Skip to main content

భారతీయ విద్యార్థులకు యూకేలో విద్యావకాశాలు...

యూకే.. భారత విద్యార్థులకు బెస్ట్ గమ్యం. అందుకే ఓ వైపు యూఎస్‌కు దరఖాస్తు చేసుకుంటూనే.. మరోవైపు యూకే వర్సిటీలపైనా అన్వేషణ సాగిస్తున్నారు! ఇటీవలి కాలంలో యూకే వీసా నిబంధనల్లో మార్పులు.. బ్రెగ్జిట్ పరిణామాలతో ఔత్సాహికుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయినా మంచి అకడమిక్ రికార్డ్, టెస్ట్ స్కోర్లు ఉంటే.. యూకేలో అడుగుపెట్టడం కష్ట సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. భారతీయ విద్యార్థులకు యూకేలో విద్యావకాశాల గురించి తెలుసుకుందాం..
టాప్ యూనివర్సిటీలకు నెలవు ...
ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలకు నెలవు యూకే. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2018 ప్రకారం- ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లో ఏకంగా తొమ్మిది యూకేలోనే ఉండటం విశేషం. అందుకే యూకే విదేశీ విద్యార్థులకు స్టడీ అబ్రాడ్ పరంగా బెస్ట్ గమ్యంగా మారుతోంది. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలకు యూకే పెట్టింది పేరు. ఇది కూడా విదేశీ విద్యార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.

కూ్యఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2018లో టాప్ 50లో నిలిచిన యూకే యూనివర్సిటీలు...

ర్యాంకు

యూనివర్సిటీ

5 యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్
6 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్
7 యూసీఎల్ (యూనివర్సిటీ కాలేజ్ లండన్)
8 ఇంపీరియల్ కాలేజ్ లండన్
22 కింగ్స్ కాలేజ్ లండన్
23 ద యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్‌బర్గ్
34 ద యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్
35 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఈ)
44 యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్

పాపులర్ కోర్సులు...
  • ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్
  • ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • నేచురల్ సెన్సైస్
  • మెడికల్ సెన్సైస్
యూకే యూనివర్సిటీలకు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. యూకేలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్‌తోపాటు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేచురల్ సెన్సైస్, మెడికల్ సెన్సైస్ కోర్సులు బాగా పాపులర్. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్(ఎల్‌ఎస్‌ఈ), యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్), ద యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్‌బర్గ్ బెస్ట్‌గా నిలుస్తున్నాయి.

ఏడాది వ్యవధిలోనే పీజీ...
యూకేలో తక్కువ వ్యవధిలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం ఉండటం మరింత ఆకర్షణీయ అంశం. యూకే ఉన్నత విద్యా విధానం ప్రకారం ఏడాది వ్యవధిలోనే మాస్టర్ స్థాయి కోర్సులను పూర్తి చేసుకోవచ్చు. కోర్సుల వ్యవధి ఏడాదే అయినా.. వీటికి అంతర్జాతీయ స్థాయిలో అకడమిక్, ఇండస్ట్రీ పరంగా గుర్తింపు లభిస్తోంది. వాస్తవానికి ప్రముఖ యూనివర్సిటీల్లో మాస్టర్ ప్రోగ్రామ్స్ వ్యవధి రెండేళ్లు. అయినా 70 శాతం ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాది వ్యవధిలోనే అవి పూర్తయ్యేలా ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటికి యూకే ఉన్నత విద్యా శాఖ గుర్తింపు కూడా లభిస్తోంది. యూకేలో ఏడాది వ్యవధిలోనే అంతర్జాతీయ గుర్తింపు ఉండే పీజీ పూర్తి చేసుకునే వీలుండటం.. విలువైన సమయం, వ్యయం పరంగా విదేశీ విద్యార్థులకు బాగా కలిసొచ్చే అంశం. యూకేలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను మూడేళ్ల వ్యవధిలోనే పూర్తిచేసుకునే వీలుంది.

