Skip to main content

ఎంబీబీఎస్ ఎంచక్కా విదేశాలో...!

ఇంటర్‌లో బైపీసీ తీసుకునేవారి తొలి లక్ష్యం ఎంబీబీఎస్సే. దేశంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు తక్కువ కావటంతో కొందరికే అవకాశం దొరుకుతోంది.
ఈ ఏడాది ఇప్పటికే నీట్ ర్యాంకుల ఆధారంగా తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తయింది. మరి సీటు రాని వారు తమ ఎంబీబీఎస్ గమ్యాన్ని చేరుకోవటం ఎలా? వీరికోసం పలు విదేశీ వర్సిటీలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎన్ని దేశాలు ఏ రకంగా ఆహ్వానం పలుకుతున్నా మన విద్యార్థులు వెళ్లేది మాత్రం కొన్ని దేశాలకే..! ఆ వివరాలతో పాటు... వాటిల్లో ప్రవేశానికి అర్హతేంటి? ఫీజులెంత? కోర్సుల తీరుతెన్నులేంటి? పూర్తి చేసిన తరవాత ఇక్కడ అవకాశాలెలా ఉన్నాయి? ఈ వివరాలన్నీ అందించడానికి ప్రత్యేక కథనమిది...
  • గడిచిన నాలుగైదేళ్లుగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించడానికి వెళుతున్న మన విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
  • ఈ ఏడాది కూడా నీట్‌లో ఉత్తీర్ణత సాధించినా పరిమిత సీట్ల కారణంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభించని విద్యార్థులు...విదేశీ వైద్య విద్యపై దృష్టిసారిస్తున్నారు.
  • మన దేశంలోని ఎంబీబీఎస్ ఫీజుతో పోల్చితే... తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే అవకాశం ఉండటం కూడా మన విద్యార్థులను ఆకర్షిస్తోంది.

నీట్ ఉత్తీర్ణత తప్పనిసరి !

నీట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే విదేశీ వైద్య విశ్వ విద్యాలయాల్లో చేరేందుకు అనుమతి లభిస్తుంది. ఈ మేరకు ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయా విదేశాల్లోని యూనివర్సిటీలు సైతం నీట్ ఉత్తీర్ణత ఉంటేనే దరఖాస్తులను అనుమతిస్తున్నాయి. సెంట్రల్ అమెరికా పరిధిలోని కొన్ని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు నీట్ ఉత్తీర్ణత లేకున్నా ప్రవేశాలు కల్పిస్తామని చెబుతున్నాయి. అయితే ఇలాంటి ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరి కోర్సు పూర్తి చేసిన వారికి... మన దేశంలో ప్రాక్టీస్‌కు తప్పనిసరి పరీక్ష అయిన.. ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ (ఎఫ్‌ఎంజీఈ) రాయడానికి అనుమతి ఉండదు. దీన్ని దష్టిలో పెట్టుకుని విద్యార్థులు తప్పనిసరిగా నీట్ ఉత్తీర్ణతతో ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లను అన్వేషించడం మంచిది.
1. నీట్‌తో పాటు బైపీసీ గ్రూప్‌తో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులయి ఉండాలి.
2. పాస్‌పోర్ట్ ఉండటంతో పాటు ఆయా దేశాలకు సంబంధించిన వీసా నిబంధనల్ని పాటించాలి.
3. ఆర్థిక వనరులు ఉన్నాయని చూపించే ధ్రువీకరణ (బ్యాంక్ స్టేట్‌మెంట్) తప్పనిసరి.

ఉత్తమ గమ్య స్థానాలివే !
బ్యాచిలర్ స్థాయి మెడికల్ కోర్సుల పరంగా రష్యా, ఉక్రెయిన్, కిర్గిజ్‌స్థాన్, జార్జియా, చైనా, జర్మనీ, ఫిలిప్పీన్స్ దేశాలు కొన్నేళ్లుగా ఆదరణ పొందుతున్నాయి. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళుతున్నది ఇక్కడికే.
ఒకప్పుడు...
దేశంలో నాణ్యమైన వైద్య విద్య దొరకదేమో!! అని సందేహించేవారంతా వెళ్లి విదేశాల్లో మెడిసిన్ చేసి వచ్చేవారు.
ఇప్పుడు..
ఇక్కడ సీట్లు తక్కువ కావటంతో వైద్యులు కావాలనే కోరిక ఉన్నవారంతా చలో ఫారెన్ అంటూ వెళుతున్నారు.

నీట్‌తో వెళ్లాల్సిందే...
  • నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో ఉత్తీర్ణత సాధిస్తేనే విదేశీ వైద్య విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు అనుమతి లభిస్తుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆదేశాలు జారీ చేసింది.
  • ఎంసీఐ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాల జాబితా అధికారిక వెబ్‌సైట్ www.mciindia.org లో అందుబాటులో ఉంది. స్టడీ అబ్రాడ్-ఎంబీబీఎస్ దిశగా అడుగులేస్తున్నవారు దేశాల వారీగా అందుబాటులో ఉన్న విద్యాసంస్థల వివరాలను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలి.
  • దరఖాస్తు చేసుకునే ముందు ఆయా విద్యా సంస్థలకు గుర్తింపు ఉందా.. లేదా? కోర్సు వ్యవధి, ఫీజుల వివరాలు, అర్హతలు, అవసరమైన ధ్రువీకరణపత్రాలు తదితర వివరాలు తెలుసుకోవాలి.

స్క్రీనింగ్ టెస్ట్‌లో నెగ్గితేనే...

 విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు కోర్సు పూర్తిచేసిన తరవాత భారత్‌లో ఎంసీఐ లేదా ఇతర స్టేట్ మెడికల్ కౌన్సిల్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా... ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించాలన్నా లేదా ఉద్యోగం చేయాలన్నా ఎంసీఐ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్... ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పేరుతో నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష రాయాలి. అందులో ఉత్తీర్ణులైన వారికే ఈ అనుమతి ఉంటుంది.
 
జర్మనీ: ప్రాక్టికల్ నైపుణ్యంతో..
గతేడాది దాదాపు ఏడున్నర వేల మంది విదేశీ విద్యార్థులు జర్మనీలో ఎంబీబీఎస్ కోసం అడుగుపెట్టారు. ఇక్కడి మెడికల్ కళాశాలు డిసీజెస్ రీసెర్చ్ సెంటర్లతో కలిసి పనిచేస్తున్నాయి. దీంతో విద్యార్థులకు చికిత్స పద్ధతులతోపాటు ఆయా వ్యాధులకు సంబంధించిన మూలాల గురించి తెలుసుకునే ప్రాక్టికల్ నైపుణ్యం లభిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్), పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండీ) అని తేడా లేకుండా ఇంటిగ్రేటెడ్‌గా యూజీ, పీజీ కోర్సును అందించడం జర్మనీ మెడికల్ ఎడ్యుకేషన్ విధానంలోని మరో ప్రత్యేకత. ఇక్కడ కోర్సు వ్యవధి ఏడేళ్లు. జర్మనీలోని అధిక శాతం యూనివర్సిటీలు ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ట్యూషన్ ఫీజులు నామమాత్రంగా ఉండటమనేది మన విద్యార్థులకు కలిసొచ్చే అంశం.
 పేరున్న యూనివర్సిటీలు: ఆల్బర్ట్-లడ్‌విగ్‌‌స యూనివర్సిటీ; హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్; టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యునిచ్, లడ్‌విగ్ మ్యాక్స్ మిలన్ యూనివర్సిటీ-మ్యునిచ్, హంబర్గ్ యూనివర్సిటీ
వివరాలకు వెబ్‌సైట్: www.india.diplo.de
 
