Skip to main content

విదేశీ విద్యకు ప్రతిభ కంటే...ఎస్‌ఓపీ, ఎల్‌ఓఆరే కీలకం

అమెరికా.. విదేశీ విద్యకు వెళ్లాలనుకునే మన విద్యార్థుల తొలి గమ్యం! అక్కడ మంచి ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం లభిస్తే.. భవిష్యత్తు డాలర్ల మయం అవుతుందనే ఆశ!! కాని అకడెమిక్‌గా వచ్చిన యావరేజ్ మార్కులు చూస్తే దిగులు. టాప్ కాలేజీలకు దరఖాస్తు చేయాలంటేనే జంకు. వాస్తవానికి మార్కుల కంటే.. ఓ రెండు ప్రామాణికాలు కీలకంగా మారుతున్నాయి. అవే.. ఎస్‌ఓపీ (స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్); ఎల్‌ఓఆర్(లెటర్ ఆఫ్ రికమండేషన్). యూనివర్సిటీ అడ్మిషన్ కమిటీలను ఆకట్టుకునే విధంగా ఎస్‌ఓపీ, ఎల్‌ఓఆర్ రూపొందిస్తే.. మంచి ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందామా..!
ప్రస్తుతం అమెరికాలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం సులభంగానే లభిస్తోంది. కానీ.. చదువు పూర్తయ్యాక కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవడమే కష్టంగా మారుతోంది. కాబట్టి విద్యార్థులు కాలేజీ విషయంలో రాజీ ధోరణిని వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. యూఎస్‌లో ఉద్యోగం సొంతం చేసుకోవడానికి.. హెచ్-1బి వీసా ఖరారుకు.. ఆ తర్వాత గ్రీన్‌కార్డ్ పొందడానికి మార్గం.. మంచి కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించడం.

గ్రేట్, యావరేజ్, బ్యాడ్:
పస్తుతం అమెరికా సహా ఇతర దేశాల్లో.. గ్రేట్ స్కూల్స్, యావరేజ్ స్కూల్స్, బ్యాడ్ స్కూల్స్ అనే మూడు కేటగిరీలుగా సదరు ఇన్‌స్టిట్యూట్‌లను పేర్కొనొచ్చు. బెటర్ స్కూల్‌లో ప్రవేశం పొందితే చదువు పూర్తయ్యాక అక్కడే మంచి ఉద్యోగం కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అపోహలు.. రాజీ దృక్పథం :
చాలామంది విద్యార్థులు మార్కులు తక్కువగా వచ్చాయనో.. జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్ వంటి పరీక్షల్లో స్కోర్ ఆశించిన స్థాయిలో లేదనో.. గ్రాడ్యుయేషన్ స్థాయిలో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయనో.. మంచి యూనివర్సిటీలో ప్రవేశం లభించదని భావిస్తున్నారు. అందుకే వారు మంచి కాలేజీలకు దరఖాస్తు కూడా చేసుకోవట్లేదు. వాస్తవానికి అమెరికా ఇన్‌స్టిట్యూట్‌లు కేవలం ఒకటి రెండు ప్రామాణికాలకే అధిక వెయిటేజీ ఇవ్వడం లేదని గుర్తించాలి. విద్యార్థుల అకడమిక్ ప్రొఫైల్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ..ఇతర సానుకూల అంశాలు ఉండేలా చూసుకుంటే మంచి ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ఆ సానుకూల అంశాలే... స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌వోపీ), లెటర్ ఆఫ్ రికమండేషన్(ఎల్‌వోఆర్).

ఎస్‌ఓపీ :
  • మా యూనివర్సిటీలో మీకు ఎందుకు ప్రవేశం కల్పించాలి? అనే ప్రశ్నకు.. విద్యార్థులు వ్యాసరూప విధానంలో తమ లక్ష్యాలు, అందుకు సదరు యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ ఏ విధంగా దోహదపడుతుందో వివరిస్తూ..రాసే పత్రం ఇది. ఎస్‌ఓపీ విషయంలో పొరపాట్లు చేయడం వల్ల విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటున్నారు.
  • ఎస్‌ఓపీ అంటే తమ ఇంగ్లిష్ నైపుణ్యాలను ప్రదర్శించే పత్రంగా చాలామంది భావిస్తుంటారు. నిజానికి విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాలకు సంబంధించి అప్పటికే వారు ఐఈఎల్‌టీఎస్/జీఆర్‌ఈలలో పొందిన స్కోర్ల ఆధారంగా ఇన్‌స్టిట్యూట్‌లు ఒక అంచనాకు వస్తాయి. కాబట్టి ఎస్‌ఓపీ అనేది ఇంగ్లిష్ నైపుణ్యాలు ప్రదర్శించే డాక్యుమెంట్‌గా కాకుండా.. తమ లక్ష్యాలను తెలియజేసే మార్గంగా రూపొందించుకోవాలి. అది కూడా సరళమైన భాషలో సూటిగా, స్పష్టంగా ఉండాలి.
  • విద్యార్థులు చేస్తున్న మరో పొరపాటు.. సొంతంగా రాయకుండా అప్పటికే తమ సీనియర్లు రూపొందించిన ఎస్‌ఓపీలకు కొన్ని మార్పులు చేయడం.. లేదా రెండు, మూడు ఎస్‌ఓపీలను కలిపి తయారుచేయడం. ఎస్‌ఓపీ అనేది మిమ్మల్ని మీరు తెలియజేసుకునే పత్రం. కాబట్టి దీన్ని సొంతంగా రూపొందించాలి.
  • ఎంఎస్ తదితర రీసెర్చ్ అనుసంధాన కోర్సుల పరంగా ఎస్‌ఓపీ మరింత ప్రత్యేకంగా ఉండాలి. ఎంఎస్ కోర్సుల ఔత్సాహిక అభ్యర్థులు ఎస్‌ఓపీలో రీసెర్చ్, అకడమిక్ వర్క్ కు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

