Skip to main content

AP Govt. Schools: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ... ప్రైవేట్‌ కంటే మిన్నగా!!

ఆంధ్ర ప్రదేశ్ లో నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. అక్కడ చదివే పిల్లలు, ఉద్యోగులు, ఊరి జనాలు కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు.
Nadu Nedu, Nadu Nedu program transforming public education in AP, Equal opportunities: Public schools in AP match private schools, AP Govt. Schools, Students using modern technology in Andhra Pradesh Government Schools,

మా బడి ప్రైవేట్‌ కంటే మిన్నగా..

మాది చిట్టత్తూరు గ్రామం, రామచంద్రాపురం మండలం. ఎంతో కాలంగా ఎదుగూబొదుగు లేక మా ఊరి పాఠశాల అధ్వానంగా ఉండేది. దీనికితోడు పాఠశాలలో తెలుగు మీడియం చదువులు మాత్రమే చెప్పేవారు. విధిలేక మా పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలో చేర్పించా. జగనన్న ప్రభుత్వం వచ్చాకా నాడు–నేడుతో తరగతి గదులు, మరుగుదొడ్లు, బల్లలు, ఫ్యాన్లు, గోడ చిత్రాలతో మా ఊరి బడి సర్వాంగ సుందరంగా తయారైంది. దీనికి తోడు ఇంగ్లిషు మీడియంలోనే చదువులు చెబుతున్నారు. పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలో మాన్పించి ప్రభుత్వ బడిలో చేర్పించా.

–గీతాంజలి, విద్యార్థి తల్లి, చిట్టత్తూరు ప్రాథమిక పాఠశాల, తొట్టంబేడు


మా బడి బాగుంది

మా ఊర్లో ప్రభుత్వ పాఠశాల గతంలో అధ్వానంగా ఉండేది. పిల్లలు బలవంతంగా బడికి వెళ్లేవారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నాడు–నేడు కింద పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించారు. అలాగే పాఠశాల గదులను అధునాతనంగా తీర్చిదిద్దారు. నూతనంగా మరుగుదొడ్లు నిర్మించారు. పిల్లలను ఆకర్షించేలా తరగతి గదులను రూపొందించారు. నా ఇద్దరు కుమార్తెలను స్థానికంగా ఉన్న బడికే పంపుతున్నాను. విద్యాకానుక కింద యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, నోటు పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు. అమ్మఒడి ద్వారా ఏటా రూ.15వేలు అందుతోంది. పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించారు. టీచర్లు కూడా బడికి సమయానికే వస్తున్నారు. ప్రైవేటుస్కూళ్లకంటే గవర్నమెంటు బడులు చాలా బాగున్నాయి.

– ఈటిపాకుల ఎల్లమ్మ, వీకేఆర్‌వై గిరిజన కాలనీ, వరదయ్యపాళెం మండలం


కొత్తగా ఉంది

గతంలో పాఠశాల శిథిలావస్థలో ఉండేది. సీఎం జగన్‌ పాఠశాలలకు కొత్త రూపు రేఖలు తీసుకువచ్చారు. నేడు పాఠశాల కొత్తగా ఉంది. నాడు–నేడు కింద పాఠశాలలో బిడ్డలకు ఇంగ్లిష్‌ చెప్పడంతోపాటు పెద్ద టీవీ ఏర్పాటు చేసి దాని ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇలాగే అయ్యోర్లు శ్రద్ధతో చదువు చెబితే పిల్లలను కాన్వెంటులకు పంపాల్సిన అవసరం లేదు. బడిలో యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, ఇవ్వడంతో పాటుగా అమ్మ ఒడి ద్వారా నగదు ఇస్తుండడం సంతోషంగా ఉంది. నా కుమార్తె సహస్రను ఒకటవ తరగతిలో కాన్వెంటుకు పంపా. ఇప్పుడు గ్రామంలోనే ఇంగ్లిషు చెబుతుండడంతో ఇక్కడే చేర్పించా.