యూఎస్‌తో పోల్చితే ఖర్చు తక్కువ...
యూఎస్‌తో పోల్చుకుంటే యూకేలో పీజీ కోర్సుల వ్యయం కొంత తక్కువనే చెప్పొచ్చు. అధిక శాతం యూనివర్సిటీల్లో ఏడాది వ్యవధిలోనే పీజీ కోర్సులు పూర్తిచేసుకునే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణం. యూకేలో ఏడాది వ్యవధిలో ఉండే కోర్సు ఫీజుల శ్రేణి పది వేల పౌండ్ల నుంచి 34 వేల పౌండ్ల మధ్యలో ఉంటుంది. ఇది విద్యార్థులు ప్రవేశం పొందిన యూనివర్సిటీపై ఆధారపడి ఉంటుంది. నివాస ఖర్చు కూడా స్వల్పంగానే ఉంటుంది. షేర్డ్ రూమ్, ఇతర వ్యక్తిగత ఖర్చులను కలుపుకుంటే నెలకు 650 పౌండ్ల నుంచి 800 పౌండ్ల వరకూ అవుతుంది. లండన్ వంటి నగరాల్లోని యూనివర్సిటీల్లో చదివితే ఈ మొత్తం వేయి పౌండ్ల నుంచి 1500 పౌండ్ల వరకు చేరుకుంటుంది. అదే అమెరికాలో రెండేళ్ల పీజీ పూర్తిచేయాలంటే.. సంవత్సరానికి 34 వేల డాలర్ల వరకూ ఫీజులు ప్లస్ ఇతర వ్యయాలు భరించాల్సి ఉంటుంది.

స్కాలర్‌షిప్స్...
యూకే యూనివర్సిటీలు వివిధ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నాయి. ప్రభుత్వం సైతం యూజీ, పీజీ విద్యార్థులకు పలు స్కాలర్స్‌షిప్స్ ఆఫర్ చేస్తోంది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం పలు ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉండటం విశేషం. కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్స్, ద షివెనింగ్ స్కాలర్‌షిప్స్, రోడ్స్ స్కాలర్‌షిప్స్, వెస్ట్‌మినిస్టర్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్స్, కార్డిఫ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్స్ కోసం విద్యార్థులు ప్రయత్నం చేయొచ్చు.

