Skip to main content

Student Visas: స్టూడెంట్‌ వీసాలపై రెండేళ్ళ పాటు పరిమితులు.. కార‌ణం ఇదే..

కెనడాతో మరో తంటా వచ్చి పడింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్‌ పర్మిట్లపై రెండేళ్ళ పాటు పరిమితులు విధిస్తున్నట్టు ఆ దేశం జ‌నవ‌రి 22న‌ ప్రకటించింది.
Foreign students facing uncertainty   Canada's announcement on January 22  impact on international education in Canada  Canadas two year cap on international student visas likely to impact Indians

 వీసాల సంఖ్య తగ్గిందంటే, కాలేజీ డిగ్రీ కోసం అక్కడకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గనుందన్న మాట. ఈ వీసాల కోత అన్ని దేశాలకూ వర్తించేదే అయినా, మనవాళ్ళ విదేశీ విద్యకు కెనడా ఓ ప్రధాన కేంద్రం కావడంతో భారతీయ విద్యార్థి లోకం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.

కెనడా గడ్డపై ఓ ఖలిస్తానీ తీవ్రవాది హత్య వెనుక భారత్‌ హస్తం ఉందంటూ ఆ దేశం చేసిన ఆరోపణలతో ఇప్పటికే  భారత – కెనడా దౌత్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. ఆ కథ కొలిక్కి రాకముందే, విదేశీ స్టూడెంట్‌ వీసాలకు కెనడా చెక్‌ పెట్టడం ఇంకో కుదుపు రేపింది. 

చదవండి: US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!

ఇటీవల కెనడాకు వెళ్ళి చదువుకొంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అతి పెద్ద వర్గాలలో ఒకటి భారతీయ విద్యార్థి వర్గం. 2022లో 2.25 లక్షల పైచిలుకు మంది మన పిల్లలు అక్కడకు చదువులకు వెళ్ళారు. వివరంగా చెప్పాలంటే, ఆ ఏడాది కెనడా ఇచ్చిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41 శాతానికి పైగా భారతీయ విద్యార్థులకే దక్కాయి.

ఇక, 2023 సెప్టెంబర్‌ నాటి కెనడా సర్కార్‌ గణాంకాల ప్రకారం అక్కడ చదువుకు అనుమతి పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది భారతీయులే. 12 శాతంతో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తీరా ఇప్పుడీ కొత్త నిబంధనలు అలా కెనడాకు వెళ్ళి చదవాలనుకుంటున్న వారికి అశనిపాతమే. వారంతా ఇతర దేశాల వంక చూడాల్సిన పరిస్థితి. 

2023లో కెనడా 10 లక్షలకు పైగా స్టడీ పర్మిట్లిచ్చింది.

దశాబ్ది క్రితంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. తాజా ప్రతిపాదనతో ఈ ఏడాది ఆ పర్మిట్ల సంఖ్య 3.64 లక్షలకు తగ్గనుంది. అంటే, 35 శాతం కోత పడుతుంది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి ప్రధానంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకే వర్తిస్తుంది. గ్రాడ్యుయేట్, మాస్టర్స్‌ డిగ్రీలు, పీహెచ్‌డీలకు ఇది వర్తించకపోవడం ఊరట. అయితే, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వర్క్‌ పర్మిట్లకు షరతులు వర్తిస్తాయి. గతంలో కెనడాలో పీహెచ్‌డీ, మాస్టర్స్‌ కోర్సులు చేస్తుంటే మూడేళ్ళ వర్క్‌ పర్మిట్‌ దక్కేది. ఆ దేశంలో శాశ్వత నివాసం సంపాదించడానికి ఈ పర్మిట్లు దగ్గరి దోవ. ప్రధానంగా పంజాబీలు కెనడాలో చదువుతూనే, లేదంటే తాత్కాలిక ఉద్యోగాల్లో చేరుతూనే జీవిత భాగస్వామిని వీసాపై రప్పిస్తుంటారు. ఇక ఆ వీలుండదు. 

చదవండి: Student Visa Latest Rules: స్టూడెంట్‌ వీసాలపై పలు దేశాల ఆంక్షలు.. కొత్త నిబంధనలు ఇవే..

