Schools Bomb Threat: 150 స్కూళ్లకు బాంబు బెదిరింపు
ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లోని 150 పైచిలుకు స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ అందడంపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తమకు 97 ఫోన్ కాల్స్ వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతా కొన్ని కాల్స్ అందాయన్నారు.
తూర్పు ఢిల్లీలోని 24 ప్రైవేట్ స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని 18 స్కూళ్లు, పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలోని 21, షాదారాలోని 10 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూళ్ల వద్దకు చేరుకుని, తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం, పాఠశాలల నిర్వాహకులు మైక్‌ల ద్వారా తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడం కనిపించింది.
చదవండి: Govt Blind Ashram School: ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు..
సోదాల్లో 20 బృందాలు
ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసు బృందాలు సీపీ రవీందర్ యాదవ్ నేతృత్వంలోని బెదిరింపులు అందిన స్కూళ్లలో ప్రొటోకాల్ ప్రకారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు.
బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కూడిన 20 బృందాలను రంగంలోకి దించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కని పించకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని హోం శాఖ ప్రకటించింది.
డార్క్‌నెట్ నుంచి మెయిళ్లు
ఎటువంటి ఆధారాలు చిక్కకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగించుకుని దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. sawariim@mail.ru అనే ఈ మెయిల్ ఐడీ నుంచి వచ్చిన ఈ మెయిళ్లన్నిటిలోనూ..‘మీరు ఎక్కడ కలుసుకున్నా వారిని చంపండి, వారు మిమ్మల్ని తరిమికొట్టిన ప్రదేశాల నుంచి వారినీ తరిమికొట్టండి.
స్కూల్లో చాలా పేలుడు పదార్థాలున్నాయి..’అనే విషయమే ఉందని వెల్లడించింది. ఇందులోని సవరిమ్ అనే అరబిక్ పదాన్ని ఉగ్ర సంస్థ ఐఎస్ తరచూ వాడుతుంటుందని ఓ అధికారి తెలిపారు. బెదిరింపుల్లో పవిత్ర ఖురాన్‌ను కూడా ఉటంకించారని చెప్పారు.
ఎన్నికల వేళ ప్రజల్లో భయాందోళనలను సృష్టించడానికి ఉగ్ర సంస్థలు పన్నిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తూ లోతుగా దర్యాప్తు చేపడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది.