Skip to main content

Gurukula school admissions: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

Inclusive Education for SC, ST, BC, and Other Categories   Gurukula school admissions   Free Accommodation in Gurukuls  Gurukul Admission for Class 5 and Intermediate
Gurukula school admissions

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశం పొందేందుకు సమయం ఆసన్నమైంది. 5వ తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గురుకులాల్లో ఉచిత వసతి కల్పించి, కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన అందిస్తున్నారు.

గతేడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధన సాగుతుండటంతో గురుకులాల్లో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతున్నారు. రుచికరమైన పౌష్టికాహారం, విద్యాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సైతం ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తుండటంతో.. వీటిలో సీటు దక్కించుకునేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు.

సీట్ల రిజర్వేషన్‌ ఇలా..

ఎస్సీ–75 శాతం, ఎస్సీ–కన్వర్టర్డ్‌ క్రిస్టియన్‌(బీసీ–సీ)–12 శాతం, ఎస్టీ–6 శాతం, బీసీ–5 శాతం, ఓసీ –2 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. ఎస్సీ గురుకులాల్లో చదివిన విద్యార్థులతో 60 శాతం సీట్లు, మిగతా 40 సీట్లు ఇతర స్కూళ్లలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు.

ఇదీ షెడ్యూల్‌

ఈ నెల 25న నోటిఫికేషన్‌ జారీ అయింది. ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 23 వరకు గడువు ఉంది. మార్చి10న ఉదయం10 నుంచి 12గంటల వరకు 5వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30గంటల వరకు ఇంటర్మీడియట్‌ ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులో మంచి మార్కులు సాధించిన వారి జాబితాను ప్రకటించి, మెరిట్‌ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు.

● అనకాపల్లిలో బాలురు దేవరాపల్లి, గొలుగొండ, సబ్బవరం, బాలికలు నక్కపల్లి, కోనాం, నర్సీపట్నం, తాళ్లపాలెం, కొక్కిరాపల్లి గురుకులాల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఒక్క సబ్బవరంలో మాత్రం ఎంఈసీ, సీఈసీలో 40 చొప్పున సీట్లు ఉండగా, మిగతా అన్ని కాలేజీల్లోనూ ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో 40 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐదో తరగతిలో 80 మంది చొప్పున అవకాశం ఉంది.

● విశాఖపట్నం జిల్లా పరిధిలో శ్రీకృష్ణాపురం(బాలురు), మేహాద్రి గెడ్డ(బాలికలు), మధురవాడ(బాలికలు)లో గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో గురుకులంలో 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్‌లో బైపీసీ–40, ఎంపీసీ–40 సీట్ల చొప్పున ఉన్నాయి.

అర్హతలివీ..

5వ తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 2011 సెప్టెంబర్‌ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31 మధ్య, ఓసీ, బీసీ, ఎస్సీ(కన్వర్టడ్‌ క్రిస్టియన్‌) విద్యార్థులు 2013 సెప్టెంబర్‌ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. 3, 4 తరగతులు గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి. ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి 2023–24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2024 ఆగస్టు 31 నాటికి 17 సంవత్సరాలు వయసు మించకూడదు. ఎస్సీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులకై తే ఒక ఏడాది సడలింపు ఇస్తారు. విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.లక్ష ఉండాలి.ఐదో తరగతి ప్రవేశానికి http:// apgpcet.apcfss.in, ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి http://apgpcet.apcfss.in/inter వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

సద్వినియోగం చేసుకోవాలి

గురుకులాల్లో అడ్మిషన్లుకు గతంలో కన్నా.. ఇప్పుడు పోటీ ఉంది. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా అన్ని గురుకులాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు అర్హులైన, ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

– రూపవతి, బీసీ గురుకుల సొసైటీ కన్వీనర్‌, ఉమ్మడి విశాఖ జిల్లా

ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ

విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించడమే లక్ష్యంగా.. ప్రతి ఒక్కరిపై వ్యక్తి గత శ్రద్ధ తీసుకుంటాం. చదువులతో పాటు, ఇతర అంశాల్లోనూ రాణించేలా తర్ఫీదు ఇస్తాం. మా విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ఉపాధ్యాయులంతా సమన్వయంతో పనిచేస్తున్నాం.

–వి.రత్నవల్లి, ప్రిన్సిపాల్‌, శ్రీకృష్ణపురం

Published date : 30 Jan 2024 08:36AM

Photo Stories