Skip to main content

బోధన లక్ష్యాలు - స్పష్టీకరణాలు

బోధన ముఖ్య ఉద్దేశం ప్రవర్తనలో మార్పు. లక్ష్యాలను నిర్దేశించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో జీవశాస్త్ర విలువలు ప్రతిబింబిస్తాయి. UNESCO ప్రచురించిన విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్ ప్రకారం ఒక గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు, ఒక ఉద్దేశం నుంచి అనేక లక్ష్యాలు ఏర్పడుతాయి. కేంబ్రిడ్‌‌జ ప్రొఫెసర్ రిచర్‌‌డ వైట్‌షీల్డ్ ప్రకారం ఉద్దేశాలు, లక్ష్యాలు గొలుసు రూపంలో ఉంటాయి. లక్ష్యాలు తక్కువ కాల పరిధిలో సాధించగలిగి, నిర్దిష్టంగా ఉంటాయి.

లక్ష్యాలు - పరిగణనలోకి తీసుకునే అంశాలు
విద్యార్థి అవసరాలు:
విద్యార్థి అభిరుచులు, వైఖరులను బట్టి లక్ష్యాలు ఉండాలి.
సామాజిక అవసరాలు: సమాజానికి ఏది అవసరమో తెలుసుకొని లక్ష్యాలను ఏర్పర్చుకోవాలి.
లభించే వనరులు: పరిసరాల్లో దొరికే సహజ వనరులను ఉపయోగించి బోధించేలా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి.
విత్తనం మొలకెత్తడం అనే పాఠ్యాంశం గురించి బోధించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్పుడు చిక్కుడు మొలకెత్తే విధానాన్ని తీసు కుంటాం. కానీ ఆపిల్ మొలకెత్తే విధానాన్ని వివరించము.
పాఠ్యాంశ స్వభావం: ఏ పాఠ్యాంశం బోధిం చాలనుకున్నామో దానికి సంబంధించిన లక్ష్యాన్నే ఏర్పర్చుకోవాలి.
ఉదా: జీర్ణక్రియ గురించి బోధిస్తూ శ్వాసక్రియ లక్ష్యాన్ని ఏర్పరచుకోకూడదు.
విద్యా విధాన స్వభావం: చదివే కోర్సు స్వభావం, ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.
లక్ష్యాల లక్షణాలు: విద్యావిషయక ప్రాధాన్యత → పరిశోధించదగింది → ఉపాధ్యాయుడు ఏం చేయాలో తెలియజేసేది → ప్రతి లక్ష్యానికి స్పష్టీకరణాలు ఉండటం → మూల్యాంకనానికి వీలుగా ఉండాలి → సరళమైన భాషలో నిర్దిష్టంగా ఉండాలి → యోగ్యమైందిగా ఉండాలి → ఒకే వాక్యంలో ఉండాలి → తక్కువ కాల పరిమితిలో సాధించేదిగా ఉండాలి.

థర్బర్, కొల్లేట్ సూచనలు
లక్ష్యం కింది లక్షణాలు కలిగి ఉండాలి.
ఉపయోగిత్వం: నిజజీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలి.
సమకాలీనత: వర్థమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి.
అనువైంది: సాధించడానికి వీలుగా ఉండాలి.
అనుగుణ్యత: విద్యార్థుల స్థాయికి తగినట్లుగా (పూర్వజ్ఞానానికి తగిన) ఉండాలి
ఆచరణ యోగ్యత: తగిన అనుభవాలను కలిగించేదిగా (తరగతిగదిలో ఆచరించడానికి వీలుగా) ఉండాలి.

స్పష్టీకరణాలు
విద్యార్థిలో ఆశించే ప్రవర్తన మార్పును తెలియజేసేదాన్నే స్పష్టీకరణం అంటారు. దీన్నే ప్రవర్తనాలక్ష్యం అని కూడా అంటారు. ప్రతి లక్ష్యానికి అనేక స్పష్టీకరణాలు ఉంటాయి.
  • విద్యార్థి శ్వాస వ్వవస్థ గురించిన జ్ఞానాన్ని పొందుతాడు.
  • శ్వాసక్రియా విధానాన్ని వివరిస్తాడు.
  • శ్వాస వ్యవస్థలోని వివిధ భాగాలను గుర్తిస్తాడు.
  • శ్వాసవ్యవస్థ పటాన్ని గీస్తాడు.
ప్రతి స్పష్టీకరణ చివరలో గుర్తిస్తాడు, జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, గీస్తాడు, వివరిస్త్తాడు వంటి క్రియా పదాలుంటాయి. ఇవి విద్యార్థి పనులను తెలియజేస్తాయి.

బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ
‘నేషనల్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్’ ప్రచురించిన 31వ వార్షిక గ్రంథంలో 38 సాధారణీకరణాలను పేర్కొన్నారు. 1946 వరకు వీటి ఆధారంగానే బోధన ఉండేది. ఇవి చాలా పురాతనమైనవి. 1946లో కొత్తగా విద్యా లక్ష్యాలను ఏర్పరచాలని చర్చించారు. 1946 నుంచి 1956 వరకు జరిగిన చర్చలు, కృషి వల్ల బెంజమిన్ ఎస్. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేసి 1956లో ‘బ్లూమ్స్ విద్యాలక్ష్యాల వర్గీకరణ’ అనే పుస్తకాన్ని విడుదల చేసాడు.
బ్లూమ్స్ విద్యాలక్ష్యాలను మూడు రంగాలుగా విభజించాడు. అవి..
1. జ్ఞానాత్మక రంగం
2. భావావేశ రంగం
3. మానసిక చలనాత్మక రంగం
జ్ఞానాత్మక రంగం: ఈ రంగం మెదడుకు సంబంధించింది. దీన్ని H అంటే Headకు సంబంధించిందిగా సూచించాడు. జ్ఞానాత్మక రంగ సోపానాలు ఆరు. అవి.. జ్ఞానం, అవగాహన, వినియోగం/అన్వయం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం.
జ్ఞానం: విషయాన్ని యథాతథంగా మెదడులో దాచుకొని అవసరమైనప్పుడు జ్ఞప్తికి తెచ్చుకొనేదే జ్ఞానం. దీనిలో జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనే రెండు అంశాలు ఉంటాయి. శాస్త్రీయ సత్యాలు, తేదీలు, సంఘటనలు, శాస్త్రవేత్తల పేర్లు, పద్ధతులు సిద్ధాంతాలు, సూత్రాలు, వర్గీకరణ విధానం మొదలైన వాటిని జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం ఈ లక్ష్యానికి సంబంధించింది.
అవగాహన: తెలుసుకున్న జ్ఞానానికి తన సొంత ఆలోచనను జోడించి విద్యార్థి అవగాహనను ఏర్పర్చుకుంటాడు. దీనిలో మూడు సోపానాలున్నాయి. అవి..
ఎ. అనువాదం: శాస్త్రీయ పరిభాష పదాలు, గుర్తులను తనకు అర్ధమయ్యే భాషలోకి అనువదించుకుంటాడు.
బి. అర్థవివరణ: చిత్రాలు, గ్రాపులను చూసి విషయాలను విశదీకరించడం.
సి. బహిర్దీశనం: సేకరించిన సమాచారం ఆధారంగా భవిష్యత్‌లో జరగబోయే విషయాలను ఊహించడం. అవగాహనలో 11 స్పష్టీకరణాలు ఉంటాయి.
1. అనువదించడం: శాస్త్రీయ భాషలోని విష యాన్ని తెలిసిన భాషలోకి తర్జుమా చేయడం.
2. వివరించడం: జరిగిన విషయాన్ని యథా తథంగా తెలియజేయడం.
3. వ్యాఖ్యానించడం: జరిగిన విషయాన్ని యథాతథంగా కాకుండా సొంత అభిప్రాయాన్ని జోడించి చెప్పడం.
4. దోషాలను కనుక్కోవడం: ప్రయోగ చిత్రాల్లో ఉన్న దోషాలను కనుక్కోవడం.
5. ఉదాహరణలివ్వడం: సత్యాలు, భావనలకు తగిన ఉదాహరణలివ్వడం.
6. సరిపోల్చడం: రెండు అంశాల్లో సారూప్యత కలిగిన విషయాలను చెప్పడం.
7. వివేచించడం: ఒక క్రమపద్ధతిలో ఒకదాని తర్వాత మరొకటి దశలవారీగా ఆలోచించి తెలుసుకోవడం.
8. వర్గీకరించడం: లక్షణాలను బట్టి సమూహాలుగా విభజించడం.
9. భేదాలు గుర్తించడం : రెండు అంశాల్లో ఉన్న భిన్నమైన లక్షణాలను తెలియజేయడం
10. సంబంధాలను గుర్తించడం: సత్యాలు, భావనలకు మధ్య ఉన్న సంబంధాలను గుర్తించడం.
11. కార్యకారణ సంబంధాన్ని గుర్తించడం: రెండు భిన్నమైన అంశాలమధ్య సంబంధం ఎందుకు ఉందో గుర్తిస్తాడు.
అన్వయం/వినియోగం: నేర్చుకున్న విషయాల ను నిజజీవితంలో ఉపయోగించుకోవడం.

గతంలో అడిగిన ప్రశ్నలు
1. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వృక్ష, జంతు కణ నిర్మాణాన్ని బోధించిన తర్వాత M అనే విద్యార్థి వాటి నిర్మాణాన్ని తు.చ. తప్పకుండా అప్పచెబితే, P అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు స్వయంగా తెలియజేశాడు. M, P విద్యార్థుల సాధనలో ఉన్న లక్ష్యస్థాయి? (డీఎస్సీ-2008)
1) M-జ్ఞానం; P-కజ్ఞానం
2) M-అవగాహన; P-అవగాహన
3) M-అవగాహన; P-జ్ఞానం
4) M-జ్ఞానం; P-అవగాహన
2.బ్లూమ్స్ విద్యాలక్ష్యాల వర్గీకరణలో జ్ఞాన రంగ లక్ష్యాల అనుక్రమణిక?(డీఎస్సీ -2008)
1)జ్ఞానం- అవగాహన- అన్వయం -సంయోగం- మూల్యాంకనం- విశ్లేషణం
2)జ్ఞానం- అవగాహన- విశ్లేషణం- అన్వయం -సంయోగం- మూల్యా ంకనం
3)జ్ఞానం- అవగాహన- అన్వయం -సంయోగం- మూల్యాంకనం
4)జ్ఞానం- అవగాహన- అన్వయం - విశ్లేషణ -సంయోగం -మూల్యాంకనం
3.కింది ప్రశ్నలకు బోధన లక్ష్యాల ఆరోహణ క్రమం? (డీఎస్సీ- 2012)
ఎ) జీవకణం కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు
బి) అఖ్కీని ఇలా రాయవచ్చు
సి) అధికస్రావం జరిగితే ఏమవుతుంది

1) బి, సి, ఎ 2) సి, బి, ఎ 3) ఎ, సి, బి 4) ఎ, బి, సి
4.మంచి లక్ష్యానికి ఉండకూడని లక్షణం? (డీఎస్సీ-2012)
1) ఉపయోగకరంగా ఉండటం
2) సాధించడానికి వీలుగా సరళంగా ఉండటం
3) వ్యక్తిగతంగా ఉండటం
4) నిర్దిష్టంగా ఉండటం
5.అవగాహన అనే లక్ష్యంలో ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణాలు?(డీఎస్సీ-2006)
1) అర్థ వివరణ, విశ్లేషణ, సంశ్లేషణ
2) వ్యవస్థీకరణ, అర్థ వివరణ, ఎక్స్‌ట్రాపొలేషన్
3) అనువాదం, అర్థ వివరణ, ఎక్స్‌ట్రాపొలేషన్
4) విశ్లేషణ, సంశ్లేషణ, అనువాదం
6.వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతకు అడవుల నిర్మూలన ఒక కారణం అని విద్యార్థి చెప్పాడు. ఇది ఏ లక్ష్యానికి ఉదాహరణ? (డీఎస్సీ-2006)
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
7.విద్యార్థికి జ్వరంతోపాటు తట్టు (పొంగు) వచ్చింది. అతని తల్లిదండ్రులు అది అమ్మవారు, వైద్యం అవసరం లేద న్నారు. కానీ అది వైరస్ వల్ల వచ్చిందని, డాక్టర్ వద్దకు చికిత్సకు తీసుకెళ్లమని తల్లిదండ్రులను ఆ విద్యార్థి ఒప్పించాడు. బోధన లక్ష్యాల్లో దేనికి సంబంధించింది? (డీఎస్సీ- 2004)
1) నైపుణ్యం
2) అన్వయం
3) అవగాహన
4) జ్ఞానం
8.బోధన స్థాయిని పెంచడానికి విద్యా లక్ష్యాలను ఆధారంగా చేసుకొని బోధన పటిమలను వివరించినవారు? (డీఎస్సీ- 2004)
1) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్‌‌చ అండ్ ట్రైనింగ్
2) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్
3) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
4) బయలాజికల్ సైన్‌‌స కరికులమ్ స్టడీ
సమాధానాలు

