స్కూల్ పరీక్షలకూ ఓఎంఆర్ షీట్లు
తరువాత పరీక్ష విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా ఓఎంఆర్ షీట్లను పరిచయం చేస్తోంది. స్కూలు అంతర్గత పరీక్షల్లో ఓఎంఆర్ పరీక్ష విధానం అమలు చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు రాతపూర్వక పరీక్షలు ద్వారా విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేవారు. ఇకపై తరగతి గది ఆధారిత మూల్యాంకనం (క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్) విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అంతర్గత పరీక్షల్లో ఓఎంఆర్ షీట్ల విధానం
ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే అంతర్గత పరీక్షల్లో ఓఎంఆర్ జవాబు పత్రాలు విధానాన్ని ప్రభుత్వం గత ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ విధానం ద్వారా విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఓఎంఆర్ పాత్రలపై జవాబులు రాయడంలో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చేయవచ్చు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఎప్పటినుంచో ఈ విధానాన్ని తమ విద్యార్థులకు పరిచయం చేసింది. గత ప్రభుత్వాలు ఆ దిశగా అసలు ఆలోచన చేయలేదు. చిన్నప్పటి నుంచే ఈ విధానం అలవాటు పడితే జేఈఈ వంటి పరీక్షలను విద్యార్థులు సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలలో ప్రశ్న పత్రాలు
ప్రభుత్వ పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించే ఫార్మేటివ్ సమ్మేటివ్ వంటి పరీక్షల్లో విద్యార్థులకు అందించే ప్రశ్నపత్రాలలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో రూపొందించి విద్యార్థులకు అందజేస్తుంది. కాగా ఒకటో నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఏడాదికి మూడు సార్లు తర్వాత మూల్యాంకన( సీ బీ ఏ) పరీక్షలు నిర్వహిస్తున్నారు. 9,10 తరగతులకు మాత్రమే పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రోజులు మారాయి.. ప్రపంచం ‘పోటీ’తో కుస్తీపడుతోంది.. ఐఐటీ కాన్సెఫ్ట్ అంటూ ఆకర్షిస్తున్నారు.. కొందరైతే పుట్టిన బిడ్డ నుంచి కాన్సెఫ్ట్ భ్రమల్లో మునిగిపోతున్నారు.. అందుకు అనుగుణంగా ధనికుల బిడ్డల ప్రణాళిక ఉంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు ముందుకేసి పేదింటి బిడ్డల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రాథమిక స్థాయి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా పరీక్షల విధానానికి రూపకల్పన చేశారు. అందులో భాగంగా ఓఎంఆర్ షీట్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పోటీ పరీక్షలకు సంసిద్ధత
ఓఎంఆర్ జవాబు పత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించడం వలన భవిష్యత్‌లో పోటీ పరీక్ష సమర్థంగా ఎదుర్కునేలా సంసిద్ధంగా ఉంటాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫార్మేటివ్ పరీక్షల్లో ఈ విధానాన్ని అవలంబిస్తున్నాం. ఈ విధానం వల్ల పరీక్షల్లో ఓఎంఆర్ షీట్లలో పెన్సిల్‌తో దిద్దడానికి పట్టే సమయంపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. – పి.వి.జె.రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి బాపట్ల
రెండు భాషల్లో ప్రశ్నపత్రాలు మంచి నిర్ణయం
అంతర్గత పరీక్షల్లో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రాలు ఇవ్వడం మంచి నిర్ణయం. దీనివల్ల విద్యార్థులు ప్రశ్నలను సులువుగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఓఎంఆర్ షీట్ల ద్వారా నిర్వహించే పరీక్షలతో విద్యార్థులకు పోటీ పరీక్షలు అంటే భయందోళనలు తొలిగిపోతాయి.– డి.ప్రసాదరావు,మండల విద్యాశాఖ అధికారి– 2
విద్యా ప్రమాణాలు పెరుగుతాయి
పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న నూతన పరీక్షల విధానం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మరింత పెరుగుతాయి. ఓఎంఆర్ షీట్ల నింపడంతో సందేహాలను చిన్న వయసులో నివృత్తి చేసుకుంటే భవిష్యత్‌లో ఉన్నత చదువుల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆయా పరీక్షలను రాయవచ్చు.– దండమూడి శాంతారావు, వైఎస్సార్ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి