Skip to main content

AP CM YS Jagan Mohan Reddy : చ‌రిత్ర‌లో ఎన్న‌డులేని విధంగా.. ఏపీ విద్యారంగంలో చేసిన విప్లవాత్మక మార్పులు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చ‌రిత్ర‌లో గతంలో ఎన్న‌డులేని విధంగా.. విద్యారంగంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. పిల్లలకు ఇచ్చే మంచి ఆహారం నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా నడుస్తుంది.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌భుత్వం. డిసెంబ‌ర్ 21వ తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా.. విద్యారంగంలో సీఎం జ‌గ‌న్‌ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల‌పై సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక క‌థ‌నం మీకోసం..
YS Jagan's Education Reforms  AP CM YS Jagan Mohan Reddy  Transforming Education in Andhra Pradesh

'జగనన్న విద్యా దీవెన‌' : 

jagananna vidya deevena news telugu

పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా.. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో నేరుగా 'జగనన్న విద్యా దీవెన' ప‌థ‌కం ద్వారా జమ చేస్తున్నది జగనన్న ప్రభుత్వం.

'జగనన్న వసతి దీవెన' ప‌థ‌కం :

jagananna vasathi deevena news telugu

ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా.. ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున 'జగనన్న వసతి దీవెన' ప‌థ‌కం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుంది జగనన్న ప్ర‌భుత్వం. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్నది.

జగనన్న 'అమ్మ ఒడి' పథకం :

jagananna ammavodi

పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని జనవరి 9, 2020న ప్రారంభించారు. 1వ తర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివే పిల్ల‌ల‌కు జగనన్న అమ్మ ఒడి పథకం  వ‌ర్తిస్తుంది. ఈ పథకం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను ఎక్కడ చదివించినా, ప్రతి ఏడాది జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయడం జరుగుతుంది. పిల్లలు ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ స్కూల్స్‌ లేదా రెసిడెన్షియల్‌ లేదా జూనియర్‌ కాలేజీలలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతిలోపు చదివే విద్యార్థులై ఉండాలి. 

జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న అర్హులైన, విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రతి ఏటా రూ. 15 వేలు జమ చేస్తుంది. అయితే 2021 నుంచి తల్లులకు అమ్మఒడి కింద ఇచ్చే రూ.15,000లలో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ నిధికోసం కోసం రూ.1000 మినహాయించి తక్కిన రూ.14,000ల మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేయడం ప్రారంభించింది.

పాఠశాలల్లో పారిశుద్ధ్య వసతులకు, విద్యార్ధుల్లో ముఖ్యంగా బాలికల్లో డ్రాప్‌అవుట్‌ల సంఖ్యకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించిన ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచి డ్రాప్‌ అవుట్లను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి లబ్ధిదారులకు అందించే రూ.15,000 నుంచి, రూ.1000 జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని టాయిలెట్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌లో జమ చేస్తుంది. ఈ సొమ్ము ఆ పాఠశాలల్లోని టాయిలెట్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌కు బదిలీ చేసి, పాఠశాల అభివృద్ధి కమిటీ ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు మాత్రమే ఖర్చు చేస్తారు. 

ఇంత డబ్బు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఈ వెయ్యి రూపాయలు ఎక్కువ కాకపోయినా పిల్లల చదువుకునే బడి, పరిశుభ్రతను వారి డబ్బుతోనే నిర్వహిస్తే జవాబుదారీతనం, పరిస్థితులు మెరుగు పడతాయనే ఉద్దేశంతో మినహాయిస్తుంది. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే విద్యార్థులు 1902 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు లేదా గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చే సేలా వెసులుబాటు కల్పించారు.

బడికి రాకపోతే వెంటనే మెసేజ్‌.. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మఒడి పథకానికి టెక్నాలజీని అనుసంధానం చేసింది. దీని ద్వారా పిల్లలు బడికి రాకపోతే మొదటి రోజు తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. వరుసగా రెండు రోజులు రాకుంటే మూడో రోజు వలంటీర్‌ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగ క్షేమాలను విచారిస్తారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు, పేరెంట్స్‌ కమిటీతో పాటు టీచర్ల మీద ఉంచింది.

నగదుకు బదులు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..

jagananna ammavodi news telugu

కోవిడ్‌ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్ధేశ్యంతో 2022 విద్యాసంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కోరుకుంటే అమ్మఒడి ద్వారా ఇస్తున్న నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ తీసుకునే విధంగా ఈ పథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చారు. వసతి దీవెన కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌లు పొందే ఆప్షన్‌ కల్పించింది.

