Skip to main content

ఢిల్లీ సిక్కు గురుద్వారా పాఠశాలల్లో శుభ్రత గురించి చెప్పే రోబో!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదేళ్ల లోపు చిన్నారుల్లో సుమారు 10లక్షల మంది డయేరియా (అతిసార), శ్వాసకోశ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నట్లు యునిసెఫ్ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ వయస్సులోని పిల్లల మరణాలకు కారణమవుతున్న వాటిలో వీటిది రెండో స్థానమని కూడా యునిసెఫ్ చెబుతోంది. భారత్‌లో అయితే ఏటా కనీసం 321 మంది ఈ వ్యాధుల వలన ప్రాణాలు కోల్పోతున్నట్లు మరో నివేదిక చెబుతోంది. దీనికి కారణం చిన్నారులు ఆహారం తినేటపుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, మరుగుదొడ్లను వినియోగిం చినప్పుడు సరిగా శుభ్రంగా ఉంచుకోక పోవడం అని తెలిసిందే. దీంతో పిల్లల్లో చేతుల శుభ్రత గురించి అవగాహన పెరిగేలా, వారు చేతులను శుభ్రంగా ఉంచుకొనేలా చేసేందుకు ఢిల్లీలోని ఢిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ (డీఎస్‌జీఎంసీ) స్కూళ్లలో ఓ సరికొత్త రోబోను ప్రవేశపెట్టారు. దీని పేరు ‘పెపె’. మనిషి చేతి ఆకారంలో ఉండే ఈ సోషల్ రోబో పాఠశాలల్లో చిన్నారులు చేతులు శుభ్రం చేసుకునే కుళాయిల వద్ద ఉంచుతారు. పిల్లలు వీటి వద్దకు రాగానే ‘పెపె’ వారికి శుభ్రత గురించి వివరి స్తుంది. చేతులను పరిశుభ్రంగా ఉంచుకొనే విధానాలను వివరి స్తుంది. అంతేకాదు, సమీపం లోనే ఉన్న మరుగుదొడ్లను వినియోగించిన బాలలను సెన్సర్ల ద్వారా గుర్తించి వారు తప్పనిసరిగా చేతులను సబ్బు లేదా క్లీనింగ్ జెల్‌లతో శుభ్రం చేసుకునేలా చేస్తుంది. మన దేశానికి చెందిన అమృత విశ్వవిద్యాపీఠం సహకారంతో స్కాట్లాండ్‌లోని గ్లాస్కోవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ రోబోను రూపొందించారు. ఒక్కో రోబో ఖరీదు రూ.7 వేలు. డీఎస్‌జీసీ ఆధ్వర్యంలో నడిచే మొత్తం 12 శాఖల్లోనూ వీటిని అమర్చనున్నారు. కాగా, ఇప్పటికే కేరళలోని కొన్ని పాఠశాలల్లో ఈ రోబోను వినియోగిస్తున్నారు.
Published date : 24 Feb 2020 03:43PM

Photo Stories