Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 3 నుంచి ప్రారంబం ...
కరీంనగర్: పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఈనెల 3 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జాన్ హైస్కూల్‌లో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం కొనసాగనుంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 563 మంది ఏఈలు, 94 మంది సీఈలు, 230 మంది ప్రత్యేక సహాయకులుగా ఉపాధ్యాయులను నియమించారు. అసిస్టెంట్ కోడింగ్ అధికారులుగా 8 మంది, కోడింగ్ సహాయకులుగా మరో 60 మందిని నియమించారు. డీఈవో, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ స్ట్రాంగ్‌రూమ్ ఇన్‌చార్జీగా, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు.
తప్పిదాలకు పాల్పడితే..
పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్‌లో తక్కువ సమయంలో ఎక్కువ జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి డబ్బులు దండుకోవాలనే వారిపై కొరడా ఝుళిపించనున్నారు. దీంతో ఉపాధ్యాయులు స్పాట్ అంటేనే జంకుతున్నారు. ఏడాది పొడవునా కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు కొంత మంది గురువులు మూల్యాంకనంలో చేసే తప్పిదాలతో నష్టం వాటిల్లుతుంది. పరీక్షలు బాగా రాసినా మార్కులు తగ్గడం, ఫెయిల్ కావడం వంటి ఘటనలు గతంలో వెలుగుచూశాయి. విద్యార్థులు తమకేన్ని మార్కులు వచ్చాయో, చేసిన తప్పిదాలేంటో తెలుసుకునేందుకు ఎస్సెస్సీ బోర్డు జవాబు జిరాక్స్ పత్రాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తప్పులు దిద్దినట్లు నిర్ధారణ అయితే విద్యార్థి నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. స్పాట్ వాల్యుయేషన్‌లో ఉపాధ్యాయులు తప్పిదాలకు పాల్పడితే నోటీసులు జారీ చేయడం, ఎక్కువ తప్పిదాలకు పాల్పడితే జరిమానా విధించడం, అవసరమైతే వారిని శాశ్వతంగా మూల్యాంకనం నుంచి తప్పించడం లాంటి నిర్ణయాలు కూడా తీసుకునే అధికారం ఉంది. దీంతో పలువురు ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్‌కు వెళ్లకుండా ఉండటమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు.
జిల్లాకు 2.20 లక్షల జవాబుపత్రాలు
ఇతర జిల్లాలకు చెందిన 2.20లక్షల జవాబు పత్రాలు స్థానిక సెయింట్ జాన్ పాఠశాలలోని మూల్యాంకన కేంద్రానికి చేరుకుంటున్నాయి. పటిష్ట బందోబస్తు మధ్య అధికారులు వాటిని కోడింగ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. స్పాట్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులు ఈనెల 2 నుంచి తాము పనిచేసే పాఠశాలల నుంచి రిలీవ్ అయి 3న ఉదయం 8.30 గంటలకు డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
Also Read: Telangana 10th Results 2024 Release Date
జరిమానా ఇలా..
పదో తరగతి మూల్యాంకనంలో తప్పిదాలు చేసే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు, జరిమానాలు విధిస్తారు. ఒకటి నుంచి 5 తప్పిదాలు చేసిన ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్‌లకు షోకాజ్ నోటీసులు, ఆరు నుంచి 10 తప్పిదాలు చెస్తే ఎగ్జామినర్లకు రూ.500, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.200 విధిస్తారు. 11 నుంచి 20 తప్పిదాలు చేసిన ఎగ్జామినర్లకు రూ.1,000, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.500, అలాగే 21 నుంచి 30 తప్పిదాలు చేసిన ఎగ్జామినర్లకు రూ.1,500, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.700 జరిమానా వేస్తారు. 30కి పైగా తప్పిదాలు చేసిన ఎగ్జామినర్లకు రూ.2,000, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.1,000 జరిమానా విధించడంతో పాటు భవిష్యత్తులో మూడేళ్ల పాటు మూల్యాంకనం విధులను వారికి అప్పగించరు.
పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
పదో తరగతి మూల్యాంకనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లాకు కేటాయించిన జవాబు పత్రాలను సజావుగా దిద్దేందుకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను సమకూర్చాం. స్పాట్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్య జవాబు పత్రాలను దిద్దుతారు. – జనార్దన్‌రావు, డీఈవో