ఈ సారి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు పరీక్ష.. ఆర్జీయూకేటీ పాలకవర్గం నిర్ణయం
Sakshi Education
సాక్షి, అమరావతి: రాజీవ్‌గాందీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌జ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ సంస్థల్లో 2020-21 విద్యాసంవత్సరపు ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.
బుధవారం ఆర్జీయూకేటీ పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీరెడ్డి, ఇన్‌చార్జ్ వైస్ చాన్స్ లర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, విద్యారంగ సంస్కరణల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్‌ప్రేమ్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
- ఆర్జీయూకేటీ పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్‌ఐటీలు కొనసాగుతున్నాయి. ఈ విద్యాసంస్థల్లోని కోర్సులకు పదో తరగతి పరీక్షల్లో మెరిట్‌లో ఉన్న విద్యార్థులను రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఈసారి కోవిడ్-19 నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు అవడంతో ప్రభుత్వం విద్యార్థులందరినీ ఆల్‌పాస్‌గా ప్రకటించింది. దీంతో మెరిట్ ప్రకారం నిర్ణయించేందుకు వీలు లేకుండా పోయింది.
- ఆర్జీయూకేటీ పాలకవర్గం సమావేశమై ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. మూడు గంటల వ్యవధి ఉండేలా ఆఫ్‌లైన్‌లో ఓఎమ్మార్ షీట్లతో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
- పభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ప్రవేశ పరీక్ష విధివిధానాలు రూపొందించి షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.
Published date : 24 Sep 2020 04:16PM