Teachers Awards 2023: వచ్చేనెల 1న ఆంగ్లమాద్యమ టీచర్లకు అవార్డుల పరీక్ష
విజయనగరం అర్బన్: ఆంగ్ల మాధ్యమంలో బోధనలు అందిస్తున్న ఉపాధ్యాయులకు నిర్వహించే ప్రొఫిషియన్సీ టెస్ట్ తేదీ వచ్చేనెల 1వ తేదీకి మార్చారు. ఆ రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. పరీక్షకు దరఖాస్తు గడువు తేదీని ఈ నెల 31వ తేదీకి పొడించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పరీక్ష నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ టీచర్స్ అక్రిడిటేషన్ (సెంటా) సోమవారం వెబ్ సైట్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
పరీక్షకు జిల్లా నుంచి విశేష స్పందన
ఉత్తమ ఇంగ్లిష్ బోధనా నైపుణ్యాలు చూపిన ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజున సత్కరించాలని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు జిల్లా ఉపాధ్యాయుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పరీక్ష రాసేందుకు అధికమంది ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పాఠశాలలో అర్హులైన ఉపాధ్యాయులు 7,200 వరకు ఉండగా తొలుత ఇచ్చిన ఈ నెల 27 గడువు ముగిసినలోగా 70 శాతం మంది దాదాపు 4,500 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ సిబ్బంది విస్తృతస్థాయిలో ఇచ్చిన ప్రచారం సత్ఫలితాలిస్తోంది. ప్రతి రోజూ నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఎంఈఓలతో సంబంధిత ఉపాధ్యాయులను చైతన్య పరిచారు. దీంతో అధిక సంఖ్యలో పరీక్షకు నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభచూపిన ఉపాధ్యాయులను జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అవార్డులతో సెప్టెంబర్ 5వ తేదీన సత్కరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
31వ తేదీ మధ్యాహ్నం12 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం టీచర్స్ డే రోజున విజేతలకు జిల్లా, నియోకవర్గ, మండల స్థాయి అవార్డులు