..సాంకేతికంగా..
నేను చేసిన ప్రాజెక్టు అత్యంత సాధారణమైంది. కానీ రోజువారి జీవితంలో అవసరమైంది. మన ఇంటిలో.. అపార్ట్‌మెంట్‌లో అనేకసార్లు డ్రెయినేజీ పైపులలో ఏదో ఒకటి ఇరుక్కుంటుంది. దీన్ని సరిచేయడానికి పైపులను పగులకొడతాం. కానీ నేను చేసిన ప్రయోగంతో అసలు ఎలాంటి డ్యామేజీ లేకుండా పైపులలో ఇరుక్కున్న వస్తువులను సులభంగా తీయగలం. దీని కోసం వాడిపడేసిన బైక్స్ క్లచ్ కేబుల్స్ తీసుకున్నాను. దానికి ముందుభాగంలో విచ్చుకునేలా కొన్ని స్ట్రిప్స్ పెట్టాను.
మనం కేబుల్స్‌ను పైపులోకి పెట్టి మన చేతి భాగం వద్ద ఏర్పాటు చేసిన మరో భాగాన్ని నొక్కగానే ముందున్న స్ట్రిప్స్ విచ్చుకుని పైపులో ఇరుక్కున్న వాటిని పట్టుకుంటుంది. ఇలా పైపులలో ఇరుకున్న వస్తువులను బయటకు తీసేయవచ్చు. దీనిని మొబైల్‌కు అనుసంధానించి పైపులో ఏమున్నదో.. లేదో పరిశీలించవచ్చు. దీనికి కేబుల్స్, సెన్సార్ ఖర్చు తప్ప మరేమి లేదు. గైడ్ టీచర్ కోరెం వెంకటేశం సలహాలు ఉపయోగపడ్డాయి. ప్రాజెక్టు ఖర్చు రూ.200 మాత్రమే.
– అన్నాడి సాహిత్య, 8వ తరగతి, హన్మాజీపేట స్కూల్
ఆటోమేటిక్ గ్యాస్ బుకింక్ సిస్టమ్
సిలిండర్ బండలో గ్యాస్ ఒక స్థాయి వరకు ఖాళీ కాగానే రీఫిల్ చేయడానికి అవసరమైన సులభ పద్ధతి కోసం చేసిన ఆలోచనే ఆటోమేటిక్ గ్యాస్ బుకింక్ సిస్టమ్. దీని ద్వారా గ్యాస్ సిలిండర్‌లో ఒక కిలో గ్యాస్ ఉండగానే మనకు హెచ్చరిక వస్తుంది. అంతేకాకుండా మన గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు రీఫిల్లింగ్ కోసం ఆర్డర్ వెళ్తుంది. దీని కోసం సెన్సార్, రిలే, స్పీకర్, పవర్ సప్లయ్ వంటి పరికరాలను ఉపయోగించాను. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. నా ప్రాజెక్టుకు గైడ్ టీచర్ రమేశ్, హెచ్‌ఎం అనురాధ ప్రోత్సహించారు.
– వై.లోకేశ్, 10వ తరగతి, జిల్లెల స్కూల్