1) 4

2) 4

3) 4

4) 3

5) 3

6) 3

7) 2

8) 3


మాదిరి ప్రశ్నలు
1.లక్ష్యాలకు సంబంధించి కిందివాటిలో ఏ రెండు సరైనవి?
ఎ) లక్ష్యం అస్పష్టంగా ఉంటుంది
బి) లక్ష్యాన్ని విద్యావేత్తలు నిర్దేశిస్తారు
సి) లక్ష్యం నిర్దిష్టమైంది
డి) లక్ష్యం సాధించడానికి తక్కువ కాలం సరిపోతుంది.
1) ఎ, డి 2) బి, సి 3) సి,డి 4) ఎ, సి
2.శాస్త్రవేత్తల పేర్లు, వారి ఆవిష్కరణలను బట్టీ పట్టిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) విశ్లేషణ
3.జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించి సరికానిది?
1) జ్ఞానం జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనే స్పష్టీకరణాలు కలిగి ఉంది.
2) జ్ఞానం జ్ఞానాత్మక రంగ సోపానాల్లో రెండోది
3) జ్ఞానం మెదడుకు సంబంధించింది
4) జ్ఞానం కంటే అవగాహన మెరుగైంది
4.2123/2123 అనే మానవుని దంత సూత్రాన్ని చూసి మానవునిలో 32 దంతాలుంటాయని తెల్పిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
5.జ్ఞానాత్మక రంగ సోపానాల్లో 4, 6 స్థానాల్లో ఉండేవి?
1) జ్ఞానం- విశ్లేషణ
2) వినియోగం- మూల్యాంకనం
3) విశ్లేషణ- మూల్యాంకనం
4) మూల్యాంకనం- అవగాహన
6.అనుభవాన్ని బట్టి భవిష్యత్తులో జరిగే విషయాన్ని ఊహించడం ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) విశ్లేషణ
7.ఉపాధ్యాయుడు విద్యార్థిని కప్ప, పావురం గుండెల మధ్య భేదాలు చెప్పమని అడిగాడు. ఈ ప్రశ్నద్వారా ఏ లక్ష్యం సాధించినట్లు?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) సంశ్లేషణ
8. A విద్యార్థి సంబంధాలను ఏర్పరచాడు, B విద్యార్థి సంబంధాలను గుర్తించాడు. వీరిలో నెరవేరిన లక్ష్యాలు?
1) A-అవగాహన, B-విశ్లేషణ
2) A-జ్ఞానం , B-అవగాహన
3) A-సంశ్లేషణ , B-అన్వయం
4) A-అన్వయం, B-అవగాహన
9.మూడు విత్తనాల ప్రయోగ చిత్రాన్ని ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీసాడు. మధ్యలో ఉన్న చిక్కుడు విత్తనం నీటి పైభాగాన గాలిలో ఉన్నట్లు తప్పుగా గీయడాన్ని విద్యార్థి గుర్తించాడు. విద్యార్థిలో కల్గిన ప్రవర్తన మార్పు దేనికి సంబంధించింది?
1) విద్యార్థికి ఉపాధ్యాయుని పట్ల గౌరవ భావం లేదు
2) విద్యార్థిలో జ్ఞానం అనే లక్ష్యం సాధించినట్లు
3) విద్యార్థికి చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎక్కువ
4) విద్యార్థిలో అవగాహన అనే లక్ష్యం నెరవేరినట్లు
10.కిందివాటిలో అవగాహనా సోపానం కానిది?
1) బహిర్దీశనం
2) ప్రాగుక్తీకరణ
3) అర్థ వివరణ
4) అనువాదం
11.ఉపాధ్యాయుడు ‘వాయు కాలుష్యంతో కలిగే పరిణామాలను సొంత మాటల్లో రాయండి’ అనే ప్రశ్న ఇచ్చాడు. దీని ద్వారా విద్యార్థిలో ఏ స్పష్టీకరణను సాధించొచ్చు?
1) వివరించడం
2) వ్యాఖ్యానించడం
3) కార్యకార సంబంధం గుర్తించడం
4) దోషాలను కనుక్కోవడం
12.కింది రెండు ప్రవచనాలు వేటిని సూచి స్తాయి?
A) విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం
B) విద్యార్థి శ్వాసక్రియకు, దహన క్రియకు మధ్య భేదాలను తెల్పుతాడు.
1) A- లక్ష్యం, B- స్పష్టీకరణ
2) A- ఉద్దేశం, B- లక్ష్యం
3) A- ఉద్దేశం, B- స్పష్టీకరణ
4) A- స్పష్టీకరణ, B- ఉద్దేశం
13.ఉద్దేశానికి ఉండే లక్షణాల్లో లేనిది?
1) ఉద్దేశాలు దీర్ఘకాలికం
2) ఉద్దేశాలు అస్పష్టంగా ఉంటాయి
3) ఉద్దేశాలు తరగతి గదికి పరిమితం
4) ఉద్దేశాలను విద్యావేత్తలు నిర్దేశిస్తారు
సమాధానాలు

1) 3

2) 1

3) 2

4) 2

5) 3

6) 3

7) 2

8) 4

9) 4

10) 2

11) 2

12) 3

13) 3

Published date : 10 Dec 2014 01:19PM

Photo Stories