హెచ్‌పీ, డెల్, లెనోవా, ఏసర్, ఎంఐ, ఫాక్స్‌కాన్‌ లాంటి బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్స్‌ ఇంటెల్‌ ఏఎండీ లేదా సమానమైన ప్రాసెసర్, 4 గిగాబైట్‌ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచుల తెర (స్క్రీన్‌), విండోస్‌ 10 (ఎస్‌టీఎఫ్‌), మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌)ల కాన్ఫిగరేషన్‌తో, 3 సంవత్సరాల వారంటీతో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లకు మెయిన్‌టెనెన్స్‌ సమస్యలు ఎదురైతే 7 రోజులలోనే రీప్లేస్‌మెంట్‌ లేదా రిపేర్‌ బాధ్యత గ్రామ సచివాలయం ద్వారా సంబంధిత కంపెనీ పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తారు. ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. మార్కెట్లో దాదాపు రూ.25 వేలు నుంచి రూ.27 వేలు ఉన్న బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.18,500కే అది ఉచితంగా విద్యార్థుల‌కు అందించారు.
 
‘జగనన్న విద్యాకానుక’ పథకం :

jagananna vidya kanuka

పిల్లలను బడికి పంపితే చాలు మిగిలిన అన్ని విషయాలను ప్రభుత్వమే చూసుకుంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా అవసరమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు సర్కారు బడిలో చదివే పిల్లలకు విద్యాకానుక రూపంలో 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యాకానుక’ ప్రత్యేక కిట్లు అందజేస్తున్నారు. వాటిలో విద్యార్థి తరగతికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, ఆక్స్‌ఫర్డ్‌, పిక్టోరియల్‌ డిక్షనరీ, మూడు జతల యూనిఫాం, బూట్లు, బెల్ట్‌, స్కూల్‌ బ్యాగ్‌ అందిస్తున్నారు.

నాడు–నేడు పేరిట ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు జగనన్న విద్యా కానుక పేరిట ఏటా ప్రత్యేక కిట్లు విద్యార్థులకు అందిస్తున్నారు. బడి బాట పట్టిన పిల్లలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫాంతో పాటు రూ.1,650 విలువైన విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారు.

నాడు-నేడు ప‌థ‌కం పై ప్ర‌త్యేక ఫోక‌స్‌తో..

nadu nedu

రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలూ ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన గురించి పట్టించుకోలేదు. తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా సర్కారు బడులను బాగు చేయడమే కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నిచర్‌ను పెద్ద ఎత్తున సమకూర్చుతున్నారు. ఒక పక్క స్కూలు భవనాల మరమ్మతులు నిర్వహిస్తూనే మరో పక్క బల్లలు, కుర్చీలు, టేబుళ్లతో పాటు సీలింగ్‌ ఫ్యాన్లు సమకూర్చారు. అల్మారాలు, స్మార్ట్‌ టీవీలు, రక్షిత మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. 

విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలిగించే క్లాస్ రూమ్లు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు.. ఇలా వైఎస్సార్సీపీ పాలనలో స్పష్టంగా కనిపించిన మార్పు. దీంతో దశాబ్దాల తరువాత రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారిపోయ్యాయి. విద్యపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని నమ్మిన సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేశారు. 

‘జగనన్న గోరుముద్ద’ :

jagananna gorumudda telugu news

‘జగనన్న గోరుముద్ద’ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాలు సైతం అనుసరిస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఈ పథకాన్ని ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తోన్నది. సీఎం వైఎస్‌ జగన్‌ పగ్గాలు చేపట్టాక విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వ‌చ్చాయి. గోరుముద్దతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా బడిబాటపట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ‘జగనన్న గోరుముద్ద’ పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు రాగి జావ, కోడిగుడ్డు, చిక్కీ వంటి పోషకాహారం అందించి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధమిక లక్ష్యంగా ఉందని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది. దేశంలో ఇదో అద్భుతమైన కార్యక్రమంగా ప్రకటించింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్లు పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ (వేరుశనగ బార్‌) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని కేంద్ర అధికారులు అభినందించారు కూడా. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం లోపం తగ్గడంతో పాటు రక్తహీనత సైతం చాలావరకు నివారించారని కితాబిచ్చింది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం కోసం జగనన్న గోరుముద్ద పథకంలో రోజుకో మెనూ చొప్పున స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రూపొందించిన విషయం తెలిసిందే.  

వైఎస్ఆర్ విద్యా పురస్కార్ పథకం :
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థుల చ‌దువును ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ విద్యా పురస్కార్ పథకంను తీసుకోచ్చింది. అలాగే ఈ పథకం రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ఉద్దేశించబడింది. వైఎస్ఆర్ విద్యా పురస్కారం అనేది ఒక గొప్ప‌ ప్రాజెక్ట్. ఈ కార్యక్రమం ద్వారా 10వ తరగతి ప‌బ్లిక్‌ పరీక్షకు హాజరైన.. మంచి మార్కులు సాధించిన‌ విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది ఈ ప‌థ‌కం. మైనారిటీ వర్గాలు (ST, OBC, SC) అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. BPL మరియు EWS విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

జగనన్న ఆణిముత్యాలు..

