Skip to main content

Jobs: మళ్లీ స్టాఫ్‌నర్స్‌ నియామకాలు

కడప రూరల్‌ : కడపలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్‌–4 పరిధిలో జనవరిలో 291 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియామక ప్రక్రియ జరిగింది. ఈ పోస్టులకు మొత్తం 11,245 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు నిబంధనల ప్రకారం మెరిట్‌ ఆధారంగా స్టాఫ్‌నర్స్‌ల నియామకం చేపట్టారు.
Jobs
మళ్లీ స్టాఫ్‌నర్స్‌ నియామకాలు

నియామకాల్లో వెలుగు చూసిన అక్రమాలు

ఈ నియామకాల్లో చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఒక అభ్యర్థి ఉద్యోగానికి ఎంపిక కాలేదు. అయినప్పటికీ ఏకంగా బోగస్‌ నియామక పత్రాన్నే సృష్టించుకొని పోస్టింగ్‌ కోసం చిత్తూరు జిల్లాకు వెళ్లింది. అక్కడి అధికారులు ఆమెకు ఇక్కడ పోస్టింగ్‌ ఇవ్వడానికి ఖాళీలు లేవని తెలపడంతో అది బోగస్‌ నియామక పత్రం అని తేలింది. తరువాత ఏకంగా 16 మంది అభ్యర్థులు బోగస్‌ మార్కుల జాబితాను పొందుపరిచారు.

చదవండి: జర్మనీలో నర్సులుగా ఉద్యోగావకాశాలు

దీంతో ఎక్కువ మార్కుల కారణంగా మెరిట్‌ను సాధించి 15 మంది ఉద్యోగాలు పొందారు. ఈ అంశాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో బోగస్‌ సర్టిఫికెట్స్‌ పొందిన వారు ఉద్యోగాలను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. తరువాత చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రిటైర్డ్‌ ఎస్‌ఐ బోగస్‌ అభ్యర్థులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ 16 మందివి బోగస్‌ సర్టిఫికెట్స్‌ అని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు ధ్రువీకరించారు.

అనంతరం రెండవ సారి 85 మందికి స్టాఫ్‌ నర్స్‌ నియామకాలను చేపడితే అందులో కూడా ఇద్దరు బోగస్‌ సర్టిఫికెట్స్‌ సమర్పించిన వారు బయట పడ్డారు. అలాగే ఈ కౌన్సెలింగ్‌కు 25 మంది హజరు కాకపోవడం కూడా విచిత్రమే. బోగస్‌ సర్టిఫికెట్స్‌ సమర్పించిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరిని మినహయిస్తే మిగతా వారంతా చిత్తూరు జిల్లాకు చెందన వారే కావడం గమనార్హం.

చదవండి: 1,827 Jobs: భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

ఉన్నతాధికారుల ఆదేశాలతో..

చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఈ బోగస్‌ కుంభకోణాలపై పూర్తి ఆధారాలతో ఉన్నతాధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగారు. దీనిపై ‘చీఫ్‌ మినిస్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌’ (సీఎంఓ) కార్యాలయం స్పందించింది. ఈ అంశాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఆదేశాలు చేరాయి. తరువాత విచారణ నిమిత్తం స్థానిక పోలీసులు ఆ శాఖ కార్యాలయానికి వెళ్లారు. బోగస్‌ సర్టిఫికెట్స్‌ సమర్పించిన వారి సమాచారం తీసుకెళ్లారు.

తాజాగా పెద్ద సంఖ్యలో నియామకాలు

ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో మరోమారు పెద్ద సంఖ్యలో స్టాఫ్‌నర్స్‌ నియామకాలు జరగనున్నాయి. రాయలసీమ జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్తగా ఏర్పాటైన నంద్యాల మెడికల్‌ కాలేజీ, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీల స్థానాల్లో స్టాఫ్‌నర్స్‌ నియామకాలను చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నంద్యాల మెడికల్‌ కాలేజీ నుంచి మొత్తం 248 ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక వైద్య విధాన పరిషత్‌ నుంచి ఖాళీల వివరాలు అందాల్సి వుంది. ఇక్కడి నుంచి వివరాలు రాగానే ఒక వారంలోపు నియామక ప్రక్రియ జరగనుంది. మొత్తం దాదాపు 300 మంది స్టాఫ్‌నర్స్‌ల నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఉన్న దరఖాస్తుల ఆధారంగానే..

ఈ కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్స్‌ నియామకాలకు సంబంధించి జనవరికి ముందే దాదాపు 11,245 దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల ప్రామాణికంగానే జనవరిలో 291, రెండవ దఫాలో 85 మందికి నియామకాలను చేపట్టారు. తాజాగా ఆ దరఖాస్తుల ఆధారంగానే త్వరలో చేపట్టే 300 నియామకాల ప్రక్రియ జరుగనుంది. ఈ దరఖాస్తుల్లో కూడా పెద్ద సంఖ్యలో ఎక్కువ మార్కులు కలిగిన బోగస్‌ సర్టిఫికెట్స్‌ ఉన్నట్లుగా పలు ఫిర్యాదులు వచ్చాయి.

తాజాగా కొత్త నియామకాలు చేపట్టనుండడంతో మళ్లీ బోగస్‌ సర్టిఫికెట్స్‌ల అంశం తెరపైకి వచ్చింది. ఈ బోగస్‌ సర్టిఫికెట్స్‌ల వ్యవహారం ఆ శాఖ రీజనల్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ కోటేశ్వరి పని చేసిన సమయంలో వెలుగు చూసింది. ఇప్పుడు ఆమె అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతిపై అమరావతికి వెళ్లారు. ఇప్పుడు ఆ స్థానంలో రీజనల్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ అనిల్‌కుమార్‌ విధులను చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తీసుకొనే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బోగస్‌ సర్టిఫికెట్స్‌పై విచారణకు ఆదేశిస్తా

నేను ఇక్కడ బాధ్యతలను చేపట్టక ముందే బోగస్‌ సర్టిఫికెట్స్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి విచారణకు వచ్చిన పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చాం. ఆ వివరాలు తెలియాల్సివుంది. ప్రభుత్వ ఆదేశాలతో నిబంధనల ప్రకారం త్వరలో కొత్తగా స్టాఫ్‌నర్స్‌ల నియామకాలు చేపడుతున్నాం. ఈ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తమ వద్ద అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు ఉన్నాయి. వాటిల్లో బోగస్‌ సర్టిఫికెట్స్‌ను పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు ఇస్తాం. ఏవైనా బోగస్‌ సర్టిఫికెట్స్‌ వెలుగు చూస్తే ఆ అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు చేపడుతాం. నిబంధనల ప్రకారం నియామకాలను చేపడుతాం. అర్హులకు న్యాయం చేస్తాం.
– డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌, రీజనల్‌ డైరెక్టర్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం

Published date : 03 Jul 2023 05:26PM

Photo Stories