జార్జియా: పెరుగుతున్న ఆదరణ
విదేశీ వైద్య విద్య పరంగా ఇటీవల కాలంలో మన దేశ విద్యార్థుల ఆదరణ పొందుతున్న దేశం.. జార్జియా. ముఖ్యంగా ఉన్నత విద్య కూడా విదేశాల్లో చదవాలనే ఔత్సాహికులకు మంచి అవకాశాలు కల్పిస్తున్న దేశం జార్జియా. ఇక్కడ మెడికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు యూఎస్‌ఎంఎల్‌ఈ, పీఏఎల్‌బీ పరీక్షలకు అర్హత లభిస్తుంది. ఆరేళ్ల వ్యవధిలో ఉండే బ్యాచిలర్ కోర్సు పూర్తి చేయడానికి ఏడాదికి 4,500 నుంచి 6,000 వేల డాలర్ల ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
 పేరున్న యూనివర్సిటీలు: టిబిల్సి మెడికల్ అకాడమీ; జార్జియా అమెరికన్ యూనివర్సిటీ; న్యూ విజన్ యూనివర్సిటీ; డేవిడ్ ట్విల్డియాని మెడికల్ యూనివర్సిటీ;  కౌకాసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ; జియోమెడి మెడికల్ యూనివర్సిటీ
 వివరాలకు వెబ్‌సైట్: www.mes.gov.ge
 
మన విద్యార్థులు ఎక్కువగా చైనావైపు...
విదేశాల్లో వైద్య విద్య పరంగా ఇటీవల కాలంలో మన విద్యార్థులను ఆకర్షిస్తున్న మరో దేశం.. చైనా. మన సరిహద్దు దేశం కావడం, ఈ దేశంలోని యూనివర్సిటీల్లో ఇంగ్లిష్‌లో బోధన విధానం అమలవుతుండటంతో మన విద్యార్థులు ఎక్కువగా చైనావైపు దృష్టిసారిస్తున్నారు. ఆరేళ్ల వ్యవధిలో ఉండే బ్యాచిలర్ కోర్సు సమయంలో ఏడాది ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.
పేరున్న యూనివర్సిటీలు: చైనా మెడికల్ యూనివర్సిటీ; దలైన్ మెడికల్ యూనివర్సిటీ; జియాంగ్జు యూనివర్సిటీ; టియాన్‌జిన్ మెడికల్ యూనివర్సిటీ, జిలిన్ యూనివర్సిటీ; నాన్జింగ్ మెడికల్ యూనివర్సిటీ; సూచో యూనివర్సిటీ; కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సౌత్‌ఈస్ట్ యూనివర్సిటీ; సదరన్ మెడికల్ యూనివర్సిటీ; యాంగ్‌ర యూనివర్సిటీ.  
వివరాలకు వెబ్‌సైట్: www.mbbs.cucas.edu.cn 
 
ఉక్రెయిన్: ఆరేళ్లుకు రూ.25-30 లక్షలు!
తక్కువ ఖర్చుతో మెడికల్ కోర్సు పూర్తి చేసుకునే వీలున్న మరో దేశం.. ఉక్రెయిన్. ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులు కలుపుకుని మొత్తం కోర్సును రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలలోపు పూర్తి చేసుకోవచ్చు. ఎంబీబీఎస్‌కు తత్సమాన కోర్సును ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్)గా పేర్కొంటున్నారు.
వ్యవధి: ఆరేళ్లు.
ట్యూషన్ ఫీజు.. ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి మూడు లక్షల వరకూ ఉంటుంది.
పేరున్న యూనివర్సిటీలు: ఇవానో-ఫ్రాంకివ్‌స్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ; ఒడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ; డోనెస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ; లుగాన్సక్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఎం.గోర్కీ డొనెట్సక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ; ఖార్కోవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ;  జాపోరోఝీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ; కరజిన్ ఖార్కోవ్ నేషనల్ యూనివర్సిటీ
వివరాలకు వెబ్‌సైట్: www.kmu.gov.ua
 
