Teachers: ఉపాధ్యాయులకు కలెక్టర్ ఆదేశం..!
వార్షిక పరీక్షలు ముగిసే వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడు సెలవు తీసుకోకుండా పనిచేయాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఎంఈఓ, ఎంఎన్‌ఓ, సీఎచ్‌ఎంలు, విధ్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. పదోతరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాధికారి మొదలు మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే కిందిస్థాయి సిబ్బంది ఉపాధ్యాయులు సైతం వార్షిక పరీక్షలు ముగిసే వరకు డైరీని తయారు చేసుకుని సంతకంతో తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రోజు వారీగా హాజరు వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు అదనంగా తరగతులు తీసుకుని బోధించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు.