TRT Notification: కొన్ని ఏళ్లుగా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు.. నోటిషకేషన్ మాత్రం ఇవ్వడం లేదు
ఏళ్లుగా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. కానీ.. ప్రభుత్వం నోటిషకేషన్ ఇవ్వడం లేదు. ఎన్నికల ఏడాది నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2017లో టీఆర్టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన నుంచి ఇప్పటివరకు ఆరేళ్లు అవుతున్నా కొత్తగా భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. అర్హులైన అభ్యర్థులు జిల్లాలో దాదాపు 12 వేలమంది నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
గతేడాది టెట్ నోటిఫికేషన్ వేసినా, టీఆర్టీకి మాత్రం మోక్షం లభించలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉప సంఘం కూడా మరోసారి టెట్ నిర్వహణకు ఓకే చెప్పింది. టీఆర్టీపై మాత్రం అడుగులు ముందుకు పడడంలేదు. రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయవచ్చన్న సంకేతాలు వెలువబడుతుండడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
చదవండి: TS TET 2023 Notification : వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్.. త్వరలోనే డీఎస్సీపైన కూడా..
హైదరాబాద్‌కు వెళ్లిన అభ్యర్థులు..
జిల్లా నుంచి డీఈడీ, బీఈడీ చేసిన అభ్యర్థులంతా ఇటీవల హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి ధర్నా కోసం తరలివెళ్లారు. తక్షణమే టీఆర్ట్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో టెట్‌తో పాటే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
చదవండి: DEO: టీటీసీ విద్యార్థులకు పరీక్షలు
జిల్లాలో ఖాళీలు ఇలా...
జిల్లాలో మొత్తం ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో 461 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 235 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 54 భాషా పండితులు, 172 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్జీటీలు, భాషా పండితులు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా.. స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో 70 శాతం ప్రమోషన్ల ద్వారా 30 శాతం డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
చదవండి: Teacher Education System: మా‘స్టార్లు’గా మార్చేందుకు..
బదిలీలు, ప్రమోషన్లే అడ్డంకి
జిల్లాలో పలు పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తుండగా మరోవైపు బదిలీలు, ప్రమోషన్లు పూర్తయితేనే నూతన నియామకాల వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని విద్యాశాఖవర్గాలు పేర్కొంటున్నాయి. బదిలీలు, ప్రమోషన్లకు గతంలోనే షెడ్యూల్ విడుదల చేయగా ప్రక్రియ కొనసాగుతుండగానే హైకోర్టు స్టే విధించింది. పలు దఫాలుగా వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టేను కొనసాగిస్తూనే వస్తోంది. ఈ వ్యవహారం కొలిక్కి వస్తేనే నూతన ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్‌కు మార్గం సుగమమవుతుంది..