చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ నూతన విద్యా విధానం–2020పై వర్క్‌షాప్ సోమవారం నిర్వహించారు. రామ్మోహనరావు మాట్లాడుతూ మనం ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక యుగంలో ఉన్నామని, డిజిటలైజేషన్‌కు సంబంధించిన ఉద్యోగాల కల్పనే ఎక్కువగా ఉందని వివరించారు. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూపొందించబడినదే నూతన విద్యా విధానమని అన్నారు. చాట్ జీపీటీ వంటి మేధోపరమైన విజ్ఞానశాస్త్ర అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యార్థులు కళాశాలలో కేవలం విజ్ఞానాన్నే సమకూర్చుకుంటే సరిపోదని, నైపుణ్యాలతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. విద్యార్థులు సమాజాన్ని అర్థం చేసుకునే విధంగా సీఎస్‌పీ, ప్రాజెక్టు, ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి మాట్లాడుతూ నూతన విద్యా విధానం విద్యార్థి కేంద్రంగా రూపొందించబడిందని తెలిపారు. కళాశాల ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మూడేళ్లు గడిచాయని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజ, ఉన్నత విద్యా మండలి అకడమిక్ అధికారి డాక్టర్ విష్ణు పాల్గొన్నారు.