Skip to main content

Kyrgyzstan Violence: కిర్గిస్తాన్‌లో భయంభయంగా తెలుగు విద్యార్థులు .. హౌస్‌ అరెస్టులోనే చాలామంది

Safety concerns for South Asian students in Kyrgyzstan   Telugu studentsKyrgyzstan Violence What Led To Attack On Kyrgyzstan   International students face attacks in Kyrgyzstan

సాక్షి, హైదరాబాద్‌: ఐదు రోజులుగా తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్‌లో భయం నీడన కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడి ఓ యూనివర్సిటీలో విద్యార్థిని వేధించిన విషయంలో తలెత్తిన వివాదం అక్కడి స్థానికులు, విదేశీయుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్‌ నుంచి వచ్చిన స్టూడెంట్స్‌ లక్ష్యంగా జరుగుతున్న దాడులతో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 

హౌస్‌అరెస్టులో తెలుగు విద్యార్థులకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదు. అక్కడి భారత రాయబార కార్యాలయం పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు స్పందించి, తక్షణం తమను అక్కడ నుంచి రెస్క్యూ చేయాలంటూ కొందరు తెలుగు విద్యార్థులు ‘సాక్షి’తో ఫోన్‌ ద్వారా వాపోయారు. పేర్లు గోప్యంగా ఉంచాలంటూ అక్కడి ఎంబీబీఎస్‌ విద్యార్థులు అనేక విషయాలు చెప్పారు. వివరాలు వారి మాటల్లోనే....   

అనుమానంగా చూస్తున్నారు... 
ఓ యువతి విషయంలో కిర్గిస్, ఈజిప్ట్‌ విద్యార్థుల మధ్య మే 13న గొడవ జరిగింది. 18, 19 తేదీల్లో తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇందులో పాకిస్తాన్, భారత్, బంగ్లా, ఈజిప్ట్‌ దేశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్‌ విద్యార్థులు చాలామంది వెళ్లిపోయారు. అక్కడి స్థానికులు తెలుగు విద్యార్థులను అనుమానంగా చూస్తున్నారు. దీంతో ఎప్పుడైనా మాపై దాడి జరగొచ్చని భయాందోళనల మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్‌ నంబరు విద్యార్థులకు ఇచ్చింది. కాల్‌ చేస్తే పూర్తిస్థాయిలో స్పందన ఉండట్లేదు. 

కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సహకారం అందిస్తోంది. తెలుగు విద్యార్థులను ఐదు రోజులుగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కళాశాల యాజమాన్యం నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇలా దాదాపు 700 మంది తెలుగు విద్యార్థులు అక్కడ బతుకెళ్లదీస్తున్నారు. భారత ఎంబసీతో మాట్లాడితే పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అంటున్నారు. 

బయటకు వెళితే మాత్రం ఎవరు...ఎక్కడ దాడి చేస్తారో అన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. తమ ఉనికి బయటపడకుండా ఉండటానికి విద్యార్థులు తమ హాస్టల్‌లో లైట్లు ఆఫ్‌ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందినవారు మాత్రం వారి దేశానికి వెళ్లిపోయారు. తెలుగు విద్యార్థులు విమాన టికెట్లు బుక్‌ చేసుకుందామని ప్రయత్నిస్తే లభించట్లేదు.  

కిర్గిస్తాన్‌లో చోటు చేసుకున్న ఘటనలపై భారతీయ విద్యార్థుల భద్రతపై చొరవ తీసుకోవాలని జీవీకే ఎడ్యుటెక్‌ డైరెక్టర్‌ విద్యాకుమార్‌ బుధవారం  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మవద్దని ఈ సందర్భంగా  కేంద్రమంత్రి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే భారత రాయబార కార్యాలయ హెల్ఫ్‌లైన్‌ నంబర్‌ 0555710041కు ఫోన్‌ చేసిసంప్రదించాలన్నారు.   

ప్రభుత్వం ప్రత్యేక విమానం వేయాలి 
ఇక్కడ బయట తిరగొద్దు అంటున్నారు. లాక్‌డౌన్‌ నాటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. మా కళాశాలలో భారతీయ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కళాశాల యాజమాన్యం మాకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నాయి. ఇంటికి వెళ్లిపోతామంటున్న వారిని వెళ్లిపోండి అంటున్నారు. విద్యాసంవత్సరం చివరికు వచ్చింది. 

జూలైలో ఇంటికి రావడానికి టికెట్లు బుక్‌ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి రావాలన్నా టికెట్లు దొరకడం లేదు. ఉన్నవాట్లో నాలుగు రెట్లు చార్జీలు పెంచారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక విమానం వేయడం లేదా, విమానాల సంఖ్య పెంచి,  చార్జీలు తగ్గించాలి.    
  – రాధ, ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఇయర్‌  

అడుగు బయట పెట్టాలంటే భయం.. 
కళాశాలలకు సెలవులు ఇచ్చారు. రూంలోనే ఉంటున్నాం. అర్ధరాత్రి వచ్చి డోర్‌ కొట్టేవారు. భయంభయంగా ఉండేది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మా కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్‌ చేస్తున్నారు. ఇండియన్‌ ఎంబసీతో అంతా తప్పుడు సమాచారం ఇస్తోంది. అంతా బాగుంది అంటున్నారు. బయటకు వెళితే ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని భయమేస్తోంది. 

మాకు పరీక్షలు దగ్గర పడ్డాయి. మాదగ్గర  తెలుగు రా్రష్తాల నుంచి 800 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నెల రోజుల్లో డిగ్రీ పట్టా వస్తుందనుకుంటే ఇప్పుడు మానసిక ఆందోళన మొదలైంది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావడంతో ఎవ్వరినీ రానీయడం లేదు.
 – ఉషారాణి, ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని 

Published date : 23 May 2024 01:30PM

Photo Stories