Telangana Govt Schools: గుణాత్మక విద్య అందేనా?
కమ్మర్‌పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన కంటే బోధనేతర పనులకే ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు అధిక సమయం కేటాయించాల్సి వస్తోంది. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే తాము విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పరిగడుపున ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వం అల్పాహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో పాటు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్‌ఈ), ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌సీ) యాప్ ద్వారా విద్యార్థుల హాజరు, రాగి జావా పంపిణీ వంటి కార్యక్రమాల వివరాలను ప్రతి రోజు నమోదు చేయాల్సి ఉటుంది. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ‘తొలిమెట్టు’, ఉన్నత పాఠశాలల్లో ‘ఉన్నతి’ వంటి కార్యక్రమాలు ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు వారంతపు పీరియడ్ ప్రణాళికల తయారీ, బోధనోపకరణాలను సిద్ధం చేసుకోవడం, వర్క్ షీట్‌లను చేయించడం వంటి పనులకే పరిమితమై బోధనకు దూరమవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా జిల్లా, మండల విద్యాశాఖల నుంచి అనేక నివేదికలు కావాలనే ఆదేశాలతో బోధనేతర కార్యక్రమాలకే అధిక సమయం కేటాయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
అదనపు భారం..
ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర పనులతో ఒత్తిడి తీవ్రమై మానసిక వేదనకు గురవుతున్నట్లు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వ బడులలో నమోదవుతున్న విద్యార్థుల వివరాలను యూడైస్ ప్లస్‌లో నమోదు చేయాలి. ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు బోధనేతర సిబ్బందిలో పని భారం తగ్గినప్పటికీ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అదనపు భారం పడుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉంటారు. కానీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు సింహభాగం పాఠశాలలో ఉండడు. నివేదికల సమర్పణ పనులకే ఒక ఉపాధ్యాయుడు పూర్తి సమయం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బోధన జరగక విద్యార్థులు నష్టపోతున్నారు.
గుదిబండగా మధ్యాహ్న భోజన పథకం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అపశ్రుతులు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఫలితంగా నవీపేట, రెంజల్ బోర్గాం పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సస్పెండ్‌కు గురయ్యారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వండాలని అధికారుల నుంచి ఒత్తిడి ఎదురువుతోందని హెచ్‌ఎంలు పేర్కొంటున్నారు. వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు రాక ప్రధానోధ్యాయులు ఏమీ చేయలేకపోతున్నారు. రక్షిత మంచినీటీ వసతి, వంటశాలలు, వంటపాత్రలు లేకపోవడంతో చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వసత్థకు గురవుతున్నారు.
విభిన్న కార్యక్రమాలతో తరగతులకు ఉపాధ్యాయులు దూరం ఒత్తిడిలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు