government schools midday meal: ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఘుమఘుమలాడే..కొత్త వంటకాలు ఇవే..
నెల్లూరు(టౌన్): ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేసి.. విద్యా ప్రమాణాల పెంపునకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మరో నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో 2010లో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అందజేసిన వంట పాత్రల స్థానంలో నూతన సామగ్రిని సమకూర్చుతోంది. పాత సిల్వర్ పాత్రల స్థానంలో నాణ్యతతో కూడిన స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను వంట ఏజెన్సీల నిర్వాహకులకు అందజేస్తోంది. సరిపడా పాత్రలు ఉండటంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సకాలంలో అందించేందుకు అవకాశం ఏర్పడనుంది. ఇప్పటికే జిల్లాలోని ఆరు మండలాల్లో గల 267 ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశారు.
ప్రభుత్వాలు మారినా.. మారని తీరు
వాస్తవానికి 2010 తర్వాత పలు ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వ పాఠశాలల్లో వంట పాత్రల మార్పుపై దృష్టి సారించలేదు. ఫలితంగా ఏళ్ల నాటి పాత్రలతో ఏజెన్సీల నిర్వాహకులు రోజూ అవస్థ పడేవారు. ఫలితంగా విద్యార్థులకు అరకొరగా భోజనం అందేది. సమస్యను దృష్టిలో ఉంచుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నూతన వంట పాత్రలను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
2,285 పాఠశాలలకు
జిల్లాలో 2,575 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 2027 ప్రాథమిక, 254 ప్రాథమికోన్నత, 294 ఉన్నత పాఠశాలలు. జిల్లాలో అక్షయపాత్ర నిర్వాహకులు 192 ప్రభుత్వ పాఠశాలలకు.. ఇస్కాన్ నిర్వాహకులు 98 పాఠశాలలకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. మిగిలిన 2285 ప్రభుత్వ పాఠశాలల్లోనే వంటను వండి విద్యార్థులకు భోజనాన్ని ఏజెన్సీలు అందిస్తున్నాయి. ఈ పాఠశాలలకు స్టీల్ పాత్రలను సరఫరా చేయనున్నారు. తాజాగా తొలి విడతలో జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో గల 267 పాఠశాలల్లో ఏజెన్సీలకు సరఫరా చేశారు.
సరఫరా ఇలా..
ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా 5 నుంచి 11 రకాల వంట పాత్రలను సరఫరా చేస్తున్నారు. మండల కేంద్రాల నుంచి ఎండీయూ వాహనాల ద్వారా ఆయా పాఠశాలలకు చేరుస్తున్నారు. దీనికి సంబంధించిన రవాణా బిల్లులనూ రాష్ట్ర ప్రభుత్వమే మంజూరు చేసింది. పాత్రల తరలింపునకు రూ.3.42 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.