Skip to main content

Students: ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్‌

Students
Students

కామవరపుకోట: ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ అరెస్ట్‌తో విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కామవరపుకోట మండలం తడికలపూడి శ్రీ హర్షిత ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ కరస్పాండెంట్‌ నందిగామ రాణి, ఆమె భర్త ధర్మరాజు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పలు ఎన్నారైలు, వ్యాపారస్తులు, మరికొందరి నుంచి పాఠశాల లాభాల్లో వాటా ఇస్తానని నమ్మించి వారి దగ్గర నుంచి సుమారు రూ.30 కోట్లు అప్పుగా తీసుకున్నారు.

నాలుగు ఎకరాల స్థలంలో తడికలపూడి నుంచి కళ్ళచెరువు రోడ్‌లో నూతనంగా హాస్టల్‌తో కూడిన పాఠశాల భవనాలను, జూనియర్‌ కాలేజీ భవనాలను నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసి నూతన భవనాల్లో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టారు. ఆ తర్వాత అప్పు ఇచ్చిన వారికి, పాఠశాల లాభాల్లో వాటా ఇస్తానన్న వారికి మొహం చాటేశారు. అప్పు చెల్లించమని అడిగిన వారిని చంపుతానని బెదిరించారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ నుంచి ఒకొక్కరుగా బయటకు రావడంతో అసలే మొదట నుంచి దురుసు ప్రవర్తన కలిగిన కరస్పాండెంట్‌ నందిగామ రాణి ఆమె నిజ స్వరూపం, ఆమె చేసిన మోసాలు ఒకొక్కటిగా బయటపడ్డాయి.

మోసపోయామని గ్రహించిన బాధితులు గత ఆరు నెలల నుంచి ఆమైపె ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు పెట్టడంతో పాటు బాధితులు పాఠశాల సమీపంలో ఆందోళనలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ కేసుల వలన పాఠశాల మూతపడితే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని పాఠశాలలో చదివే కొంతమంది పిల్లలను వారి తల్లిదండ్రులు వేరొక స్కూల్లోకి చేర్పించారు, గత శనివారం పాఠశాల కరస్పాండెంట్‌ నందిగామ రాణిని, ఆమె భర్త ధర్మరాజును తెలంగాణ రాష్ట్రంలో అరెస్టు చేసి జైలుకు పంపించడంతో విద్యా సంవత్సరం మధ్యలో స్కూలు మూతపడితే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు.

Published date : 04 Sep 2023 04:37PM

Photo Stories