రష్యా: ఆరేళ్ల కోర్సు-ఎండీ
విదేశీ వైద్య విద్యా ఔత్సాహికులు దృష్టి పెడుతున్న దేశాల్లో రష్యా ఒకటి. ఇక్కడ అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే. దాంతో ఖర్చు తక్కువగానే ఉంటోంది. రష్యాలో మెడికల్ గ్రాడ్యుయేట్ కోర్సును ఎండీగా పేర్కొంటారు. ఈ కోర్సు కాల వ్యవధి ఆరేళ్లు. ఏడాదికి రెండున్నర లక్షల నుంచి అయిదు లక్షల మధ్యలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రష్యా ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంగ్లిష్‌లో బోధన సాగుతున్నప్పటికీ... కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసే సమయంలో స్థానిక ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. అక్కడి ప్రజలు ఎక్కువగా రష్యన్‌లోనే మాట్లాడతారు. 
పేరున్న యూనివర్సిటీలు: నార్త్ వెస్ట్రన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ, రష్యన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కర్సక్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కజన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఐ.ఎం.షెనోవ్ మాస్కో మెడికల్ అకాడమీ, పీపుల్స్ ఫ్రెండ్‌షిప్ యూనివర్సిటీ ఆఫ్ రష్యా. 
 వివరాలకు వెబ్‌సైట్:  www.en.russia.edu.ru 
 
కిర్గిజ్‌స్థాన్: ఐదేళ్లు లేదా ఆరేళ్లు
మెరుగైన  విద్యా బోధనతో విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న మరో దేశం.. కిర్గిజ్‌స్థాన్. ఇక్కడ అధిక శాతం యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్‌కు సమానమైన డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్సు ఆరేళ్ల వ్యవధిలో అందుబాటులో ఉంటుంది. అయితే కొన్ని యూనివర్సిటీలు అయిదేళ్ల వ్యవధితోనూ బోధిస్తున్నాయి. మొత్తం కోర్సు పూర్తి చేయడానికి ట్యూషన్ ఫీజు పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకూ అవుతుంది. నివాస ఖర్చులతో కలిపి మొత్తం రూ.30 లక్షలతో ఉక్రెయిన్‌లో మెడికల్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోవచ్చు.
 పేరున్న యూనివర్సిటీలు: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిజ్‌స్థాన్, ఏషియన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్, ఓష్ స్టేట్ యూనివర్సిటీ,  కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ. జల్-అలాబాద్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలకు వైద్య కోర్సులు అందించడంలో పేరుంది. 
 
