Foreign Education: స్వదేశం నుంచే విదేశీ విద్య
కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యావిధానంలో చేసిన నిర్ణయాల ఫలితంగా ఆయా విదేశీ వర్సిటీల అనుబంధ విద్యావిభాగాలు మన దేశంలోనే కొలువుదీరనున్నాయి. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు సాధించేలా.. అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేందుకు వీలుగా నూతన జాతీయ విద్యావిధానంలో కొత్త నిబంధనలు పొందుపరిచిన సంగతి తెలిసిందే. విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ.. డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాములతో పాటు విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడికి అనుగుణంగా ‘ట్విన్నింగ్’ కార్యక్రమాల కోసం పలు కొత్త నిబంధనలను కేంద్రం రూపొందించింది. వీటిని యూజీసీ 2020 ఏప్రిల్‌లోనే నోటిఫై చేసి విదేశీ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానం పలికింది. ట్విన్నింగ్, డ్యూయెల్ డిగ్రీ కోర్సుల అమలుకు, పరస్పర సహకారానికి ముందుకు రావాలని కోరింది. ఈ నిబంధనల ప్రకారం.. దేశంలోని విద్యార్థులు దేశీయ వర్సిటీలు, విదేశీ వర్సిటీలు అందించే డ్యూయెల్ డిగ్రీలను ఒకేసారి అందుకోగలుగుతారు. దీనికి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి సానుకూల స్పందన లభించినట్లు యూజీసీ వెల్లడించింది. ఇప్పటికే స్కాట్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోవ్ విద్యా సంబంధిత అనుసంధానంపై సుముఖత వ్యక్తపరచగా, ఆస్ట్రేలియాలోని డాకిన్ యూనివర్సిటీ కూడా ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు తోడ్పాటునందిస్తుందని తెలిపింది. ఇవే కాకుండా.. అనేక ఇతర విదేశీ వర్సిటీలు తమ శాటిలైట్ క్యాంపస్ (అనుబంధ విభాగాలు)లను భారత్‌లో ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌లాండ్ తమ శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుపై సానుకూలత వ్యక్తపరచడంతో పాటు వచ్చే నెలలో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. అంతేకాక.. జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ, ఫ్రాన్స్‌లోని మరో యూనివర్సిటీ కూడా దేశంలో శాటిలైట్ వర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. జపాన్‌లోని వివిధ వర్సిటీలు కూడా తమ ఆసక్తిని వ్యక్తపరిచినట్లు యూజీసీ వర్గాలు తెలిపాయి. ఉన్నత విద్య అంతర్జాతీయకరణకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానంలో చేసిన కొత్త నిర్ణయాలతో విద్యా సంబంధిత వ్యవహారాలు మరింత బలోపేతమవుతాయంటూ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి అభిప్రాయపడుతూ పరస్పర మార్పిడి ప్రక్రియకు సానుకూలతను తెలిపింది. వేల్స్‌లోని బంగోర్ వర్సిటీ, సోస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ కూడా ఉన్నత విద్యా వ్యవహారాల్లో పరస్పర మార్పిడి ప్రక్రియకు ముందుకొస్తున్నాయి. ఇక జర్మనీలోని యూనివర్సిటీ జెనా, దక్షిణాఫ్రికాలోని డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలు సహ దాదాపు 48 విదేశీ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యలో పరస్పర సహకారానికి ప్రతిపాదించాయి.
చదవండి: Study Abroad Career Opportunities: విదేశీ విద్యకు స్కాలర్‌షిప్ చేయూత
ఎంఐటి, స్టాన్‌ఫోర్డ్‌లు కూడా సంసిద్ధత
ఇక అమెరికాలోని Massachusetts Institute of Technology (MIT), Stanford Universityలు కూడా తమ విభాగాల ఏర్పాటుకు ముందుకొస్తుండడంతో దేశంలోని విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాముల ద్వారా ఆయా వర్సిటీల కోర్సులను కూడా మన విద్యార్థులు స్వదేశంలో చదువుతూనే వాటినీ అభ్యసించడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఇవే కోర్సులను విదేశాల్లోని ఆయా వర్సిటీలలో చదవాలంటే లక్షల్లో డబ్బు వెచ్చించడంతోపాటు అనేక వ్యయప్రయాసలకోర్చవలసి ఉంటుందని వివరిస్తున్నారు. కానీ, ఇక్కడే ఆయా డిగ్రీ కోర్సుల అధ్యయనంతో పైచదువుల కోసం విదేశీ వర్సిటీల్లో మన విద్యార్థులు సులభంగా ప్రవేశాలు పొందే అవకాశముంటుందంటున్నారు.
చదవండి: Study Abroad Career Opportunities: విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు ఇవే!!