పీఎంశ్రీకి టేకులోడు గురుకుల పాఠశాల ఎంపిక
చిలమత్తూరు: మండలంలోని టేకులోడు క్రాస్‌లో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల పీఎంశ్రీకి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ శ్యామ్‌భూపాల్‌రెడ్డి తెలిపారు. పీఎంశ్రీకి తమ పాఠశాల ఎంపిక కావడంతో ఇకపై మరింత మెరుగ్గా భోదన అందించే అవకాశం లభించిందన్నారు.
ప్రమాదవశాత్తూ కిందపడి వ్యక్తి మృతి
రొద్దం: మండల పరిధిలోని ఆర్ కొట్టాల గ్రామంలో ఓ ఇంట్లో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా కాలుజారి కిందపడి ఆర్ మరువపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రాజు(40) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... ఆర్ కొట్టాల గ్రామంలో ఓ ఇంట్లో కరెంటు పనిచేస్తుండగా రాజు ఇనుప నిచ్చెన మీద నుంచి కింద పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
ఎన్‌పీకుంట: మండల పరిధిలోని వెస్ట్‌నడిమిపల్లి పంచాయతీ దేవరపల్లి సమీపంలోని నారపచెరువులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల వివరాలమేరకు... నారపచెరువు నీటిలో తేలియాడుతూ కనిపించిన మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌చార్జ్ ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. సుమారు 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తిగా గుర్తించి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని పాతరామాపురం గ్రామానికి చెందిన పలువురు నన్నారి గడ్డలు కోయడానికి వచ్చివెళ్లారని, వారికి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జ్ ఎస్‌ఐ తెలిపారు.