Tenth Class Public Exams 2024: టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

జనగామ రూరల్: జిల్లాలో ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింగేష్‌కుమార్‌తో కలిసి పరీక్షలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 6,698 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు 41 సెంటర్లు కేటాయించినట్లు చెప్పారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టిస్ చేయకుండా చూడాలని, మూడు, నాలుగు సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించాలన్నారు.
Also Read : Model Papers 2024
సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలని, సెంటర్లకు ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్‌లు అనుమతించవద్దని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు ఉండాలని సూచించారు. కాంపౌండ్ వాల్ లేని సెంటర్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సందేహాల నివృత్తికి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 6304062768లో సంప్రదించాలని చెప్పారు. సమావేశంలో ఏసీపీ దామోదర్‌రెడ్డి, డీపీఓ రంగాచారి, డీఈఓ రాము, విద్యుత్ ఎస్‌ఈ కొండల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.