IT Layoffs: ఐటీ కంపెనీల్లో కోతలు.. టాప్ 3 కంపెనీల్లో 64 వేల మందికి లేఆఫ్స్..!
పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడా లేకుండా దాదాపు అన్నింటిలోనూ లేఆఫ్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో కేవలం దేశంలోని టాప్ 3 కంపెనీల్లోనే దాదాపు 64000 ఉద్యోగులు తగ్గినట్లు తెలిసింది.
గత ఆర్థిక సంవత్సరం (2023-24) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64,000 మంది ఉద్యోగులు బయటకుపోయినట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఐటీ కంపెనీలకు ప్రధానంగా బ్యాంక్‌లు కస్టమర్లుగా వ్యవహరిస్తుంటాయి. వీటితోపాటు మరెన్నో రంగాల్లో కస్టమర్లు ఉంటారు. కానీ డబ్బు సమృద్ధిగా ఉండి నిత్యం అప్‌డేట్‌లు కోరుకునే రంగంలో బ్యాంకింగ్ ఒకటి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్‌లు తమ సాఫ్ట్‌వేర్‌ను, తమ అవసరాలకు తగ్గట్టు వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసుకోవాలనుకోవడంలేదు. అత్యవసరం అయితే తప్పా ఈ చర్యలకు పూనుకోవడం లేదు.
ప్రధానంగా కీలక వడ్డీరేట్లలో సెంట్రల్ బ్యాంకులు, ఫెడ్ ఎలాంటి మార్పులు తీసుకురావడం లేదు. దాంతో బ్యాంకులకు ఆశించినమేర లాభాలు చేకూరడంలేదని అభిప్రాయాలున్నాయి. దాంతో ఐటీ వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా ఐటీ రంగానికి కస్టమర్లు తగ్గిపోయి వాటికీ నష్టం వాటిల్లుతోంది. కాస్ట్‌కటింగ్ పేరుతో ఉద్యోగాల్లో కోత తప్పడం లేదని వాదనలున్నాయి.
- ఈ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ ప్రకటించిన తాజా ఆర్థిక ఫలితాల్లో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 6,01,546 మంది ఉద్యోగులున్నారు. గత ఏడాది మార్చి ఆఖరుతో పోల్చితే 13,249 మంది తగ్గిపోయారు.
- రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖ్య 3,43,234 నుంచి 3,17,240కి పడిపోయింది. ఏడాది వ్యవధిలో 25,994 మందికి లేఆఫ్స్ ప్రకటించారు.
- విప్రోలో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి సంస్థ ఉద్యోగులు 2,34,054గా ఉన్నారు. ఏడాది కిందట 2,58,570 మంది ఉండగా, 24,516 మంది తగ్గారు.
IT Employees: 39,243 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ టెక్ కంపెనీలు ఇవే..