స్టడీ పర్మిట్లలో కోతతో విదేశీ విద్యార్థులకే కాదు... కెనడాకూ దెబ్బ తగలనుంది. పెద్దయెత్తున విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి కెనడాలోని పలు విద్యాసంస్థలు తమ ప్రాంగణాలను విస్తరించాయి. తాజా పరిమితితో వాటికి ఎదురుదెబ్బ తగలనుంది. అంతర్జాతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏటా 1640 కోట్ల డాలర్ల మేర ఆదాయం వస్తోంది. కోతలతో ఇప్పుడు దానికి గండి పడనుంది. అలాగే, జీవన వ్యయం భరించగలమంటూ ప్రతి విదేశీ విద్యార్థీ 20 వేల కెనడా డాలర్ల విలువైన ‘గ్యారెంటీడ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సర్టిఫికెట్‌’ (జీఐసీ) తీసుకోవడం తప్పనిసరి.

అలా కొత్త విద్యార్థుల వల్ల కెనడా బ్యాంకులు సైతం ఇంతకాలం లాభపడ్డాయి. తాజా నిబంధనలతో వాటికీ నష్టమే. అలాగే, దాదాపు లక్ష ఖాళీలతో కెనడాలో శ్రామికశక్తి కొరత ఉంది. విదేశీ విద్యార్థులు ఆ లోటును కొంత భర్తీ చేస్తూ వచ్చారు. గడచిన 2023లో ఒక్క ఆహారసేవల రంగంలో 11 లక్షల మంది కార్మికు లుంటే, వారిలో 4.6 శాతం మంది ఈ అంతర్జాతీయ విద్యార్థులే. ఆ లెక్కలన్నీ ఇక మారిపోతాయి. శ్రామికశక్తి కొరత పెరుగుతుంది. అయినా, కెనడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు?

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీసుకున్న ఈ కోత నిర్ణయం వెనుక అనివార్యతలు అనేకం. చదువు పూర్తి చేసుకొని, అక్కడే వర్క్‌ పర్మిట్లతో జీవనోపాధి సంపాదించడం సులభం గనక విదేశీ విద్యకు కెనడా పాపులర్‌ గమ్యస్థానం. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి, అద్దెకు అపార్ట్‌ మెంట్లు దొరకని పరిస్థితి. నిరుడు కెనడా వ్యాప్తంగా అద్దెలు 7.7 శాతం పెరిగాయి. గృహవసతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. దాంతో ట్రూడో సర్కారుపై ఒత్తిడి పెరిగింది. విదేశీయుల వలసల్ని అతిగా అనుమతించడమే ఈ సంక్షోభానికి కారణమని కెనడా జాతీయుల భావన.

చదవండి: Study Abroad: కెనడా ప్రభుత్వం ప్రకటనతో విద్యార్థులు షాక్‌.. ఇదే జరిగింది..!

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీకి ఇది లాభించింది. పైగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓటమి పాలవుతారని ప్రజాభిప్రాయ సేకరణల మాట. ఈ పరిస్థితుల్లో స్వదేశీయుల్ని సమాధానపరిచి, వలస జీవుల అడ్డుకట్టకై ట్రూడో సర్కార్‌ ఈ వీసాల కోతను ఆశ్రయించింది. విద్యార్థుల సంఖ్యను వాటంగా చేసుకొని, కొన్ని సంస్థలు కోర్సుల నాణ్యతలో రాజీ పడుతున్న వైనానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్య చేపట్టామని కెనడా మాట.

తాజా పరిణామం భారత్‌కు కనువిప్పు. కెనడాలో పలు ప్రైవేట్‌ సంస్థలు ట్యూషన్‌ ఫీజులేమో భారీగా వసూలు చేస్తూ, నాణ్యత లేని చదువులు అందిస్తున్నాయి. అయినా భారతీయ విద్యార్థులు కెనడాకో, మరో విదేశానికో వెళ్ళి, ఎంత ఖర్చయినా పెట్టి కోర్సులు చేసి, అక్కడే స్థిరపడాలనుకుంటున్నారంటే తప్పు ఎక్కడున్నట్టు? మన దేశంలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నట్టు? ఇది పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.

2025 నాటికి భారతీయ కుటుంబాలు పిల్లల విదేశీ చదువులకై ఏటా 7 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తాయని అంచనా. చిన్న పట్నాలు, బస్తీల నుంచీ విదేశీ విద్య, నివాసంపై మోజు పెరుగుతుండడం గమనార్హం. నాణ్యమైన ఉన్నత విద్య, ఉపాధి కల్పనలో మన ప్రభుత్వాల వైఫల్యాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ వాస్తవాలు గ్రహించి, ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేదంటే, అమెరికాలో ఉద్యోగాలకు, కెనడాలో వీసాలకు కోత పడినప్పుడల్లా దిక్కుతోచని మనవాళ్ళు మరో దేశం దిక్కు చూడాల్సిన ఖర్మ తప్పదు! 

Published date : 27 Jan 2024 09:28AM

Photo Stories