Tenth Class Public Exams 2024: పదోతరగతి లో 10 జీపీఏ లక్ష్యంగా సాధన
కరీంనగర్‌లోని సుభాష్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థులు 10 జీపీఏ లక్ష్యంగా కొన్ని నెలలుగా సాధన చేస్తున్నారు. 2023లో మొత్తం 83 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవగా 84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 9.7 జీపీఏను పాఠశాల కై వసం చేసుకుంది. ఈ విద్యాసంవత్సరం మొత్తం 79 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికి టీచర్లు కొన్ని నెలలుగా ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి, బోధన సాగిస్తున్నారు.
విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్..
టీచర్లు వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులతో ప్రాజెక్టు వర్క్ చేయించి, వారిలో నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు తమ మేథస్సుకు పదునుపెట్టి, ప్రశ్నలు తయారు చేశారు. వాటికి సమాధానాలు రాసేలా పిల్లలను సిద్ధం చేశారు.
రోజుకో పరీక్ష..
మా టీచర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో బాగా చదివిస్తున్నారు. రోజుకో పరీక్ష పెడుతున్నారు. బిట్స్ ఎలా రాయాలో చెబుతున్నారు. స్టడీ క్లాస్‌లు ఉపయోగపడుతున్నాయి. 10 జీపీఏ సాధిస్తా. – ఎల్.హర్షిక
10 జీపీఏ సాధిస్తా..
నేను బాగా చదువుతున్నా. ప్రస్తుతం 9 జీపీఏ పైనే వస్తున్నాయి. పరీక్షల నేపథ్యంలో మార్నింగ్, ఈవినింగ్ ప్రిపేరవుతున్నా. మా సార్‌లు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. 10 జీపీఏ సాధిస్తానన్న నమ్మకం ఉంది. – జి.ఓంకార్
ఒత్తిడికి గురికావొద్దు
విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే ముందు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దు. నిర్భయంగా ఉన్నప్పుడే బాగా రాసే అవకాశం ఉంటుంది. లక్ష్యంతో పరీక్షలు రాస్తే విజేతలుగా నిలుస్తారు. పలువురు 10 జీపీఏ సాధిస్తారనుకుంటున్నాం.
– ఖాజా నసీరొద్దీన్, ప్రధానోపాధ్యాయుడు
వెనకబడిన విద్యార్థులపై దృష్టి
మా పాఠశాలలో ఉపాధ్యాయులందరం వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అందరూ ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. పిల్లలను గ్రూపులుగా విభజించి, ప్రత్యేక మెటీరీయల్ తయారు చేసి, ఇచ్చాం.
– ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు ఉపాధ్యాయుడు