ఎల్‌ఓఆర్:
లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్‌ఓఆర్) అంటే.. మీ ప్రతిభా పాటవాలను వివరిస్తూ... మీరు అకడెమిక్ కోర్సులు చదువుకున్న కాలేజీ ప్రొఫెసర్ ఇచ్చే పత్రం. ఎల్‌ఓఆర్ విషయంలోనూ విద్యార్థులు ఇన్‌స్టంట్ మార్గాలు అనుసరిస్తున్నారు. అప్పటికే ఫ్యాకల్టీ సభ్యులు ఇతరులకు ఇచ్చిన ఎల్‌ఓఆర్‌లో పేరు మార్చి.. తమ దరఖాస్తుతో జత చేస్తున్నారు.
  • వాస్తవానికి ఎల్‌ఓఆర్ ఇచ్చే ప్రొఫెసర్‌కు సదరు విద్యార్థి గురించి ప్రత్యక్షంగా తెలిసుండాలి. కాబట్టి మీకు బోధించిన అధ్యాపకుల నుంచే వీటిని పొందాలి. ప్రొఫెసర్ల దగ్గర ఉన్న పాత ఎల్‌ఓఆర్‌లను చూసి.. రూపొందించడం సరికాదు.
  • విద్యార్థులు ఎల్‌ఓఆర్ అంటే ఫ్యాకల్టీ సభ్యులు ఇచ్చే రికమండేషన్ లెటర్ అని భావిస్తున్నారు. అది వాస్తవం కాదు. పలు టాప్ ఇన్‌స్టిట్యూట్స్.. ఎల్‌ఓఆర్‌తోపాటు హార్డ్‌వర్క్, ఇన్నోవేటివ్ దృక్పథం, ప్రజెంటేషన్ స్కిల్స్ వంటి ప్రామాణికాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
  • ఇలా.. ఎస్‌ఓపీ, ఎల్‌ఓఆర్‌ల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే అకడమిక్‌గా కొంత తక్కువ స్కోర్లు ఉన్నప్పటికీ.. మంచి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం ఖరారు చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

జీఆర్‌ఈ స్కోర్ తక్కువైనా..
జీఆర్‌ఈ స్కోర్ బెస్ట్‌గా ఉంటేనే.. ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం లభిస్తుందని భావిస్తుంటారు. అయితే మొత్తం 340 మార్కులకు నిర్వహించే జీఆర్‌ఈలో అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు వెర్బల్ విభాగం స్కోర్ కంటే.. క్వాంటిటేటివ్‌లో పొందిన స్కోర్‌కు ఎక్కువ వెయిటేజీ ఇస్తాయి. ఈ విషయాన్ని మన విద్యార్థులు గుర్తించాలి. క్వాంటిటేటివ్ విభాగంలో మన దేశ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. అందువల్ల జీఆర్‌ఈ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ.. క్వాంటిటేటివ్‌లో బాగా రాణిస్తే మంచి కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు.

బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్.. ప్రయోజనాలు ఇలా.
అమెరికాలో మంచి యూనివర్సిటీలకు కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు అందుతాయి. కాబట్టి అక్కడ నాణ్యమైన ఫ్యాకల్టీ, సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో రీసెర్చ్ కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతాయి. వాటిలో విద్యార్థులు పాల్పంచుకోవచ్చు. స్కాలర్‌షిప్స్, అసిస్టెంట్‌షిప్స్ సైతం అందుకోవచ్చు. ఇక్కడ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధుల ఆధారంగా నిర్వహించే పరిశోధనలు భవిష్యత్తు అవసరాల దృక్కోణంలో జరుగుతాయి. వీటిలో పాల్పంచుకోవడం ద్వారా విద్యార్థులు అడ్వాన్స్‌డ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. అధిక శాతం ఫ్యాకల్టీ ఏక కాలంలో పలు రకాల కార్పొరేట్ రీసెర్చ్ ప్రాజెక్టులు చేస్తుంటారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు కన్సల్టెంట్స్‌గానూ వ్యవహరిస్తుంటారు. దీంతో వారికి కార్పొరేట్ వర్గాలతో మంచి నెట్‌వర్క్ ఉంటుంది. ఇలాంటి వారి వద్ద రీసెర్చ్ అసిస్టెంట్స్‌గా చేరితే భవిష్యత్‌లో మంచి ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. మంచి పనితీరుతో సదరు కంపెనీల దృష్టిలో పడటం ద్వారా... హెచ్-1బి వీసాకు మార్గం సుగమం అవుతుంది.

కాలే జీ, కోర్సు ఎంపికలో జాగ్రత్త :
విదేశీ విద్య ఔత్సాహికులు.. కోర్సు, కాలేజీ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సగటు విద్యార్థులు సైతం బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం అకడమిక్ ప్రొఫైల్‌తోపాటు ఎస్‌ఓపీ, ఎల్‌ఓఆర్, జీఆర్‌ఈ సెక్షన్‌వైజ్ స్కోర్లు మంచి యూనివర్సిటీలో ప్రవేశానికి కీలకంగా నిలుస్తున్నాయి. వీటి విషయంలో మెరుగ్గా వ్యవహరిస్తే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం ఖరారు చేసుకునే వీలుంది.
- మొహమద్ అబ్దుల్లా, సీఈఓ, conduira
Published date : 30 Nov 2019 04:35PM

Photo Stories