ఫిలిప్పీన్స్: కరిక్యులం మనలాంటిదే !
ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ కోర్సును ఎండీగా పిలుస్తారు. కానీ దీన్లో చేరడానికి ముందుగా ప్రీ మెడికల్ కోర్సు (బీఎస్) చేయాల్సి ఉంటుంది. ఇది చేరిన కాలేజీని బట్టి ఏడాది, ఏడాదిన్నర, రెండేళ్లు వరకు ఉంటుంది. ఈ కోర్సు అనంతరం అక్కడ ఎన్‌మ్యాట్ పరీక్ష రాయాలి. ఇందులో అర్హత సాధించాక ఎండీ కోర్సులో ప్రవేశాలు లభిస్తాయి. ఎన్‌మ్యాట్ పరీక్షలో అర్హత సాధించడం కష్టమేమీ కాదు.
 ఫిలిప్పీన్స్లో కోర్సు చేసినవారిలో ఎక్కువ మంది ఆ తరవాత ఇండియాలో నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నారనేది ఒక అంచనా. దాదాపు 90 శాతం మంది స్క్రీనింగ్‌లో ఉత్తీర్ణత సాధిస్తుండటానికి ప్రధాన కారణం అక్కడి ఎంబీబీఎస్ కరిక్యులం మన ఎంబీబీస్ కరిక్యులం ఒకేలా ఉండడమే. దీంతో విద్యార్థులు ఎక్కువమంది ఫిలిప్పీన్స్కు ఓటేస్తున్నారు. ఎంసీఐ స్క్రీనింగ్ టెస్టులో మొత్తం 300 మార్కులకు 200 మార్కులు క్లినికల్ సబ్జెక్టులపైనే ఉంటున్నాయి. ఫిలిప్పీన్స్ ఎంబీబీఎస్ సిలబస్‌లో ఈ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఉంది. పైగా ఫిలిప్పీన్స్లో భాషపరంగా ఇబ్బంది లేదు. ఇక్కడ అత్యధిక జనాభా ఇంగ్లిష్‌లోనే మాట్లాడతారు. బోధన కూడా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది.
ఫీజులు: యూనివర్సిటీ స్థాయిని బట్టి కనిష్టంగా రూ.13 లక్షల నుంచి గరిష్టంగా రూ.22 లక్షల వరకు బోధన రుసుంలున్నాయి. ప్యాకెట్ మనీ, హాస్టల్ వసతి, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం కోర్సు పూర్తయే సరికి రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు అవుతుంది.
 ఆగస్టులో ప్రవేశాలు: ఫిలిప్పీన్స్ యూనివర్సిటీలలో ఏటా ఆగస్టు, నవంబర్‌లలో ప్రవేశాలు జరుగుతాయి. విద్యార్థులు జూన్, జూలై నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలెడితే... అకడమిక్ కోర్సు సమయానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, అడ్మిషన్ ఆఫర్ లెటర్, వీసా మంజూరు విషయాల్లో జాప్యం లేకుండా సాగొచ్చు.  పేరున్న యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్, యూనివర్సిటీ ఆఫ్ శాంటొ తొమస్, అటెనియో స్కూల్ ఆఫ్ మెడిసిన్, సిల్లిమన్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫిలిప్పీన్స్ యూనివర్సిటీ, సెబు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్, టినియోడే మనీలా యూనివర్సిటీ, డి డేలసల్లా హెల్త్ సెన్సైస్ ఇన్‌స్టిట్యూట్, ఫార్ ఈస్టర్న్ యూనివర్సిటీ, సెయింట్ ల్యూక్స్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ, దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్.
 ప్రయోజనాలు...
 1.  అక్కడి వాతావరణం ఇక్కడిలానే ఉంటుంది.
 2.  ఫిలీప్పీన్స్లో క్రైం రేటు చాలా తక్కువ. వరల్డ్ సేఫెస్ట్ సిటీలలో ఇక్కడి నగరాలు చోటు సంపాదించుకున్నాయి
 3.  మెడికల్ కాలేజీల హాస్టల్స్‌లలో తెలుగు విద్యార్థులకు ప్రత్యేక ఆంధ్ర భోజనం అందుబాటులో ఉంటుంది
 4.  పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. 
 
అవగాహన ఉంటే మెరుగైన భవిష్యత్తు...
విద్యార్థులకు విదేశాల్లోని అకడమిక్ అంశాలతో పాటు అక్కడ మాట్లాడే స్థానిక భాష, సంస్కృతిపైనా అవగాహన ఉండాలి. మన విద్యార్థులకు ఫిలిప్పీన్స్, కిర్గిజ్‌స్థాన్, చైనా దేశాలను బెస్ట్ డెస్టినేషన్స్గా చెప్పొచ్చు. కోర్సు పూర్తయ్యాక స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఎంసీఐ-ఎఫ్‌ఎంజీఈ కోసం కృషి చేయాలి. ప్రస్తుతం ఎఫ్‌ఎంజీఈ ఉత్తీర్ణతనే భారత్‌లో హౌస్ సర్జన్, ఉన్నత విద్య అంశాలకు ప్రమాణంగా తీసుకుంటున్నారు. ఎఫ్‌ఎంజీఈలో మొత్తం ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న మాట వాస్తవమే. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మాత్రం మెరుగ్గా రాణిస్తున్నారు.
 - డాక్టర్ ఎ.సతీశ్, ఎండీ, డాక్టర్ అబ్రాడ్.
 
ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా...
ఫిలిప్పీన్స్లోని దవావో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎంసీఐ ఎంట్రెన్స్లో ఉత్తీర్ణత సాధించాను. ఇక్కడ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో మంచి ర్యాంకు తెచ్చుకున్నా. దీంతో చర్లపల్లి పీహెచ్‌సీలో డాక్టర్‌గా ఎంపికయ్యాను. ఫిలిప్పీన్స్లో మెడికల్ కాలేజీల్లో ప్రాక్టికల్ లెర్నింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. సబ్జెక్ట్‌పరంగా ఎంతో నేర్చుకోవచ్చు. 
- డాక్టర్ కౌశిక్
Published date : 17 Jul 2018 12:13PM

Photo Stories