టియర్-4 కేటగిరీలో వీసా...
యూకేలోని యూనివర్సిటీల్లో జనవరి; సెప్టెంబర్/అక్టోబర్‌ల్లో రెండు సెషన్లలో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. ఔత్సాహిక విద్యార్థులు ఏడాది ముందుగా దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమిస్తే.. యూనివర్సిటీల నుంచి సీఏఎస్ (కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సప్టెన్స్ స్టడీస్) పొందడం.. ఆ తర్వాత వీసాకు దరఖాస్తు చేసుకోవడం వంటి వాటికి సమయం సరిపోతుంది. యూకే వర్సిటీల్లో అడ్మిషన్ ఖరారు చేసుకున్న విద్యార్థులు టియర్-4 (స్టూడెంట్ వీసా) కేటగిరీ ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. టియర్-4 కేటగిరీలో వీసా పొందాలనుకుంటే 16 ఏళ్లు నిండి ఉండాలి. ఇందుకోసం ముందుగా సీఏఎస్‌ను పొందాలి. సీఏఎస్‌ను విద్యార్థులకు ప్రవేశం కల్పించిన యూనివర్సిటీలు అందజేస్తాయి. సీఏఎస్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన డాక్యుమెంట్లు..
  • పాస్ట్‌పోర్ట్
  • వీసా ఫీజు బయో మెట్రిక్ డిటెయిల్స్
  • సీఏఎస్ లెటర్
  • ఫీజు రశీదు
  • వ్యక్తిగత బ్యాంక్ స్టేట్‌మెంట్
  • అకడమిక్ సర్టిఫికెట్లు
పాయింట్ల విధానంలో వీసా...
వీసా మంజూరు ప్రక్రియలో యూకే ఇమిగ్రేషన్ విభాగం పాయింట్ల విధానాన్ని అనుసరిస్తోంది. టియర్-4 స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్టంగా 40 పాయింట్లు కేటాయించారు.
  • 40 పాయింట్లలో 30 పాయింట్లను సీఏఎస్‌కు కేటాయిస్తారు.
  • మిగతా పది పాయింట్లను విద్యార్థులు యూకేలో చదువుకునే సమయంలో అయ్యే ఖర్చులకు సంబంధించిన అంశాలకు కేటాయిస్తారు.
  • ఈ పాయింట్ల ఆధారంగా విద్యార్థులకు వీసా మంజూరు చేస్తారు. దరఖాస్తు తేదీ నుంచి రెండు వారాల వ్యవధిలోపు వీసా మంజూరు చేస్తారు. కాబట్టి విద్యార్థులు అకడమిక్ సెషన్ ప్రారంభానికి మూడు నెలల ముందుగానే వీసాకు దరఖాస్తు చేసుకునేలా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం మేలు.
భిన్న సంస్కృతులు.. ఆహ్లాదకర వాతావరణం:
యూకేలో అడుగు పెట్టిన తర్వాత విద్యార్థులకు భిన్న సంస్కృతుల విద్యార్థులు తారసపడతారు. సాధ్యమైనంత త్వరగా అందరితో కలుపుగోలుగా వ్యవహరించాలి. యూకే యూనివర్సిటీలు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ.. అన్ని దేశాల విద్యార్థులు మమేకం అయ్యేలా చర్యలు చేపడుతున్నాయి. యూకేలో మన దేశ విద్యార్థుల పరంగా ప్రధానంగా కలిసొచ్చే అంశం.. ఆహ్లాదకర వాతావరణంతోపాటు భారతీయ ఆహారం అందుబాటులో ఉండటం. అక్కడ పలు ఇండియన్ రెస్టారెంట్లు దర్శనమిస్తాయి. ప్రతి నగరంలోనూ ప్రత్యేకంగా ఇండియన్స్ ఆధ్వర్యంలో స్థానికంగా కల్చరల్ క్లబ్స్ కనిపిస్తాయి. దీంతో మన విద్యార్థులు దాదాపుగా స్వదేశంలో ఉన్న భావనను ఆస్వాదించే అవకాశముంది. ఇక్కడ ఉష్ణోగ్రత సైతం సగటున 11 డిగ్రీలకు మించకపోవడం కలిసొచ్చే అంశం.

పోస్ట్ స్టడీ వర్క్...
విదేశాల్లో ఉన్నత విద్య అనగానే విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాల గురించి ఆలోచించడం సహజం. కానీ.. యూకేలో ఇటీవల తెచ్చిన కొన్ని నిబంధనల కారణంగా పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు కొంత సన్నగిల్లాయని చెప్పొచ్చు. విద్యార్థులు తాము కోర్సు పూర్తి చేసుకునే సమయానికే నెలకు 20,800 పౌండ్ల జీతంతో కొలువు సాధిస్తే.. సదరు ఎంప్లాయర్ ఇచ్చే లెటర్ ఆధారంగా.. రెండేళ్ల కాల పరిమితితో ఉండే పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు ఎంప్లాయర్‌కు ప్రభుత్వ కార్మిక శాఖ గుర్తింపు ఉంటే వర్క్ పర్మిట్ లభిస్తుంది.

ఆరు నెలలు అదనంగా...
యూకే ఇటీవల అమల్లోకి తెచ్చిన పైలట్ వీసా స్కీమ్ ప్రకారం- కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, బాత్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లలో 13 నెలల వ్యవధిలో ఉన్న కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఆ తర్వాత ఆరు నెలలపాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే టియర్-2 (వర్క్ వీసా) కేటగిరీకి దరఖాస్తు చేసుకుని వర్క్ పర్మిట్ పొందొచ్చు.

యూకేకు వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య...
2011-12 33,000
2012-13 22, 385
2013-14 19, 750
2014-15 11, 270
2015-16 10, 125
Published date : 16 Sep 2017 03:22PM

Photo Stories