Skip to main content

Govt Schools: ఇన్‌స్ట్రక్టర్ల నియామకమెప్పుడో!

ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు తోడ్పడుతోంది. ఇటీవల పాఠశాలల్లో స్కావెంజర్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది.
Appointment of instructors

మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. ఆగ‌స్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా ఇంకా ఫలితాలు వెలువడలేదు. కాగా, కొన్నేళ్లుగా నిరీక్షించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇటీవల ప్రమోషన్లు కల్పించింది. బదిలీలూ చేపట్టింది. దీంతో పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడి బోధన కుంటుపడుతోంది.

ఆయా జిల్లాల అధికారుల అభ్యర్థ మేరకు ప్రభుత్వం నారాయణపేట్‌, వికారాబాద్‌ జిల్లాలకు అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల పేరిట నియామకాలు చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.15,600 చెల్లించేందుకు అంగీకరించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఉపాధ్యాయ ఖాళీలను ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తే విద్యార్థులకు మేలు జరగనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: Bad News Anganwadi Center Closed: మూతపడిన అంగన్‌వాడీ కేంద్రం ఇబ్బందుల్లో చిన్నారులు

కుంటుపడుతున్న బోధన

గతంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించి తరగతులు నిర్వహించారు. గత కొన్నేళ్లుగా వీవీల నియామకం చేపట్టడం లేదు. ఆయా పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ కాలం వెల్లదీశారు.

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులున్న చోట విద్యార్థుల సంఖ్య లేదు. విద్యార్థులున్న చోట సరిపడా ఉపాధ్యాయులు లేరు. ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 100 వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు, మరో 50 వరకు ఒక్కో ఉపాధ్యాయుడు లేని పాఠశాలలున్నాయి. ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆ సమయంలో పాఠశాలకు సెలవు అనే పరిస్థితి ఉంది.

ఇటీవల జరిగిన బదిలీల్లో ఏకోపాధ్యాయుడున్న పాఠశాల నుంచి ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయలేదు. బదిలీ జరిగినా అదే చోట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేక నాణ్యమైన విద్య అందడం లేదు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కనీస బోధన సామర్థ్యాలూ కనిపించడం లేదు.

చదవండి: KSN Women's Degree College : కేఎస్‌ఎన్‌ కళాశాల విద్యార్థినుల‌కు పూర్తి భ‌ద్ర‌త.. ఈ విద్యాసంవ‌త్స‌రంలో అందుబాటులోకి కొత్త కోర్సులు..

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో డీఈవో పరిధిలో 2,848 పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో 11,286 ఉపాధ్యాయులుండాల్సింది. కాగా, 2,079 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డీఎస్సీ నియామకాలు చేపట్టేదాకా తాత్కాలికంగా అకాడ మిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తే విద్యార్థులకు ప్రయోజనం జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు జిల్లాల్లో అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల పేరిట డీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యేదాకా విద్యాబోధన చేసేలా చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలోనూ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తే సర్కారు బడుల్లో చదువుకుంటున్న ఇక్కడి విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఎలాంటి ఉత్తర్వులు రాలేదు

అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. జిల్లాలో 590 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనకు ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. ఖాళీల వివరాలు గుర్తిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.

– ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్‌

Published date : 12 Aug 2024 03:54PM

Photo Stories