– కొండాపురం ముత్యాలమ్మ, కలవకొండ గ్రామం, చిల్లకూరు మండలం


అధునాతన వసతులు

గతంలో మాపాఠశాల చాలా అధ్వానంగా ఉండేది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు–నేడు పథకం పేరుతో పాఠశాల రూపు రేఖలు మారాయి. ఇరుక గదుల సమస్య తీరింది. పాఠశాలకు అత్యాధునిక వసతులు సమకూరాయి. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. మెనూ ప్రకారం భోజనం ఇస్తున్నాం. దీనిపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు సంతోషంగా పాఠశాాలకు వస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లిషు పాఠాలను కూడా బోధిస్తున్నాం.
– జెడ్‌.విజయలక్ష్మికుమారి, హెచ్‌ఎం, సైదాపురం


అడ్మిషన్లకు సిఫార్సులు

తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్లో అడ్మిషన్లకు సిఫార్సులు వస్తున్నాయి. 2019లో నేను ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా వచ్చాను. అప్పుడు 272 మంది విద్యార్థులే ఉన్నారు. నాడు–నేడుతో పాఠశాల రూపురేఖలు మారాయి. మొదటి విడతలో రూ.80 లక్షలతో కార్పొరేట్‌ తరహాలో ఆధునీకరణ పనులు చేపట్టారు. ప్రహరీ గోడ, రన్నింగ్‌ వాటర్‌తో కూడిన అధునాతన బాత్‌రూమ్‌లు, ప్రతి తరగతి గదిలో నాలుగు ట్యూబ్‌లైట్లు, నాలుగు ఫ్యాన్లు, బల్లలు వంటి సౌకర్యాలు కల్పించారు. రెండో విడతలో అదనంగా 5 తరగతి గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డిజిటల్‌ విద్యలో భాగంగా పాఠశాలకు 8 ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌, 3స్మార్ట్‌ టీవీలు, ఇంటర్నెట్‌, ఇవే కాకుండా 8, 9 తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు అందించారు. పాఠశాలలో 2022–23 విద్యాసంవత్సరానికి 590 మంది విద్యార్థులు చేరారు. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు సిఫార్సు లేఖలు తీసుకువస్తున్నారు.
–ఆర్‌.వంశీరాజ, ప్రధానోపాధ్యాయులు, జెడ్పీహైస్కూల్‌, ముత్యాలరెడ్డిపల్లి, తిరుపతి


మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వబడిలో చదువుతున్నారు

నా ఇద్దరు పిల్లల్ని పెనుమూరు జెడ్పీ హైస్కూల్‌లో చదివిస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక గతంలో ఎప్పుడూ చూడనంత మార్పు చూశాం. నేను చదువుకునే రోజుల్లో మా బడిలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అన్ని మెరుగైన సౌకర్యాలు నాడు–నేడు పథకం ద్వారా కల్పించారు. పాఠశాలలో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం బాగుంది. విద్యకు ప్రాధాన్యతనిచ్చి సర్కారు బడుల్లో ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం.

– పద్మావతి, విద్యార్థి తల్లి, తాటిమోగులపల్లె, పెనుమూరు మండలం


పాఠశాల చూడచక్కగా ఉంది

నా ఇద్దరు పిల్లలు విజయపురం దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. పేద కుటుంబానికి చెందిన వారం కావడంతో కాన్వెంట్‌ స్కూల్‌కు పంపలేని పరిస్థితి. అయితే ఇప్పుడు మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల కార్పొరేట్‌ కంటే మిన్నగా మారింది. మా పిల్లలు మేథ్యూ, జయశ్రీ చూడచక్కని పాఠశాలలో నేడు చదువుతున్నారు. పాఠశాలలో నేడు అన్ని వసతులు ఉన్నాయి. మా పిల్లలు మంచి పాఠశాలలో చదువుతున్నారన్న ఆనందం ఇప్పుడు మా సొంతం అయ్యింది. మా పిల్లల బాగు కోసం ఇంతలా ఆలోచించిన సీఎంను మేము ఇప్పటి వరకు చూడనేలేదు.

– సుకన్య, విజయపురం దళితవాడ.


పాఠశాలలకు ఆధునిక వసతులు

పాఠశాలలకు ఆధునిక వసతులు సమకూరాయి. శ్రీహరిపురం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు సమకూరాయి. ఈ వసతులన్నీ ఈ ప్రభుత్వం వల్లే సాధ్యమయ్యాయి. నాడు–నేడు పథకంలో రూ.1.30 కోట్లతో పాఠశాలను అభివృద్ధి చేశారు. ఆరు గదులు, వంటగది, మరుగుదొడ్లు, ప్రహరీగోడ, తదితర సౌకర్యాలను కల్పించారు. విద్యార్థులకు నాణ్యమైన డెస్కులు, తాగునీటి కోసం ఆర్వో వాటర్‌ ప్లాంట్‌, తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాల వల్ల ప్రైవేట్‌ బడుల నుంచి శ్రీహరిపురం పాఠశాలలో నూతన అడ్మిషన్లు పెరిగాయి.

– చంద్రగిరి సోమశేఖర్‌, హెచ్‌ఎం, శ్రీహరిపురం, విజయపురం మండలం.

Published date : 23 Nov 2023 12:40PM

Photo Stories