జగనన్న ఆణిముత్యాలు..

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో గ్రూపునకు ఒకరు చొప్పున  ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం కింద ప్రతిభ అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌తి ఏడాది విద్యార్థుల‌ను సత్కరింస్తుంది

రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం స్థాయిల్లో విడివిడిగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెరిట్‌ సర్టిఫికెట్లు, మెడల్స్‌ అందజేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులను శాలువాలతో, ఆ పాఠశాలల హెడ్‌మాస్టర్లను శాలువ, మొమెంటోతో సత్కరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్ధులను, ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురిని సత్కరిస్తారు.

జిల్లా స్థాయిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను, ఏడు ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలో నాలుగు గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన పదో తరగతిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను, ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల్లో ప్రతి గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరిస్తారు. 

►పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు రూ.1,00,000, రెండో స్ధానం సాధించిన విద్యార్థులకు రూ.75,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000 చొప్పున నగదు బహుమతి ఇస్తారు. 
► ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురేసి విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.1,00,000 ఇస్తారు 

జిల్లా స్థాయిలో..  
►  పదో తరగతిలో 606 మందికి, ఇంటర్‌లో 800 మందికి ప్రతిభా అవార్డులు 
►  పదిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థు­లకు రూ.50,000, రెండో స్థానం సాధించిన వారికి రూ. 30,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000 
► ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.50,000 

నియోజకవర్గ స్థాయిలో.. 
►  టెన్త్‌లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.15,000, రెండో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.5000లు నగదు బహుమతి ఇస్తారు 
► ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 ఇస్తారు.  

'జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం' :

jagananna vidya deevena

ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల విదేశీ చదువుల కలను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సాకారం చేస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా యువత ఉన్నత విద్యా కలలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విదేశాలకు వెళ్లి చదువుకునే అర్హులైన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజును పూర్తిగా ప్రభుత్వమే చెల్లించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25కోట్లు, ఇతరులకు రూ.కోటి వరకు మంజూరు చేస్తుంది . 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూషన్లలో లేటెస్ట్‌ క్యూఎస్‌ రేటింగ్‌ ఆధారంగా టాప్‌ 50లో నిలిచిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్లలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన పేద విద్యార్థులు పీజీ లేదా పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుకునేందుకు ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది.

'జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం' :

jagananna civils

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) సివిల్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన బలహీన వర్గాల అభ్యర్థులకు శిక్షణ కోసం జగనన్న సివిల్స్ ఇన్సెంటీవ్‌(ప్రోత్సాహకం) పేరుతో పథకం అమల్లోకి తెచ్చారు. ఏటా సివిల్స్‌ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వారికి రూ.లక్ష, మెయిన్స్‌ క్వాలిఫై అయిన వారికి అదనంగా మరో రూ.50 వేల అందజేయనున్నారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షను ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది ఆశావహులు అందించారు. (UPSC) UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవడం ఇప్పుడు చాలా ఖరీదైన వ్యవహారం. ఒకవిధంగా విద్యార్థి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలిగితే, మెయిన్స్ పరీక్షకు.., ఆ తర్వాత ఇంటర్వ్యూకి సిద్ధం కావడానికి చాలా డబ్బు అవసరం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని.. సివిల్ సర్వీసెస్ విద్యార్థులకు కోసం కొత్త‌గా ఈ ప‌థ‌కంను తీసుకోచ్చారు.

UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులందరికీ రూ. 1,00,000/- ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది కాకుండా UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులకు రూ. 50,000/- ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది.

వైఎస్సార్‌ లా నేస్తం.. 

jagananna law nestham

రాష్ట్రంలోని జూనియర్ లాయర్లకు స్టైఫండ్‌గా నెలకు రూ. 5,000 ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం డిసెంబర్ 2019లో వైఎస్ఆర్ లా నేస్తమ్‌ను ప్రారంభించింది. రాష్ట్రంలోని జూనియర్‌ న్యాయ­వాదులకు అండగా ఉంటున్న‌ది ఈ ప్ర‌భుత్వం.

కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తోంది.

పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్యే అని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అంటుంటారు. ఆ మాటను నిజం చేయాలనే అహర్నిశలు కృషిచేస్తున్నారు. పిల్లలకు విద్యాభ్యాసంలో అవరోధాలు కలగకుండా విద్యారంగం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. అన్నివర్గాల పిల్లలు చదువుల కోసం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా అనేక సంక్షేమ పథకాల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు ఏటా కేటాయిస్తూ కార్పొరేట్‌ విద్యకు దీటుగా సర్కారు బడులను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తి విద్యార్థి డైరెక్ట్‌గా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్ర‌వేశపెట్టిన పై ప‌థ‌కాల్లో ఎదో ఒక‌టి ల‌బ్ధిపొందే ఉంటారు.

Published date : 21 Dec 2023 08:20AM

Photo Stories