ఎస్‌ఎస్‌సీ సైంటిఫిక్ అసిస్టెంట్ విజయానికి వ్యూహాలు...
Sakshi Education
భారత వాతావరణ విభాగం (ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్)లో 1,102 ‘సైంటిఫిక్ అసిస్టెంట్’ ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు దేశవ్యాప్తంగా నవంబర్ 20 నుంచి 27 వరకు జరగనున్నాయి. జాతీయ స్థాయి పరీక్ష కావడంతో పోటీ కూడా తీవ్రంగానే ఉండే అవకాశముంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో కనబర్చే ప్రతిభ ఆధారంగానే ఎంపికలు చేపడతారు. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకపోవడం, ఒకే దశ పరీక్ష కావడంతో నియామక ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశముంది.
అర్హతలు : ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సైన్స్‌లో డిగ్రీ (కచ్చితంగా ఫిజిక్స్ చదివి ఉండాలి) లేదా డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)లో 60 శాతం మార్కులు/ 6.75 సీజీపీఏతో ఉత్తీర్ణులైనవారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
పరీక్ష విధానం :
పరీక్ష విధానం :
- కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులు. రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
- పరీక్ష వ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు).
- ప్రశ్నపత్రం పార్ట్-1, పార్ట్-2గా ఉంటుంది. పార్ట్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్-25, జనరల్ అవేర్‌నెస్- 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు. ఒక్కోదానికి ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పార్ట్-1 ప్రశ్నపత్రం ఉంటుంది.
- పార్ట్-2లో మూడు విభాగాలు.. ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధిత 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
- అభ్యర్థులకు సుమారు 17 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఇప్పటికే సన్నద్ధమవుతున్నవారు ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయాలి. పార్ట్-1లోని ప్రశ్నలు అందరికీ ఒకటే ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర పరీక్షల్లో కనిపించే సిలబసే పార్ట్-1లోనూ ఉంటుంది. గతంలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులు ఈ సెక్షన్‌లోని ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. కొత్తగా రాస్తున్న అభ్యర్థులు ఎక్కువగా ఈ విభాగంపై దృష్టిపెట్టాలి. ఇందుకు ప్రధాన కారణం విస్తృతమైన సిలబస్ ఉండటమే.
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: ఈ విభాగంలో వెర్బల్, నాన్ వెర్బల్ అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. క్లిష్టత స్థాయి సులువుగానే ఉంటుంది. దీనిలో సిరీస్ (నంబర్/ఆల్ఫా న్యుమరిక్) విభాగం, అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాయిజమ్, మాట్రిక్స్, దిశలు, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ (వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్- డీకోడింగ్ మొదలైన టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థులకు సంఖ్యలపై ఉన్న పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు ఎదురవుతాయి. న్యూమరికల్ ఎబిలిటీ మొదలు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, లాస్, శాతాలు, త్రికోణమితి, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్: ఈ విభాగం నుంచి వొకాబ్యులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్‌పై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు వస్తున్నాయి. సినానమ్స్, ఆంటోనమ్స్, ఇడియమ్స్ /ప్రేజెస్, రీడింగ్ కాంప్రెహెన్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పెల్లింగ్ మిస్టేక్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
- జనరల్ అవేర్‌నెస్ : మన చుట్టూ జరిగే పరిణామాలపై అభ్యర్థులకు ఉన్న అవగాహన, ఆసక్తిని తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, జాతీయోద్యమం, సాంస్కృతిక వారసత్వం, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
- పార్ట్-1 సిలబస్‌లోని పై నాలుగు అంశాల్లో మంచి స్కోరు సాధించడానికి వీలైనన్ని మాక్ టెస్టులు రాయడం మేలు. వీలైతే రోజుకో పరీక్ష రాయాలి. సీజీఎల్ టైర్-1 గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. కొన్నిసార్లు ప్రశ్నలు పునరావృతమయ్యే అవకాశముంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సమస్యలకు ఆప్షన్ల ద్వారా సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రశ్నలకు ఆప్షన్ ఎలిమినేషన్ విధానంలో కచ్చితమైన సమాధానాలు గుర్తించేందుకు వీలుంటుంది. ఇంగ్లిష్‌లో రాణించడానికి క్రమంతప్పకుండా ఇంగ్లిష్ దిన పత్రికలు చదవాలి. కొత్త పదాలు నేర్చుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో స్కోరు చేయడానికి వర్తమాన వ్యవహారాలపై పట్టుతో పాటు గత సీజీఎల్ టైర్-1 ప్రశ్నపత్రాలు ఉపకరిస్తాయి.
- పార్ట్-2కు సంబంధించి అభ్యర్థులు ఫిజిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి.
- ఫిజిక్స్‌లో.. మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్, రేడియేషన్, సౌండ్, వేవ్ అండ్ ఆసిలేషన్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, అటామిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రానిక్స్ అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి.
- కంప్యూటర్ సైన్స్.. ఐటీ సబ్జెక్టులో కంప్యూటర్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, వర్చువల్ మెమరీ, ఫైల్ సిస్టమ్, ఇన్‌పుట్- అవుట్ పుట్ సిస్టమ్, అసెంబ్లర్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఇంటర్నెట్ టెక్నాలజీస్, జీఐఎస్ ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ విభాగంలో.. ఎలక్ట్రానిక్స్ బేసిక్స్, నెట్‌వర్క్ థీరమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్‌లో సింగిల్ సైట్ బ్యాండ్, పల్స్ మాడ్యులేషన్, మల్టీప్లెక్సింగ్ మొదలైన విభాగాలు ముఖ్యమైనవి.
Published date : 04 Nov 2017 04:27PM